డిమాండ్‌కు తగ్గట్లు పంటలు

CM KCR Says Comprehensive Agriculture Policy Will Be Discussed Soon - Sakshi

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యం 

రైతుల దృక్పథంలో మార్పులు రావాలి.. 

త్వరలో రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తా 

రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం రూపొందాలి 

వ్యవసాయ రంగంపై సుదీర్ఘ సమీక్షలో సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్‌ ఉండే పంటలు పండించేలా రైతుల దృక్పథంలో మార్పు తేవాలని సూచించారు. త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులు, రైతుబంధు సమితులు, వ్యవసాయాధికారులతో మాట్లాడుతానని వెల్లడించారు. శనివారం వ్యవసాయ శాఖపై సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. 
(చదవండి: కేసీఆర్‌ క్వారంటైన్‌ సీఎం)

‘రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం రూపొందాలి. దానికి అనుగుణంగానే ప్రతీదీ జరగాలి. రైతులు ఏ పంటలు వేయాలనేది ప్రభుత్వమే నిర్ణయించాలి. తెలంగాణ ప్రజల ఆహార అవసరాలు, ఇతర ప్రాంతాల్లో డిమాండుకు తగ్గ పంటలు వేసేలా ప్రణాళిక తయారు చేయాలి. ప్రత్యామ్నాయ పంటలు గుర్తించాలి. వాటిని రైతులకు సూచించాలి. దాని ప్రకారమే సాగు జరగాలి. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది’అని సీఎం వివరించారు. 

రైతులకు ఏం కావాలో గుర్తించాలి.. 
‘వ్యవసాయ శాఖ ఇన్వెంటరీ తయారు కావాలి. వ్యవసాయ శాఖకు ఉన్న ఆస్తులు, భవనాలు ఇతరత్రా వివరాలు సమగ్రంగా నమోదు చేయాలి. రికార్డు చేయాలి. గ్రామాల్లో వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క తీయాలి. ఇంకా రైతులకు ఏం కావాలో గుర్తించాలి. దానికి అనుగుణంగా భవిష్యత్‌ ప్రణాళిక తయారు చేయాలి. రైతుల నుంచి వివరాలు సేకరించాలి. కచ్చితమైన వివరాలతో ఓ ఫార్మాట్‌లో సమాచారం సేకరించాలి. త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తెలంగాణ సమగ్ర వ్యవసాయ విధానంపై చర్చిస్తా’ అని సీఎం పేర్కొన్నారు.

కరోనాపైనా సమీక్ష... 
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలుపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జిల్లాలవారీగా వైరస్‌ వ్యాప్తి పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌ అమలు, వివిధ ప్రాంతాల్లో అమలవుతున్న సడలింపుల వల్ల తలెత్తిన పరిస్థితిపై వాకబు చేశారు.
(చదవండి: సహజీవనం చేయాల్సిందే)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top