
చిన్నా.. అమ్మానాన్న జాగ్రత్త
‘తమ్ముడు.. అమ్మానాన్న జాగ్రత్త..! జీవితంలో ఎన్నో కోల్పోయాను. ఇక నా జీవితం వృథా’ అంటూ జవహర్‌నగర్‌లో నివసించే లైట్‌బర్గ్ బీపీవో కంపెనీ యజమాని...
- జీవితంలో ఎన్నో కోల్పోయాను.. ఇక నా జీవితం వృథా
- ఐదు రోజుల తర్వాత తమ్ముడికి ఈ-మెయిల్ సందేశం
- బెంగళూరుకు వె ళ్లిన ‘బీపీవో’ యజమాని అదృశ్యం
జవహర్‌నగర్: ‘తమ్ముడు.. అమ్మానాన్న జాగ్రత్త..! జీవితంలో ఎన్నో కోల్పోయాను. ఇక నా జీవితం వృథా’ అంటూ జవహర్‌నగర్‌లో నివసించే లైట్‌బర్గ్ బీపీవో కంపెనీ యజమాని బాగోతుల లక్ష్మీనరసింహన్(27) తన తమ్ముడికి ఈ-మెయిల్ పెట్టాడు. ఐదు రోజుల క్రితం బెంగుళూరు వెళ్లిన అతడి జాడ కనిపించకుండా పోయింది. సీఐ వెంకటగిరి తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌లో బాగోతుల లక్ష్మీనరసింహన్ తన తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు.
ఈయన హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లోని రాజ్ అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌లో బీపీవో కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఈనెల 11న బెంగళూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. అనంతరం ఆఫీస్‌కు చేరుకొని సాయంత్రం బెంగళూరుకు వెళ్లాడు. రెండు రోజుల తర్వాత కుటుంబీకులు లక్ష్మీనరసింహన్‌కు కాల్ చేయగా ఫోన్ స్విచాఫ్ వస్తోంది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు శుక్రవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాగా ఇటీవల లక్ష్మీనరసింహన్‌కు వివాహ సంబంధాలు చూస్తున్నామని, తమకు ఎవరూ శత్రువులు లేరని కుటుంబీకులు తెలిపారు. ఇదిలా ఉండగా, శుక్రవారం లక్ష్మీనరసింహన్ తమ్ముడు నాగకుమార్ మెయిల్‌కు అన్న నుంచి సందేశం వచ్చింది. ‘ చిన్నా టేక్ కేర్ మామ్ అండ్ డాడ్, యూ బీ ఓన్లీ సోర్స్ ఫర్ దెమ్, ఫ్రమ్ నౌ ఆన్.. ఐయామ్ లూజర్ అండ్ ఐ కెనాట్ లైవ్ లైక్ ఏ లూజర్, ఐయామ్ సారీ, మిస్ యూ ఆల్’ అని లక్ష్మీనరసింహన్ తన మెయిల్‌లో పేర్కొన్నాడు.
కాగా లక్ష్మీనరసింహన్ ఆర్థిక ఇబ్బందులతో అదృశ్యమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరు పోలీసులతో కలసి కేసును ఛేదిస్తామని సీఐ వెంకటగిరి తెలిపారు. కాగా కుమారుడి అదృశ్యంతో లక్ష్మీనరసింహన్ తల్లిదండ్రులు సీతామహలక్ష్మి, రాధాకృష్ణ మూర్తి కన్నీటిపర్యంతమవుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.