
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుళ్ల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందంటూ దాఖలైన పిల్‌లో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ అభ్యంతరాలపై ప్రభుత్వ వాదనను తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మెదక్ జిల్లా పుల్కల్ మండలం లక్ష్మీసాగర్ గ్రామస్తుడు మహేశ్ మాదిగ దాఖలు చేసిన పిల్‌ను ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది.
పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ మే 31న వెలువరించిన ప్రకటనలకు అనుగుణంగా చేపట్టిన కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను నిలిపివేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అర్జున్ వాదించారు. స్పెషల్ పోలీస్, ఆర్మ్‌డ్ రిజర్వు పోలీస్, స్పెషల్ పోలీస్ ఫోర్స్ తదితర విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టుల అభ్యర్థులకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్లకు 3 మార్కులు వెయిటేజీ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమన్నారు. హోంగార్డులకు వయోపరిమితి పెంపు నిర్ణయం రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నష్టం చేకూరుస్తుందన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను 24వ తేదీకి వాయిదా వేసింది.