మున్సిపోల్స్‌లో కాంగి‘రేస్‌’

Congress Party Has Confidence About Winning In Muncipal Elections In Janagon - Sakshi

సాక్షి, జనగామ : పంచాయతీ నుంచి ప్రాదేశిక ఎన్నికల వరకు, శాసన సభనుంచి లోక్‌సభ ఎన్నికల వరకు జరిగిన వరుస ఎన్నికల్లో ఓటములతో డీలా పడిన కాంగ్రెస్‌ పార్టీ పూర్వ వైభవం కోసం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. బలమైన క్యాడర్‌ను కలిగిన ఆ పార్టీ ప్రస్తుతం మునిసిపాలిటీ ఎన్నికలే టార్గెట్‌గా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతుంది. కాంగ్రెస్‌ కంచుకోటగా రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన జనగామలో ఆ పార్టీ పట్టు నిలుపుకోవడం కోసం తహతహలాడుతోంది.

క్షేత్రస్థాయి నుంచి పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేసి నూతనోత్తేజం నింపడానికి సిద్ధమైంది. ఒకవైపు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, భారతీయ జనతా పార్టీ సభ్వత్వ నమోదుతో కార్యకర్తలను సమీకరిస్తుండగా కాంగ్రెస్‌ పార్టీ జెండా పండుగ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తోంది. ఈసారైనా కలిసొచ్చేనా? కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్యకు రాజకీయంగా జన్మనిచ్చిన జనగామ ఆది నుంచి కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా మారింది.

నాలుగు దశాబ్దాల పాటు పొన్నాల నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఘనమైన చరిత్రను సొంతం చేసుకుంది. ముఖ్యంగా జనగామ మునిసిపాలిటీ చరిత్రలో ఆ పార్టీ తిరుగులేని ఆధిక్యతను కనబరిచింది. 1953 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు మినహాయిస్తే ప్రతిసారి కాంగ్రెస్‌ పార్టీ మునిసిపల్‌ చైర్మన్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. తొలిసారిగా 1987లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ చైర్మన్‌ స్థానాన్ని దక్కించుకోగా రెండోసారి 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ చైర్‌పర్సన్‌ స్థానాన్ని దక్కించుకుంది. మిగిలిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

2014 ఎన్నికల్లో 28 వార్డుల్లో కాంగ్రెస్‌ పార్టీ 14 స్థానాల్లో విజయం సాధించింది. మరో ఇద్దరు అభ్యర్థులు 1, 2 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ ఇద్దరు అభ్యర్థులు విజయం సాధిస్తే ఏకపక్షంగానే చైర్మన్‌ స్థానం దక్కి ఉండేది. కానీ అనూహ్యంగా కేవలం ఆరు స్థానాల్లోనే విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ చైర్‌పర్సన్‌ స్థానాన్ని దక్కించుకుంది. మెజారిటీ కౌన్సిలర్లను గెలుచుకున్నప్పటికీ చైర్మన్‌ స్థానాన్ని దక్కించుకోక పోవడంలో పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించలేదనే విమర్శలు అప్పట్లో వ్యక్తమయ్యాయి.

ఇప్పుడు మొదటి నుంచే పక్కా ప్రణాళికను అమలు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. రిజర్వేషన్లలో బీసీ కోటాకు ప్రభుత్వం కోత విధిస్తున్నప్పటికీ పార్టీపరంగా బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బీసీ, దళిత, మైనార్టీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ‘పొన్నాల’ మకాం మునిసిపాలిటీ ఎన్నికలు అయ్యే వరకు పొన్నాల లక్ష్మయ్య జిల్లా కేంద్రంలోనే మకాం వేయనున్నారు. ప్రతి వార్డులో పార్టీ బలోపేతంపై ఫోకస్‌ పెట్టనున్నారు.

ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే స్థానిక సమస్యలను ప్రచార అస్త్రాలుగా ఎక్కు పెట్టడానికి రెడీ అవుతున్నారు. వార్డుల వారీగా ఆశావహుల జాబితాను తయారు చేయడం, పార్టీ క్యాడర్‌కు దిశానిర్ధేశం చేయడం, పట్టణ ప్రజలతో మమేకం కావడం వంటి కార్యక్రమాలను చేపట్టడానికి సిద్ధమయ్యారు. మూడు రోజుల పాటు జెండా పండుగలు శనివారం పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో మునిసిపాలిటీ పరిధిలో విస్తృతంగా జెండా పండుగను జరుపనున్నారు. రోజుకు 10 వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పార్టీ జెండాలను ఆవిష్కరించనున్నారు. పొన్నాలతోపాటు టీపీసీసీ మునిసిపాలిటీ ఎన్నికల పరిశీలకుడు మక్సూద్‌ అహ్మద్‌తోపాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, ముఖ్యనేతలను ఆయా వార్డుల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top