ఇంటి వద్దే ‘కరోనా’ శాంపిళ్ల సేకరణ

Coronavirus: Collection of Covid-19 Suspects Samples at their homes - Sakshi

ప్రత్యేక సంచార వాహనం... 

నిర్ధారణ ఫలితాలు వచ్చేదాకా ఇంట్లోనే క్వారంటైన్‌ 

ఇంటి సర్వేలో 2,200 మంది అనుమానితుల గుర్తింపు 

సాక్షి, హైదరాబాద్‌: ఇకపై కరోనా లక్షణాలున్న అనుమానితులు తమ శాంపిళ్లు ఇవ్వడానికి నిర్ధేశించిన ఆసుపత్రులకు రావాల్సిన అవసరంలేదు. వారి ఇళ్ల వద్దకే వెళ్లి శాంపిళ్లు సేకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని సిద్ధం చేస్తోంది. దీన్ని కరోనా శాంపిళ్ల సేకరణ సంచార వాహనంగా   పిలుస్తారు. ఎక్కువ కేసులు హైదరాబాద్‌లో నమోదవుతున్నందున, ఇక్కడి నుంచే ఈ వాహన సేవలు ప్రారంభించాలని యోచిస్తున్నారు. నేరుగా అనుమానితుడి ఇంటికెళ్లి, అక్కడే శాంపిళ్లను సేకరిస్తారు. ఆ శాంపిళ్లను ప్రత్యేకంగా భద్రపరిచి ఈ వాహనంలో నిర్ధారణ పరీక్షా కేంద్రానికి తీసుకెళ్తారు. ఇందుకోసం అత్యాధునిక రిఫ్రిజిరేటర్లు, ఇతర పరికరాలను కొనుగోలు చేస్తున్నారు.  

ఫలితాలు వచ్చేదాకా హోం క్వారంటైన్‌లోనే... 
సేకరించిన శాంపిళ్ల నిర్ధారణ పరీక్షలు వచ్చేదాకా అనుమానిత వ్యక్తులను హోం క్వారంటైన్‌లో ఉంచుతారు. ఒకవేళ వారికి పాజిటివ్‌ వస్తే నిర్ధేశించిన ఆ సుపత్రికి తరలిస్తారు. ఇలా ఇంటికే వచ్చి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపడం వల్ల సమయం ఆదాతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ శాంపిళ్లను సేకరించవచ్చని అధికారులు అంటున్నారు. 

ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌కు స్వస్తి: అనుమానితులందరినీ ఒకేచోట ఉంచడం వల్ల, వాళ్లలో ఒకరి నుంచి ఒకరికి వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. పరీక్షా ఫలితాలు ఆలస్యం అవుతున్న కొద్దీ ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌లో ఉన్న అనుమానితులు అసహనానికి లోనవుతున్నారు. ఇంటి వద్దే శాంపిళ్లను సేకరించడం వల్ల ఇలాంటి సమస్యలను అధిగమించొచ్చని అధికారులు భా విస్తున్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో ఒకేసారి భారీగా శాంపిళ్లను సేకరించాల్సి వచ్చినా, ఈ విధా నం ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.  

ఇంటింటి సర్వేలో 2,200 అనుమానితులు.. 
కంటైన్మెంట్‌ ఏరియాల్లో ఇంటింటి సర్వే ద్వారా లక్ష లాది మందిని వైద్య బృందాలు కలిసి వివరాలు సే కరించాయి. ఇంటింటి సర్వేలో ఇప్పటివరకు 2,200 మంది కరోనా లక్షణాలున్న అనుమానితులను గుర్తించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే వారందరికీ పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top