అసెంబ్లీ.. మీడియా పాయింట్ | Assembly.. media point | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ.. మీడియా పాయింట్

Nov 11 2014 2:15 AM | Updated on Oct 9 2018 6:36 PM

శాసనసభలో టీటీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టుల వలె వ్యవహరిస్తున్నారు.

 టీటీడీపీ ఎమ్మెల్యేలు పెయిడ్ ఆర్టిస్టులు
 
 శాసనసభలో టీటీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టుల వలె వ్యవహరిస్తున్నారు.  తెలంగాణ ప్రాంతానికి చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారని టీటీడీపీ సభ్యులకు కనిపించకపోవడం విచారకరం. చంద్రబాబు అసలు బండారం బయటపడకుండా వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా టీడీపీపీ సభ్యులు అడ్డుకుంటున్నారు. టీటీడీపీ సభ్యులు తీరు మార్చుకోకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.    - టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా
 
 రైతు రుణమాఫీపై స్పష్టత లేని సర్కార్
 
 ఎన్నికల ఎజెండాలో రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పంటరుణాలే మాఫీ చేస్తామనడం విడ్డూరంగా ఉంది. ఈ ఖరీఫ్‌లో 25 శాతం కూడా కొత్త రుణాలు అందక వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చి విద్యుత్ సంక్షోభంతో పంటలు పండక నష్టపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు సుమారు 410 మంది రైతులు మృతి చెందారు. రైతులకు భరోసా కల్పించడంలో విఫలమైనందునే కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.    - కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి
 
 చంద్రబాబుపై ఒక్కమాట తప్పున్నా..
 
 చంద్రబాబు తెలంగాణకు చేస్తున్న మోసంపై సీఎం కేసీఆర్ శాసనసభలో చెబుతున్న మాటల్లో ఒక్క మాట తప్పున్నా.. టీఆర్‌ఎస్ సభ్యులమంతా ముక్కు నేలకు రాస్తాం. తప్పు ఉందని నిరూపించడానికి టీటీడీపీ సభ్యులకు దమ్ముందా? తెలంగాణకు విద్యుత్ విషయంలో జరుగుతున్న అన్యాయంపై టీటీడీపీ సభ్యులు చంద్రబాబును నిలదీయడానికి బదులు వాస్తవాలు బహిర్గతం కాకుండా అడ్డుకోవడం సిగ్గుచేటు.    - టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు
 
 బాబుది రెండు కళ్ల సిద్ధాంతం
 
 టీడీపీ అధినేత చంద్రబాబు రెండుకళ్ల సిద్దాంతం మరోమారు బహిర్గతమైంది. కేంద్ర మంత్రివర్గం విస్తరణ పురస్కరించుకుని టీడీపీ కోటా కింద వచ్చిన రెండు మంత్రి పదవులను ఏపీకి చెందిన ఎంపీలకే కట్టబెట్టి తెలంగాణ టీడీపీ నేతలకు మొండిచెయ్యి చూపించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు కేంద్రమంత్రి పదవి లభించడం హర్షదాయకం. తెలంగాణా రాష్ట్రానికి వ్యతిరేకంగా పరకాల ప్రభాకర్ వాఖ్యలు చేయడం విడ్డురంగా ఉంది.        - టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి
 
 చంద్రబాబు ఇంటి ముందు మోకరిల్లండి
 
 రైతుల ఆత్మహత్యలపై మొసలి కన్నీరు కారుస్తున్న టీటీడీపీ ఎమ్మెల్యేలు చేయాల్సింది బస్సు యాత్రలు కాదు, చంద్రబాబు ఇంటి ముందు మోకరిల్లండి. ప్రస్తుతం విద్యుత్ సంక్షోభానికి కారణం చంద్రబాబే. శాసనసభలో చంద్రబాబు పేరేత్తితేనే టీటీడీపీ సభ్యులు ఉలిక్కిపడుతున్నారు. విద్యుత్ సంక్షోభంపై  వాస్తవాలు బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు.     - టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి
 
 కరెంట్ కష్టాల పాపం బాబుదే
 
 తెలంగాణలో విద్యుత్ కష్టాల పాపం చంద్రబాబుదే. కరెంట్ కష్టాలపై చంద్రబాబు బండారం బయటపడకుండా శాసనసభలో సీఎం ప్రసంగాన్ని అడ్డుకొవడమే టీటీడీపీ సభ్యులు పనిగా పెట్టుకున్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై టీటీడీపీ సభ్యులు చంద్రబాబును నిలదీయాలి.     - టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement