28 ఏళ్లు పోరాడి గెలిచాడు..  | Constable won after long battle of 28years | Sakshi
Sakshi News home page

28 ఏళ్లు పోరాడి గెలిచాడు.. 

Dec 24 2017 2:10 AM | Updated on Sep 17 2018 6:26 PM

Constable won after long battle of 28years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 28 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌కు న్యాయం జరిగింది. ఊహించని ఘటనతో ఉద్యోగం కోల్పోయిన కానిస్టేబుల్‌కు అనుకూలంగా ఉమ్మడి హైకోర్టు తీర్పునిచ్చింది. గతంలో ట్రిబ్యు నల్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఆ కానిస్టేబుల్‌ను సర్వీసు నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సమర్థించింది. కానిస్టేబుల్‌ను వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి వహాజుద్దీన్‌కు చెల్లించాల్సిన జీతభత్యాల బకాయిలను 9 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. కానిస్టేబుల్‌కు రూ.25వేలను పరిహారంగా చెల్లించాలంది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 

అసలేం జరిగిందంటే.. 
ఎండీ వహాజుద్దీన్‌ వరంగల్‌ జిల్లా జనగామ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఓ బస్సు కండక్టర్‌ డబ్బు దొంగిలిస్తూ గండికోట లచ్చమ్మ అనే ఆమె రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. కోర్టు రిమాండ్‌ విధించడంతో ఆమె ను జనగామ స్టేషన్‌ నుంచి వరంగల్‌ కేంద్ర కారాగారానికి తీసుకెళ్లే బాధ్యతలను వహాజుద్దీన్‌తోపాటు మరో కానిస్టేబుల్‌కు అప్పగించారు. మహిళా ఖైదీ కావడంతో మహిళా పోలీసును పంపడంతోపాటు బేడీలు ఇవ్వాలని అధికారులను వహాజుద్దీన్‌ కోరినా ఇవ్వలేదు. అదే సమయంలో వరంగల్‌ ఇన్‌స్పెక్టర్‌(కమ్యూనికేషన్‌)కు ఓ బ్యాట రీ అప్పగించే పని కూడా వహాజుద్దీన్‌కు అప్పగించారు. దీంతో ఖైదీని తీసుకుని మరో కానిస్టేబుల్‌తో కలసి వహాజుద్దీన్‌ 1989 డిసెంబర్‌ 6న వరంగల్‌కు బయలుదేరాడు. వరంగల్‌లో బ్యాటరీని ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించేందుకు వహాజుద్దీన్‌ వెళ్లగా, మరో కానిస్టేబుల్‌ మహిళా ఖైదీతో స్థానిక బస్టాప్‌లో వేచి ఉన్నాడు. బ్యాటరీ ఇచ్చాక మరో కానిస్టేబుల్, ఖైదీ స్థానిక బస్సును ముందు డోర్‌ నుంచి ఎక్కగా, హడావుడిగా వచ్చిన వహాజుద్దీన్‌ వెనక డోర్‌ నుం చి ఎక్కాడు. ఖైదీతో మరో కానిస్టేబుల్‌ ఉండటం, బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి ఉండటంతో వహాజుద్దీన్‌ ఖైదీ వద్దకు వెళ్లలేకపోయాడు. ఖైదీ తప్పించుకున్న విషయాన్ని వహాజుద్దీన్‌కు కానిస్టేబుల్‌ తెలిపాడు. ఖైదీ ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఉద్యోగంలోకి తీసుకోవాలన్న ట్రిబ్యునల్‌ 
విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని వహాజుద్దీన్‌ను సస్పెండ్‌ చేస్తూ 1989 డిసెంబర్‌ 18న ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ అనంతరం ఓ సాధారణ మహిళా ఖైదీకి ఎస్కార్ట్‌గా ఉండలేని వాళ్లు పోలీస్‌ శాఖకు ఏ మాత్రం పనికిరారంటూ వహాజుద్దీన్, అతనితోపాటు వెళ్లిన కానిస్టేబుల్‌ (ఆ తర్వాత మరణించాడు)ను సర్వీసు నుంచి తొలగిస్తూ 1992 ఆగస్టు 8న అప్పటి ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు అప్పీ ల్‌ చేసుకోగా.. డీఐజీ, రాష్ట్ర డీజీపీ కూడా ఎస్పీ ఉత్తర్వులనే సమర్థించారు. దీంతో వహాజుద్దీన్‌ 1993లో పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్, వహాజుద్దీన్‌ బాధ్యుడిని చేయడం తగదని చెప్పింది. అతడిని సర్వీసు నుంచి తొలగించడానికి వీల్లేదని, జీత భత్యాలను చెల్లించాలని 2002లో ఆదేశించింది. 

బేడీలు ఇవ్వలేదు.. పైగా అదనపు బాధ్యత.. 
ట్రిబ్యునల్‌ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం 2004లో హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్‌ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ‘మహిళా కానిస్టేబుల్‌ను ఇవ్వాలని, బేడీలు సమకూర్చా లని కోరినా ఇవ్వలేదు. అదనంగా బ్యాటరీ అప్పగించే బాధ్యతను ఇచ్చిన విషయాన్ని జిల్లా ఎస్పీ పరిగణనలోకి తీసుకోలేదు. బేడీలు ఇచ్చి ఉంటే ఖైదీ తప్పించుకుని ఉండకపోవచ్చు. వహాజుద్దీన్‌ను తొలగించేందుకు ఎస్పీ ఇచ్చిన కారణాలు తార్కికంగా లేవు. మహిళా ఖైదీ బాధ్యత లను మహిళా కానిస్టేబుల్‌కు కాకుండా పురుష కానిస్టేబుళ్లకు అప్పగించిన జనగామ పోలీసులదే ప్రాథమిక నిర్లక్ష్యం. వారిపై ఎస్పీ చర్యలు తీసుకుని ఉండాల్సింది’ అని వ్యాఖ్యానించింది. వహాజుద్దీన్‌ కేసును ఎస్పీ సరైన దృక్కోణంలో చూడలేదని తేల్చి చెప్పింది. డీఐజీ, డీజీపీల ఉత్తర్వులను తప్పుపట్టింది. ట్రిబ్యునల్‌ తీర్పును సమర్థించింది. ఊహించని ఘటన ఎప్పటికీ నిర్లక్ష్యం కిందకు రాదని స్పష్టం చేసింది. 

కోల్పోయిన జీవితాన్ని ఇవ్వగలరా? 
‘ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేసినంత మాత్రాన వహాజుద్దీన్‌కు న్యాయం జరిగినట్లు కాదు. 32 ఏళ్ల వయసులో వహాజుద్దీన్‌ను సర్వీసు నుంచి తొలగించారు. ట్రిబ్యునల్‌లో న్యాయం పొందేందుకు అతనికి దశాబ్ద కాలం పట్టింది. ట్రిబ్యునల్‌ తీర్పును సవాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల సమయం తీసుకుంది. ఇన్నేళ్లు వహాజుద్దీన్, అతని కుటుంబ సభ్యులు ఎంతో క్షోభ అనుభవించి ఉంటారు. 25 ఏళ్లుగా అతను సర్వీసులో లేడు. ఇప్పుడు సర్వీసులోకి తీసుకున్నా.. పదవీ విరమణకు దగ్గర్లో ఉంటాడు. వహాజుద్దీన్‌ కోల్పోయిన ఈ జీవితాన్ని ఎవరూ తీసుకురాలేరు. వహాజుద్దీన్, అతని కుటుంబానికి జరిగిన అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అప్పటి ఎస్పీ, డీఐజీ, డీజీపీలలో ఒకరైనా వివేచన చూపి ఉండాల్సింది. ఎట్టకేలకు వహాజుద్దీన్‌కు న్యాయ ఫలాలు దక్కాయి’ అని ధర్మాసనం పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement