దాడులు ఆపకపోతే..మినఫా తరహా ఘటనలే! 

CPI Maoist Party South Sub-Zonal Bureau letter - Sakshi

సీపీఐ మావోయిస్టు పార్టీ సౌత్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో లేఖ 

చర్ల: దండకారణ్యంలో పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసి.. అమాయక ఆదివాసీలపై చేస్తున్న దాడులను ఆపకపోతే మినఫా తరహా ఘటనలకు పాల్పడక తప్పదని సీపీఐ మావోయిస్టు పార్టీ సౌత్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో హెచ్చరించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ పేరిట ఒక లేఖను విడుదల చేశారు. అలాగే.. ఈ నెల 21న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లాలోని చింతుప్ప పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల మినఫా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలు, ఆ సందర్భంలో మృతి చెందిన పోలీసు బలగాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలకు సంబంధించి వివరాలు, పార్టీ వివరాలను వెల్లడించింది. సరిహద్దుల్లో ఉన్న సంపదను కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నట్లు పార్టీ ఆరోపించింది.

ఈ క్రమంలో మినఫాలో ఆదివాసీలతో మాట్లాడుతున్న పార్టీ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు కాల్పులకు దిగడంతో సరైన రీతిలో బుద్ధి చెప్పి 19 మందిని మట్టుబెట్టడంతోపాటు 20 మందిని గాయపరిచి వెళ్లగొట్టామని తెలిపారు. ఈ క్రమంలో తమ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు కూడా మృతి చెందారని పార్టీ పేర్కొంది. మృతి చెందిన వారిలో బీజాపూర్‌ జిల్లాలోని ఇంద్రావతి ఏరియాలోని గోండుమెట్టకు చెందిన పార్టీ ప్లాటూన్‌ కమిటీ సభ్యుడు సక్రు, గంగులూరు ఏరియాలోని బుర్కేల్‌గ్రామానికి చెందిన పార్టీ సభ్యుడు రాజేష్, బైరంఘడ్‌ ఏరియాలోని గానార్‌ గ్రామానికి చెందిన సుక్కు మృతి చెందారని, వీరందరికి పార్టీ ఘనంగా నివాళులర్పించి అంత్యక్రియలు నిర్వహించిందని పార్టీ పేర్కొంది.

ఈ దాడిలో చనిపోయిన జవాన్ల నుంచి 11 ఏకే 47 తుపాకులు, 2 ఇన్‌శాస్‌ తుపాకులు, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌ అండ్‌ ఎల్‌ఎంజీ, 2 యూబీజీఎల్‌తోపాటు 1,550 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు లేఖలో వివరించింది. దండకారణ్యంలోని బస్తర్, రాజ్‌నందిగావ్, గడ్చిరోలి తదితర జిల్లాల్లో ఉన్న పోలీస్‌స్టేషన్లు, క్యాంపులను వెంటనే ఎత్తివేయాలని, లేకుంటే మినఫా తరహా దాడులకు దిగుతామంటూ పార్టీ ఈ లేఖలో హెచ్చరించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top