కదన రంగంలోకి కాంగ్రెస్‌ | Congress Party Meetings Schedule In Mahabubnagar | Sakshi
Sakshi News home page

కదన రంగంలోకి కాంగ్రెస్‌

Oct 9 2018 8:30 AM | Updated on Aug 27 2019 4:45 PM

Congress Party Meetings Schedule In Mahabubnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడంతో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు నుంచి సత్తా చాటేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ మలివిడత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 10 నుంచి 12 వరకు ఉమ్మడి పాలమూరులో ప్రచారం చేయనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం షెడ్యూల్‌ విడుదల చేశారు.

ఈనెల 10న దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట నుంచి రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ నెల 4న ఉమ్మడి జిల్లాలో ఒకరోజు ప్రచారం చేయగా... ఈసారి ఏకంగా మూడు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఈనెల 10న దేవరకద్ర, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలలో పర్యటన సాగుతుంది. అలాగే రెండో రోజు ఈ నెల 11న మహబూబ్‌నగర్, జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనుండగా.. మూడో రోజైన 12వ తేదీన కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తిలలో కాంగ్రెస్‌ నేతల ప్రచారం ఉంటుంది.
 
ఆశలన్నీ పాలమూరుపైనే..  
కాంగ్రెస్‌ పార్టీ ఈ సారి ఉమ్మడి పాలమూరు ప్రాం తంపై భారీ ఆశలు పెట్టుకుంది. రాష్ట్రంలోనే ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉండడంతో గట్టి ఫోకస్‌ పెట్టింది. అందులోనూ పార్టీలో రాష్ట్ర స్థాయి గుర్తిం పు పొందిన నేతలందరూ కూడా పాలమూరు వా సులే కావడంతో కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపు తోంది. మాజీ మంత్రులు డీకే అరుణ, చిన్నారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డితో పాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి కూడా ఇక్కడి వారే. గత ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ హవా వీచినా... పాలమూరులో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ఎదురొడ్డి నిలిచింది. గత ఎన్నికల్లో ఐదు స్థానాలు గెలుపొందగా.. ఈసారి ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాలను గెలవాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అదే లక్ష్యంతో రాష్ట్రంలోనే మొట్ట మొదటగా ప్రచారాన్ని ఉమ్మడి పాలమూరులోని అలంపూర్‌ నుంచే శ్రీకా రం చుట్టారు. ఇక రెండో దశలో భాగంగా మూడు రోజుల ప్రచారం కూడా ఇక్కడి నుంచే రూపొందించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

వనపర్తి మినహా పూర్తి 
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ఎన్నికల ప్రచారం ఉమ్మడి జిల్లాలో వనపర్తి నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో పూర్తి కానుంది. ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను రెండు నియోజకవర్గ కేంద్రాలు జిల్లాల పునర్విభజనలో భాగంగా పక్క జిల్లాలో కలిశాయి. షాద్‌నగర్‌ నియోజకవర్గం పూర్తిగా రంగారెడ్డి జిల్లాలో, కొడంగల్‌ నియోజకవర్గ కేంద్రంతో పాటు రెండు మండలాలు వికారాబాద్‌ జిల్లాలో కలిశాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీ పాలమూరుకు సంబంధించి 12 నియోజకవర్గాలలో ప్రచార షెడ్యూల్‌ను రూపొందించింది.

ఈ మేరకు తొలి విడతలో భాగంగా ఈ నెల 4న చేపట్టిన కాంగ్రెస్‌ ప్రచారం సభలు, రోడ్డుషోలు అలంపూర్, గద్వాలలో పూర్తి చేశారు. మలి విడతలో భాగంగా ఈ నెల 10 నుంచి చేపట్టిన ప్రచారం తొమ్మిది నియోజకవర్గాల మీదుగా సాగనుంది. ప్రతీ రోజు మూడు నియోజకవర్గాల చొప్పున ప్రచారం ఉండేలా షెడ్యూల్‌ రూపొందించారు. తద్వారా ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాలలో ప్రచారం పూర్తి కానుంది. కానీ ఒక్క వనపర్తి నియోజకవర్గంలో మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంటుంది. తర్వాత మరోమారు వనపర్తిలో ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
 
అభ్యర్థుల పరిస్థితి ఏమిటి? 

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడంతో ముమ్మర ప్రచారానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్‌ పార్టీ బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో మాత్రం సస్పెన్స్‌ కొనసాగిస్తోంది. ఒక వైపు మహాకూటమితో పొ త్తులకు చర్చలు సాగుతుండగా.. మరోవైపు పలు నియోజకవర్గాల్లో ఆశావహుల సంఖ్య భారీగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు.

గద్వాల, అలంపూర్, కొడంగల్, వనపర్తి, కల్వకుర్తిల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కావడంతో .. మరోసారి వారికే అవకాశం దక్కనుంది. టికెట్ల దరఖాస్తు విషయంలో కూడా ఆయా స్థానాల్లో ఎలాంటి పోటీ తలెత్తలేదు. మిగతా చోట్ల కూడా పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారే ఇన్‌చార్జీలుగా ఉన్నారు. అయితే ఆయా స్థానాల్లో మరికొందరు అభ్యర్థులు సైతం టిక్కెట్టు కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల విషయంలో స్పష్టత లేకుండానే ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement