పోలీసు కొలువుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నేరచరిత్రను గుర్తించేందుకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చర్యలు చేపట్టింది.
వాల్యూపిచ్ సంస్థతో రిక్రూట్‌మెంట్ బోర్డు ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: పోలీసు కొలువుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నేరచరిత్రను గుర్తించేందుకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చర్యలు చేపట్టింది. ఇందుకోసం వాల్యూపిచ్ అనే సంస్థకు విచారణ బాధ్యతలు అప్పగించింది. పోలీసు కొలువుల విషయంలో రిక్రూట్‌మెంట్ బోర్డు చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో అభ్యర్థులపై ఏమైనా పోలీస్ కేసులున్నాయా తదితర వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. తీవ్రమైన నేరాల కింద కేసులు నమోదైన వారిని గుర్తించి కొలువుల్లోకి తీసుకోరు. అందుకే దరఖాస్తు ప్రక్రియలోనే కేసుల వివరాలు పొందు పరచాల్సిందిగా ఓ కాలమ్ ఏర్పాటు చేసింది. కానీ చాలా మంది ఇందులో ఎటువంటి వివరాలు పొందుపరచలేదు.
ఎస్‌ఐ పోస్టుల కోసం దాదాపు రెండు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే 487 మంది మాత్రమే నేరాల వివరాలను పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే తమ నేరచరిత్రను దాచిపెడితే వారిని గుర్తించేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. వాల్యూపిచ్ వద్ద దేశంలోని 19 వేల న్యాయస్థానాల్లో ఉన్న 12 కోట్ల కేసులకు సంబంధించి ఉన్న డేటాబేస్ ద్వారా అభ్యర్థుల నేర చరిత్రను బయటపెట్టనుంది. ఈ విచారణలో అభ్యర్థుల నేరాలు బయటపడితే అర్హత సాధించినా క్రమశిక్షణ చర్యల కింద వారిని పక్కన పెడతారు.