పోట్ల లేదా రేణుకా చౌదరి!

The Congress has pending the Khammam constituency - Sakshi

వీరి వైపే కాంగ్రెస్‌ మొగ్గు

ఖమ్మం ఎంపీ సీటు కమ్మ వర్గానికి ఇవ్వాలన్న యోచనలో అధిష్టానం

సాక్షి, న్యూఢిల్లీ: ఖమ్మం లోక్‌సభ బరి నుంచి కమ్మ సామాజిక వర్గ నేతకే టికెట్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. టీపీసీసీ నాయకత్వం ప్రతిపాదన కూడా ఇదేనని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌.. ఖమ్మం నియోజకవర్గాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇక్కడి నుంచి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పోటీ చేస్తారని ప్రచారం సాగినా.. ఖమ్మం కాంగ్రెస్‌లోని ఓ వర్గం వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఆమె బుధవారం పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియాను కలిసి నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులను వివరించారు.

అయితే గతంలో సుదీర్ఘ కాలం టీడీపీలో ఉండి టీఆర్‌ఎస్‌లో చేరి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు పేరును కూడా కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలించింది. ఖమ్మం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం నుంచే అభ్యర్థిని నిలబెట్టడం కలిసొస్తుందని పీసీసీ పెద్దలు నివేదించినట్లు తెలుస్తోంది. అయితే రేణుకా చౌదరికి ఢిల్లీ పలుకుబడి కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి కాకుండా ఇతర సామాజికవర్గ నేతలకు టికెట్‌ ఇవ్వాలంటే ఎన్నికల ఖర్చు భరించే స్తోమత ఉన్న నాయకుడికి కేటాయించే అవకాశం ఉంది. 

పొంగులేటి కాంగ్రెస్‌లో చేరతారా..?
వైఎస్సార్‌సీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ దక్కని పరిస్థితుల్లో ఆయన తమ పార్టీలో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావించాయి. కానీ పొంగులేటి మాత్రం టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ వచ్చినా రాకపోయినా పార్టీ మారే ప్రసక్తే లేదని తన అనుచరులతో చెప్పినట్లు సమాచారం. ఆర్థికంగా బలవంతుడైన మరో నేత టికెట్‌ ఆశిస్తున్నప్పటికీ.. ఆయనకు టికెట్‌ దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top