తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవరం సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులకు రాష్ట్ర స్థాయిలో ఇవ్వనున్న అవార్డులకు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవరం సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులకు రాష్ట్ర స్థాయిలో ఇవ్వనున్న అవార్డులకు గాను జిల్లా నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి (సాహితీవేత్త), కర్ర శశికళ (ఉత్తమ రైతు)ను ఉత్తమ పురస్కారాలకు ఎంపిక చే స్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు అందజేసింది. సుంకిరెడ్డి నారాయణరెడ్డిది జిల్లాలోని కనగల్ మండలం పగిడిమర్రి గ్రామం. నారాయణరెడ్డి డి గ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ విరమణ పొందారు. ‘దాలి’ అనే కవిత్వంతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ‘తోవ ఎక్కడ’ అనే మరో కవిత్వ పుస్తకాన్ని కూడా రాశారు.
‘మత్తడి’ అనే తెలంగాణ కవిత్వ సంకలనాన్ని కూడా ఆయన ప్రచురించారు. ‘ముంగిలి’ పేరుతో ఆయన రాసిన తెలంగాణ ప్రాచీన కవిత్వం మంచి గుర్తింపు పొందింది. ‘తెలంగాణ చరిత్ర’ పేరుతో ఆయన రాసిన తెలంగాణ చరిత్రకు సంబంధించిన మొద టి పుస్తకంగా ప్రచారంలో ఉంది. ఉద్యమ సమయంలో అనేక వ్యాసాలు రాసిన ఆయన తెలంగాణలో మరుగునపడ్డ కవులు, రచయితలు, చారిత్రక విశేషాలను వెలుగులోనికి తెచ్చారు. ప్రస్తుతం ఆయన నల్లగొండ పట్టణంలో నివాసం ఉంటున్నారు.
ఇక,త్రిపురారం మండలం దుగ్గేపల్లికి చెందిన కర్ర శశికళ ఉత్తమరైతుగా ఎంపికయ్యారు. ఈమె వ్యవసాయంలో రసాయన ఎరువులను వినియోగించకుండా వర్మికంపోస్ట్ ద్వారా పంటలు పండించడంతో పాటు గోబర్‌గ్యాస్ విద్యుదుత్పాదన చేస్తున్నందుకు గాను పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఇద్దరికీ జూన్2న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అవార్డుతో పాటు 1,00,116 రూపాయల నగదును అందజేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.