మెకానిక్‌ అరుణ | Sakshi
Sakshi News home page

మెకానిక్‌ అరుణ

Published Fri, Mar 8 2019 7:59 AM

Aruna Sacrifice For Family By Doing Tyre Punctures - Sakshi

సాక్షి, కొత్తకోట: మెకానిక్‌లు అంటే పురుషులే ఎక్కువగా ఉండటం మనం చూస్తుంటాం. పెద్ద పెద్ద వాహనాలకు టైర్లు విప్పి పంక్చర్‌ చేయడం.. గాలి పట్టించడం పురుషులకే కష్టంగా ఉంటుంది. కానీ వీటన్నింటిని సునాయసంగా చేస్తోంది ఓ మహిళ. ఒకవైపు భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ.. పిల్లల చదువు, కుటుంబ పోషణకు అండగా నిలుస్తోంది. కొత్తకోట మండల కేంద్రానికి చెందిన అరుణ. అడ్డాకుల మండలం కాటారం గ్రామానికి చెందిన అరుణకు కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన మద్దిలేటితో ఎనిమిదేళ్ల క్రిందట వివాహం జరిపించారు.

వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఆర్థిక స్థోమత లేక పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. భర్త మద్దిలేటి వాహనాల టైర్ల పంక్చర్లు చేస్తూ జీవనం గడుపుతున్నాడు. అయితే మద్దిలేటి వద్దకు రోజురోజుకు పంక్చర్లు చేసుకునే వారి సంఖ్య ఎక్కువైంది. దీనికితోడు ఇంట్లో ఖర్చులు సైతం అధికమయ్యాయి. దీంతో పనిచేస్తున్న భర్తను చూసిన అరుణ మొదట టైర్లు విప్పడానికి కావాల్సిన సామగ్రిని అందజేసేది. అలాగే మెల్లగా ద్విచక్రవాహన టైర్లను విప్పడం మొదలుపెట్టింది. అలా ఒక్క బైక్‌ టైర్లనే కాకుండా ఆటో, కారు, వ్యాను, లారీ టైర్లను విప్పుతూ పంక్చర్లు చేస్తూ తోడుగా ఉంటుంది.

రుణం ఇచ్చి ఆదుకోవాలి 
స్వయం కృషిని నమ్ముకొని పనులు చేసుకుంటున్న మాలాంటి వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. కష్టపడి పనిచేస్తూ బతికే వారు సమాజంలో గౌరవంగా జీవించాలనుకుంటారు. రుణం ఇస్తే దుకాణాన్ని మరింత పెద్దగా చేసి ఆర్థికంగా మెరుగుపడి మా పిల్లలను బాగా చదివించుకుంటాం. 
– అరుణ, మెకానిక్, కొత్తకోట 
  

Advertisement
Advertisement