పాపం పసివాడు..!

boy suffering from brain tumor in jagadevpur  - Sakshi

బ్రెయిన్‌ట్యూమర్‌తో ప్రాణపాయ స్థితిలో భానుప్రసాద్‌

సహాయం కోసం తల్లిదండ్రులు వేడుకోలు

ఇప్పటికే రూ.12 లక్షలు ఖర్చు

పేద కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. కొడుకు పుట్టాడని మురిసిపోయిన ఆ తల్లిదండ్రులు ఇప్పుడు కొడుకు ఆరోగ్యం కోసం మొక్కని దేవుడంటూ లేడు. చిన్న వయస్సులో బ్రెయిన్‌ ట్యూమర్‌ రావడంతో కన్నవాళ్లు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. కూలీ చేసుకుంటేనే నాలుగేళ్లు నోట్లోకి వెళ్లే దుస్థితి వారిది. కొడుకు ఆరోగ్యం కోసం ఇప్పటికే లక్షలాది రూపాయల అప్పులు చేసి సహాయం కోసం పేద దంపతులు ఎదురు చూస్తున్నారు.

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన రాగం బాల్‌రాజు, రమాదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కొడుకు భానుప్రసాద్‌ గ్రామంలోనే 4వ తరగతి, కూతురు నందిని 1వ రతగతి చదువుతుంది. చిన్న కూతురు ఇంటి దగ్గరనే ఉంటోంది. వీరికి గల ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కూలీ పనులు నిర్వహించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. బతుకుబండి సాఫీగా కొనసాగుతున్న ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. కొడుకు ఉన్నట్టుండి అనారోగ్యంబారిన పడ్డాడు.

తల్లిదండ్రులు కొడుకు భానుప్రసాద్‌కు హైదరాబాద్‌లోని లోటస్‌ ప్రైవేట్‌ దవాఖానలో ఇటీవల వైద్య పరీక్షలు చేయించారు. బాబుకు బ్రెయిన్‌ట్యూమర్‌ ఉందని వైద్యులు నిర్ధారించారు. వెంటనే వైద్యుల సూచనల మేరకు సికిందరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లోని వైద్యం కోసం వెళ్లారు. బాబుకు వైద్యం పరీక్షలు నిర్వహించిన అనంతరం సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తుందని వైద్యులు చెప్పారు. వెంటనే తల్లిదండ్రులు కొంత డబ్బు చెల్లించి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యం కొనసాగుతోంది.

మా బాబుకు ప్రాణం పోయండి..
మా బాబు భానుప్రసాద్‌కు ప్రాణభిక్ష పెట్టండి... అంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. తమకు ఎకరం భూమి మాత్రమే ఉందని, బాబు వైద్యం కోసం ఇప్పటికే రూ.12 లక్షలు చెల్లించాం. గ్రామంలోనే తెలిసివాళ్ల దగ్గర అప్పులు చేసి వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాం. ఇంకా ఐదారు లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పుతున్నారు. ఇక అప్పులు పుట్టే పరిస్థితి లేదు. సహాయం అందించి బాబుకు ప్రాణభిక్ష పెట్టండి.. అంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top