ఘనంగా బోనాలు.. క్యూ కట్టిన ప్రముఖులు! | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 5 2018 6:49 PM

Bonalu Celebrations Reflect Telangana Culture - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో బోనాల సందడి వెల్లివిరుస్తోంది. బోనాల శోభతో జంటనగరాలు కళకళలాడుతున్నాయి. లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పాతబస్తీలోని లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయం వద్ద భక్తజనం బారులు తీరారు. అమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్‌ తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని మంత్రి తలసాని తెలిపారు. రేపు ఊరేగింపు కోసం ఘనంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు.

క్యూ కట్టిన ప్రముఖులు..
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌, ప్రతిపక్ష నేత జానారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్‌, తెలంగాణ జనసమితి వ్యవస్థాపకుడు కోదండరామ్‌, మాజీ ఎంపీ విజయశాంతి తదితరులు లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించి.. మొక్కులు చెల్లించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని నాయిని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఫలాలు అందరికీ అందాలని అమ్మను వేడుకున్నట్టు ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు.

తెలంగాణలో నిర్వహించే బోనాల పండుగల్లో. లాల్‌దర్వాజ బోనాలు విశిష్ఠమైనవి. ఆషాడ మాసం చివరివారంలో పాతబస్తీలో జరిగే లాల్‌దర్వాజ బోనాలకు 104 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న సమయంలో నిజాం నవాబు సింహవాహని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారని.. ఆపద గట్టెకిస్తే.. గుడికట్టిస్తానని వేడుకున్నారని చెబుతారు. అప్పటినుంచి లాల్‌దర్వాజ బోనాల ఆనవాయితీ కొనసాగుతుందంటారు భక్తులు. బోనం ఎత్తుకుని..అమ్మను దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం.

Advertisement
Advertisement