పోటాపోటీగా సభ్యత్వం

BJP And TRS parties Membership Registration Program In Adilabad - Sakshi

టీఆర్‌ఎస్, బీజేపీల్లో భారీగా చేరికలు

కాంగ్రెస్‌లో నిస్తేజం

మున్సిపల్‌ ఎన్నికలపైనే గురి

సాక్షి, ఆదిలాబాద్‌ : రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఆయా పార్టీల్లో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాలే ఇందుకు నిదర్శనం. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల్లో భారీగా సభ్యత్వాలు నమోదయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం నిస్తేజం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే పార్టీల సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ముగింపు దశకు వచ్చాయి. ఏదేమైనా ఆయా పార్టీలు ఈ కార్యక్రమంలో పోటీ పడ్డాయి.

భారీగా సభ్యత్వం..
టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు గత నెల నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాయి. జిల్లాలో ఇరు పార్టీల సభ్యత్వాలు గతం కంటే భారీగా పెరిగాయి. టీఆర్‌ఎస్‌లో 50శాతం పెరగగా, బీజేపీలో గతం కంటే మూడింతలు అధికంగా సభ్యత్వాలు నమోదు కావడం గమనార్హం. ఈ లెక్కన జిల్లాలో బీజేపీ ప్రభావం గతం కంటే భారీగా మెరుగైందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా గడిచిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో  దాని ఉనికి లేదనే సంకేతాలు కనిపించాయి. అదే సమయంలో జిల్లాలోని రెండు నియోజకవర్గాలు ఆదిలాబాద్, బోథ్‌లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం, జిల్లాలో కొద్ది భాగమున్న ఖానాపూర్, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లోనూ గులాబీ ప్రభావమే ఉండడంతో కాషాయ ప్రభావం అంతగా కనిపించలేదు.

అయితే పార్లమెంట్‌ ఎన్నికలకు వచ్చేసరికి అనూహ్యంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు విజయం సాధించడంతో కమల వికాసం కనిపించింది. ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎన్నికలు కావడంతో బీజేపీ ప్రభావం కనిపించిందని ఇతర పార్టీలో బీజేపీపై ఆరోపణలు సందించాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని 17జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ తొమ్మిది విజయం సాధించగా, అనూహ్యంగా బీజేపీ ఐదు స్థానాల్లో గెలుపొందడం ఇతర పార్టీలకు మింగుడు పడలేదు. తాజాగా ఆ పరిణామాలు సభ్యత్వ నమోదులోనూ స్పష్టమవుతోంది. గతనెల ప్రారంభించిన సభ్యత్వ నమోదు పరంగా టీఆర్‌ఎస్‌కు ధీటుగా బీజేపీలోనూ సభ్యత్వ నమోదు జరగడం గమనార్హం. టీఆర్‌ఎస్‌ నుంచి ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్‌ బాపురావు, లోక భూమారెడ్డిల పర్యవేక్షణలో నమోదు విస్తృతంగా చేపట్టారు. ఇక బీజేపీలో ఎంపీ సోయం బాపురావు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదును జోరుగా సాగించారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్, హన్మకొండ మాజీ ఎమ్మెల్యే, సభ్యత్వ నమోదు రాష్ట్ర ఇన్‌చార్జి ధర్మారావు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయలు జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం నిస్తేజం ఆవరించింది. ఆ పార్టీ గతంలోనే నమోదు చేపట్టింది.

మున్సిపోల్స్‌ టార్గెట్‌..
ప్రధానంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేపట్టారనే ప్రచారం జరిగింది. ఆదిలాబాద్‌ పట్టణంలో టీఆర్‌ఎస్, బీజేపీలు పోటాపోటీగా చేరికలపై దృష్టి పెట్టాయి. యువతను పార్టీల వైపు ఆకర్షించేలా మంత్రాంగం నడిపాయి. రానున్న బల్దియా ఎన్నికల్లో ఆయా వార్డుల నుంచి పోటీ చేయాలనుకునే వారు ముందుచూపుతో పార్టీల వలస పట్టారు. జిల్లాలో పరిశీలిస్తే.. టీఆర్‌ఎస్‌ పార్టీ పరంగా ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 50వేల సభ్యత్వం, బోథ్‌ నియోజకవర్గంలో 40వేల సభ్యత్వం అయినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక బీజేపీ పరంగా ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 39వేలు, బోథ్‌ నియోజకవర్గంలో 22వేలు, మరో 19వేలు జిల్లాలో ఉన్న ఆసిఫాబాద్, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లోని మండలాల్లోజరిగినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

సంక్షేమ దృష్టితోనే..
టీఆర్‌ఎస్‌ సర్కారు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రజలు పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ సభ్యత్వ నమోదులో జిల్లాలో పెద్ద ఎత్తున చేరడం జరిగింది. స భ్యత్వ నమోదు పుస్తకాలను తెప్పించి రాష్ట్ర పార్టీకి పంపించడం జరుగుతుంది. పార్టీ కార్యకర్తకు ఇన్సురెన్స్‌ అందజేస్తున్నాం.
– లోక భూమారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు 

రాష్ట్రంలోనే జిల్లాలో అధికం
రాష్ట్రంలోనే సభ్యత్వ నమోదు పరంగా ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా జరిగింది. ఈ నెల 28 నుంచి క్రియాశీలక సభ్యత్వం నిర్వహిస్తాం. ఢిల్లీ నుంచి జిల్లా వారీగా సభ్యత్వ వివరాలు త్వరలో రానున్నాయి. బీజేపీ పార్టీలో చేరేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. 
– పాయల శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top