‘ఫైర్‌ సేఫ్టీ’ తప్పనిసరి

Chitra Ramachandran Comments On Fire Safety - Sakshi

అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీ లేకుంటే కళాశాల నిర్వహణకు ఒప్పుకోం 

స్పష్టం చేసిన విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ 

కోర్టు ఉత్తర్వుల అమలు కోసం జూనియర్, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం 

అనుమతి లేని కళాశాలలకు నోటీసులు జారీ.. మూడ్రోజుల్లో వివరణకు ఆదేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) లేనిదే వచ్చే విద్యా ఏడాది నుంచి ఏ భవనంలోనైనా జూనియర్, డిగ్రీ కళాశాలలు నిర్వహించేందుకు అనుమతినిచ్చేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టు ఉత్తర్వుల అమలుకు సహకరించాలని, ఫైర్‌ అనుమతి లేకుంటే కళాశాలల నిర్వహణకు అనుమతించబోమని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల అమలు నేపథ్యంలో శనివారం రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు, వాటి అసోసియేషన్లతో ఎస్‌సీఈఆర్‌టీ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. కొన్ని కళాశాలలు అగ్నిమాపక అనుమతి లేకుండానే నిర్వహిస్తున్నారం టూ హైకోర్టులో దాఖలైన పిల్‌పై కోర్టు ఇచ్చిన తీ ర్పుపై చర్చించారు.

ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యాల తరఫు ప్రతినిధి మాట్లాడుతూ.. కొన్ని కళాశాలలకు ఫైర్‌ ఎన్‌వోసీ లేదని, వచ్చే ఏ డాదిలో కళాశాలను వేరే ప్రాంగణంలోకి మార్చేందుకు ప్రస్తుతానికి అఫిడవిట్‌లను దాఖలు చేస్తున్నామని చెప్పారు. ఈ వాదనను తోసిపుచ్చిన ప్రభుత్వం ప్రతియేటా ఇదే సాకు చెప్పి తప్పించుకుంటున్నారని, ఈనెల 25 లోపు సదరు కళాశాలలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చినట్లు తెలిపింది. ప్రతి కళాశాలకు అఫిలియేషన్‌ ఇచ్చేందుకు ఫైర్‌ ఎన్‌వోసీ తప్పనిసరి అని, ఈ విషయంపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ స్పష్టం చేశారు. ఇందుకు స్పందించిన యాజమాన్యాల ప్రతినిధి ఇంటర్‌బో ర్డు ఆదేశాలను పాటిస్తామని, అయితే వార్షిక పరీక్షలు త్వరలోనే ప్రారంభం కానున్నందున హైకోర్టు ఉత్తర్వుల అమలుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో కళాశాల విద్య కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ కూడా పాల్గొన్నారు.  

నోటీసులు జారీ: అగ్నిమాపక అనుమతుల్లేని కాలేజీలకు ఇంటర్‌బోర్డు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మూడ్రోజుల్లో వివరణ ఇవ్వాలని, యాజమాన్యాలు స్పందించకపోతే కళాశాలను మూసివేస్తామని ఇంటర్‌బోర్డు కార్యద ర్శి జలీల్‌ స్పష్టం చేశారు. ఈనెల 25లోపు దీనిపై హైకోర్టుకు నివేదిక ఇస్తామని తెలిపారు.

దవాఖానాల్లో ఫైర్‌స్టేషన్లు..
అగ్ని ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు వీలుగా దవాఖానాల్లోనే ఫైర్‌ స్టే షన్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో స్టే షన్ల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. దీనిపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్‌ శనివారం సమీక్షించారు. సుల్తాన్‌ బజార్‌ హాస్పిటల్, మెంటల్‌ హెల్త్‌ హాస్పిటల్, నిమ్స్, ఎంఎన్‌జే దవాఖానాల్లోనూ ఫైర్‌ స్టేషన్లు పెట్టాలని ఈ సందర్భంగా జరిగిన సమీక్షలో నిర్ణయించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top