కృష్ణమ్మ కట్టడికి మరో ఎత్తు! | Construction of Gurjapur barrage across Krishna stopped | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ కట్టడికి మరో ఎత్తు!

Mar 23 2018 2:00 AM | Updated on Mar 23 2018 6:19 AM

Construction of Gurjapur barrage across Krishna stopped - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కృష్ణా జలాలను ఎగువనే కట్టడి చేసేందుకు కర్ణాటక మరో ఎత్తు వేస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా వాడుకునేందుకు కొత్త బ్యారేజీలను నిర్మిస్తోంది. ఇప్పటికే గుజాల్‌ బ్యారేజీ నిర్మించిన ఆ రాష్ట్రం.. తాజాగా గుర్జాపూర్‌ బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టింది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌ వంటి ప్రాజెక్టులు నిండితే కానీ దిగువకు నీళ్లు రాని పరిస్థితుల నేపథ్యంలో కొత్త బ్యారేజీలతో రాష్ట్రానికి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే నాలుగు.. అదనంగా రెండు బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపుల మేరకు కృష్ణా జలాల్లో కర్ణాటకకు 734 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. కర్ణాటక ఇప్పటికే ఆ నీటిని దాదాపు పూర్తిగా వినియోగించుకుంటోంది. 

అదనంగా నీటిని వినియోగించుకునేందుకు పదేళ్ల కింద బీజాపూర్‌ జిల్లాలో బుధిహాల్‌–పీరాపూర్, రాయచూర్‌ జిల్లాలో నందవాడ్జి, రామత్తల్, భగల్‌కోట్‌ జిల్లాలోని తిమ్మాపూర్‌ల వద్ద కృష్ణా నదిపై నాలుగు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించింది. 21 టీఎంసీల నీటిని తీసుకుని 1.29 లక్షల హెక్టార్లకు అందించాలన్నది వాటి లక్ష్యం. అయితే ఆ ప్రాజెక్టుల పనులు చేపట్టినా వాటికి ఎలాంటి అనుమతులు, నీటి కేటాయింపులు లేకపోవడంతో నిర్వహణలోకి తేలేకపోయింది. కానీ పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అధికారిక అనుమతులు ఇచ్చిన వెంటనే తమ ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియను వేగిరం చేసింది. గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తూ పోలవరం చేపట్టిన వెంటనే ఎగువ రాష్ట్రాలకు 35 టీఎంసీల మేర వాటాలు దక్కుతాయని బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డులో స్పష్టంగా ఉంది. ప్రస్తుతం ఏపీ పోలవరం చేపట్టడంతో కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు దక్కుతాయి. 

దీంతో తమకు దక్కే 21 టీఎంసీల వినియోగం కోసమే ఈ పథకాలను చేపట్టినట్లు చూపి ఇటీవలే కర్ణాటక అన్ని అనుమతులు తెచ్చుకుంది. తాజాగా నీటి వినియోగాన్ని కూడా మొదలుపెట్టింది. ఈ ఎత్తిపోతల పథకాలు పాలమూరు జిల్లాకు ఎగువనే ఉండటంతో ఇప్పటికే దిగువకు ప్రవాహాలు తగ్గాయి. ఇక ప్రధాన కృష్ణాలో గుజాల్‌ బ్యారేజీని నిర్మించి దీని ద్వారా నాలుగైదు టీఎంసీలు వినియోగించుకునేందుకు యత్నిస్తోంది. మరోవైపు రాయచూర్‌ జిల్లాలో కృష్ణా నీటిని వాడుకునేలా 1.2 టీఎంసీ సామర్థ్యంతో గుర్జాపూర్‌ బ్యారేజీ నిర్మిస్తోంది. దీని ద్వారా 5 నుంచి 6 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంది. మొత్తంగా 10 నుంచి 11 టీఎంసీలను ఎగువనే అడ్డుకునేందుకు కర్ణాటక యత్నిస్తోంది. దీంతో జూరాలకు వచ్చే ప్రవాహాలు పూర్తిగా తగ్గిపోతాయి. అదే జరిగితే జూరాలపై ఆధారపడిన కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ పథకాలకు నీరు లేక అల్లాడాల్సిన పరిస్థితి తలెత్తనుంది. 

సీడబ్ల్యూసీకి ఫిర్యాదు 
కర్ణాటక బ్యారేజీలపై ఆలస్యంగా మేల్కొన్న రాష్ట్ర నీటి పారుదల శాఖ కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గురువారం ఈఎన్‌సీ మురళీధర్‌ సీడబ్ల్యూసీకి లేఖ రాశారు. హైడ్రాలజీ క్లియరెన్స్‌లు వచ్చే వరకు నీటి వినియోగం జరగకుండా చూడాలని, గుర్జాపూర్‌ బ్యారేజీ నిర్మాణం జరగకుండా ఆదేశాలివ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement