
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన ఆరుగురు అభ్యర్థులను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించడం సబబు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. వారిలో ఇద్దరు యువకులపై ఆడ పిల్లల వెంట పడ్డారన్న కేసులున్నాయని వారి ఎంపికను రద్దు చేయడం సరికాదని పేర్కొంది. ఆ కేసులు నిరూపణ కాకపోవడంతో కింది కోర్టు కొట్టివేసిందని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రేమించకపోతే చదువులకు ఆటంకం కలిగిస్తామంటూ బెదిరించిన ఇద్దరితోపాటు కుటుంబ, ఆస్తి తగాదాల కేసుల్లో ఉన్న మరో నలుగురు అభ్యర్థులు తమను పోలీస్ కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికయ్యాక ప్రభుత్వం తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలను దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం.. ఆరుగురిలో ఒకరిపై మాత్రమే క్రిమినల్ కేసు విచారణ కొనసాగుతోందని, మిగిలిన వారి కేసులు వీగిపోయాయని పేర్కొంది. ఆ ఆరుగురినీ ఎంపికకు అనుమతించాలని ఆదేశించింది. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థులపై కేసులు ఉండరాదని చట్టంలో ఉందని, కానీ ఏ తరహా కేసులో స్పష్టత లేదని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారి ఎంపికను రద్దు చేస్తూ ఈ ఏడాది జూన్ 3, ఆగస్టు 19 తేదీల్లో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. అవతార్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న మార్గదర్శకాలను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు.