పసుపు ధరలపై ‘కరోనా’ కాటు..

Coronavirus Effect on Turmeric Exports Nizamabad - Sakshi

చైనా, ఇరాన్‌కు తగ్గిన ఎగుమతులు

కనిష్టంగా క్వింటాలుకు రూ.3,800 పడిపోయిన ధర  

ఆందోళనలో పసుపు రైతులు

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: ప్రాణాంతకమైన ‘కరోనా’వైరస్‌ ప్రభావం పసుపు ఎగుమతులపై పడింది. చైనాకు ఎగుమతులు నిలిచిపోవడం, దీనికి తోడు దేశీయ మార్కెట్‌లో పాత నిల్వలు పేరుకుపోవడంతో ఈ సీజన్‌లో పసుపు ధర పూర్తిగా పతనమైందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడినుంచి పసుపు అత్యధికంగా ఇరాన్‌ దేశానికి ఎగుమతి అవుతుంది. అలాగే ఐరోపా దేశాలతో పాటు, చైనాకు కూడా పసుపు ఎగుమతి అవుతుంది. ప్రధానంగా ఇరాన్‌లో పరిస్థితులు బాగా లేకపోవడం మరో పక్క చైనాలో కరోనా వైరస్‌ వల్ల ఏర్పడిన సంక్షోభం కారణంగా ఎగుమతులు పూర్తిగా పడిపోవడంతో దేశీయ మార్కెట్‌లో ధర తగ్గిపోయిందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. 

అన్నదాత కన్నీళ్లు..
పసుపు ధర పతనమై క్వింటాలుకు కనిష్టంగా రూ.3,800 చేరడంతో అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం నిజామాబాద్‌ మార్కెట్‌కు పసుపు రాక ఊపందుకుంది. జనవరిలో మొత్తం 38 వేల క్వింటాళ్లు మార్కెట్‌కు రాగా, ఈనెల 25వ తేదీ నుంచి పంట రావ డం మరింతగా పెరుగుతుంది. గతేడాది కంటే క్వింటాలుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు వ్యాపారులు తగ్గించి కొనుగోలు చేయడంతో పసుపు రైతులు తీవ్ర ఆందోళన లో ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ పం ట సగటు ధర క్వింటాలుకు 5,500 వరకు పలికింది. గరిష్టంగా రూ.6,718 వరకు కొను గోలు చేసిన వ్యాపారులు, ఇప్పుడు పూర్తిగా ధర తగ్గించడంతో పసుపు రైతులు పరేషా న్‌లో పడ్డారు.

భారీగా పాత నిల్వలు..
పసుపు పాత నిల్వలు కూడా భారీగా పేరుకు పోయాయని వ్యాపారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా సుమారు 25 లక్షల క్వింటాళ్ల వరకు పసుపు నిల్వలున్నాయని అంచనా వేస్తున్నారు. ఒక్క నిజామాబాద్‌ మార్కెట్‌ పరిధిలోనే సుమారు 3 లక్షల క్వింటాళ్ల పసుపు కోల్డ్‌ స్టోరేజీల్లో ఉన్నట్లు మార్కెటింగ్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో గత ఏడాదితోపాటు అంతకు ముందు సీజనుకు సంబంధించిన పసుపు కూడా ఉంటుందని చెబుతున్నారు.

ఎగుమతులు తగ్గాయి..  
విదేశాలకు పసుపు పంట ఎగుమతి తగ్గింది. ముఖ్యంగా కరోనా వైరస్‌ ప్రభావంతో చైనాకు ఎగుమతులు నిలిచిపోయాయి. అలాగే అత్యధికంగా కొనుగోలు చేసే ఇరాన్‌ కూడా సంక్షో భంలో ఉంది. దేశీయ మార్కెట్‌లోనూ డిమాండ్‌ తక్కువగా ఉంది. దీంతో ధర పెట్టలేకపోతున్నాము. అలాగే మహారాష్ట్రలో పసు పు విస్తీర్ణం పెరగడంతో పంట ఎక్కువగా వస్తోంది. డిమాండ్, సరఫరాకు తేడా ఉండటంతో ధర తగ్గుతోంది.    –కమల్‌ కిశోర్‌ ఇనానీ,    పసుపు ఎగుమతిదారుడు

బతుకు అందేరవుతోంది..
వ్యాపారులు పసుపు ధర పూర్తిగా తగ్గించారు. మంచి రకం పంటను మార్కెట్‌కు తెస్తే క్వింటాలుకు రూ.5,385 ధర పెట్టిండ్రు. ఈ ధరకు అమ్మితే పెట్టుబడి కూడా రాదు. రెండు ఎకరాల్లో పసుపు వేసుకున్న. ఎరువు, విత్తనం, కూలీ ఖర్చులన్నీ కలిపి పెట్టుబడి రూ.లక్షన్నర దాటింది. పంట అంతా అమ్మినా పెట్టుబడి ఖర్చులు కూడా రాక మా బతుకే అందేరయ్యేట్లుగా ఉంది.    – ఇప్పగంగయ్య, పసుపు రైతు, దోంచంద, నిజామాబాద్‌జిల్లా.  

కైకిల్లకు చాల్తలేవు.. 
పసుపు అమ్మితే వచ్చే డబ్బులు కూలీల ఖర్చులు (కైకిళ్లకు)కు చాలడం లేదు. పసుపు తవ్వకం కోసం కూలీలకు గంట లెక్క చొప్పున చెల్లించాల్సి వస్తుంది. 34 సంచులు తెస్తే బీట్ల రూ.4,426 ధర పెట్టిండ్రు. ఈ ధరకు పంట అమ్మితే నష్టమే. ఇదేం ధర అని వ్యాపారులను అడిగితే గుంజాయిషీలేదని అంటున్నరు. తిరిగి ఇంటికి తీసుకపోలేము.. ఏం చేయాలో అర్థమైతలేదు.    – గూడ నర్సారెడ్డి, పసుపురైతు ఇబ్రహీంపట్నం, జగిత్యాల జిల్లా.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top