సాగునీరు పుష్కలం..ఆయకట్టు సస్యశ్యామలం

Bala samudram Pond filled with mission kakatiya works - Sakshi

‘మిషన్‌ కాకతీయ’తో బాలసముద్రం చెరువు ఆధునికీకరణ

ఆయకట్టు కింద 600 ఎకరాల వరి సాగు

మూడేళ్ల తర్వాత పంటలు సాగు చేసిన రైతులు  

నేలకొండపల్లి: నేలకొండపల్లి మండల కేంద్రంలో ఉన్న బాలసముద్రం చెరువు ఆయకట్టు విస్తీర్ణం 600 ఎకరాలు. మూడేళ్ల నుంచి చెరువులో నీరు లేక ఖరీఫ్‌లో పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పనులలో భాగంగా చెరువు ఆధునికీకరణకు రూ.5 కోట్లు మంజూరు చేసింది. శరవేగంగా పనులు చేపట్టడంతో చాలా వరకు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కురిసిన వర్షాలకు చెరువు నిండింది. దీంతో ఆయకట్టు రైతులు వరినాట్లు వేశారు. వరి పంట కోతకు వచ్చింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చెరువు నిండా తూటికాడ, నాచు, పేరుకుపోయిన పూడిక.. చెరువులో నీరు నిల్వక.. ఆయకట్టు భూములకు నీరందక.. పంటలు చేతికొచ్చేవి కావు. ఈ క్రమంలో మిషన్‌ కాకతీయ ద్వారా చెరువును ఆధునికీకరించారు. దీంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి పంటలకు పుష్కలంగా నీరందుతోంది. రైతు మోములో ఆనందం వెల్లివిరుస్తోంది.  

శాశ్వత పనులతో రైతుకు ప్రయోజనం  
బాలసముద్రం చెరువు అభివృద్ధి పనులతో రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. కట్టను బలోపేతం చేశారు. మిషన్‌ కాకతీయతో అలుగుకు శాశ్వత మరమ్మతులు చేపట్టంతో చుక్క నీరు కూడా వృథాగా పోవడంలేదు. జలకళతో చెరువు నిండు కుండలా కనిపిస్తోంది. రెండు పంటలకు సాగునీరు ఢోకా లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆయకట్టు పరిధి మొత్తం వరిసాగు చేశారు.  

Back to Top