వాస్తవిక బడ్జెట్‌!

CM KCR Review On Allocation Of 2020 Budget - Sakshi

రూ. 1.65 లక్షల కోట్లతో అంచనాలు

రుణమాఫీ, పీఆర్సీ, 57 ఏళ్లకే పింఛన్లు... కొత్త కార్యక్రమాలకు నిధుల కేటాయింపు

బడ్జెట్‌ రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ కసరత్తు

వచ్చే నెల 6 నుంచి బడ్జెట్‌ సమావేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో వాస్తవిక పరిస్థితులకు తగ్గట్లు 2020–21కి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. బడ్జెట్‌ రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ సీనియర్‌ అధికారులతో గురువారం ప్రగతి భవన్‌లో రాత్రి 11:30 గంటల వరకు సుదీర్ఘ కసరత్తు చేశారు. రాష్ట్ర ఆదాయం, అవసరాలను బేరీజు వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్‌ రూపకల్పన జరగాలని అధికారులకు సూచించారు. ఎప్పటిలాగే ఈ బడ్జెట్‌లో సైతం వ్యవసాయం, నీటిపారుదల, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూనే ఇతర రంగాలకు అవసరమైన మేర కేటాయింపులు చేయాలని కోరారు.

కొత్త హామీల అమలుపై కసరత్తు...
గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన వ్యవసాయ రుణాల మాఫీ, ఉద్యోగులకు పీఆర్సీ అమలు, వృద్ధాప్య పింఛన్ల అర్హత వయోపరిమితి 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు తదితర కార్యక్రమాలను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. వ్యవసాయ రుణమాఫీకి ఏటా రూ. 6 వేల కోట్లు, వృద్ధాప్య పింఛన్లకు వయో అర్హతలను 57 ఏళ్లకు తగ్గిస్తే కొత్తగా అర్హత సాధించనున్న 8.5 లక్షల మందికి పింఛన్ల పంపిణీకి ఏటా రూ.2,500 కోట్లతో పాటు ఉద్యోగులకు పీఆర్సీ అమలుకు అవసరమైన కేటాయింపులను సమీక్షించారు. వచ్చే బడ్జెట్‌లో ఈ మూడు హామీల అమలుకు నిధుల కేటాయింపులు జరపాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.

10–12% పెరగనున్న కేటాయింపులు...
గత లోక్‌సభ ఎన్నికలకు ముందు రూ. 1.82 లక్షల కోట్ల అంచనాలతో 2019–20కి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ అంచనాలను రూ. 1.46 లక్షల కోట్లకు కుదించుకుంది. రాష్ట్ర ఆదాయాభివృద్ధి రేటుపై ఆర్థిక మాంద్యం ప్రభావం పడటంతో ప్రభుత్వం బడ్జెట్‌ అంచనాలను భారీగా కుదించుకోక తప్పలేదు. ఆర్థిక మాంద్యం ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతోపాటు 2020–21కి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను కేంద్రం రూ. 19,718 కోట్ల నుంచి రూ. 15,987 కోట్లకు తగ్గించింది. వాటి ప్రభావం రాష్ట్ర బడ్జెట్‌పై పడనుంది.

ఈ నేపథ్యంలో కేవలం 10–12 శాతం వృద్ధితో రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన జరపాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. రూ. 1.60 లక్షల కోట్ల నుంచి రూ. 1.65 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ రూపకల్పన చేసేందుకు ముఖ్యమంత్రి కసరత్తు నిర్వహించినట్లు తెలిసింది. దాదాపు 9.5 శాతానికిపైగా రాష్ట్ర ఆదాయాభివృద్ధి రేటు ఉండగా మిగిలిన నిధులను కోకాపేటలోని విలువైన ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా సమీకరించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. ఈ భూముల విక్రయం ద్వారా రూ. 10 వేల కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించనున్నామని ఈ బడ్జెట్‌లో మరోసారి ప్రతిపాదించబోతున్నారు. 

మార్చి 6 నుంచి బడ్జెట్‌ సమావేశాలు..
రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు మార్చి 6 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మార్చి 6 నుంచి నెలాఖరు వరకు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే అవకాశముంది. బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారు చేసే అంశంపై  సీఎం కేసీఆర్‌ అధికారులతో చర్చించినట్లు తెలిసింది. మరో 2, 3 రోజులపాటు సీఎం బడ్జెట్‌ రూపకల్పనపై కసరత్తు నిర్వహించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. సీఎంతో సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్‌ రోస్, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌రావు, ఆర్థిక సలహాదారు జీఆర్‌.రెడ్డి, సీఎంవో అధికారులు  పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top