అపురూప కళా వైభవానికి  ఆదరణ కరువు

Another victim of the negligence of the temple of the Kakatiya - Sakshi

నిర్లక్ష్యానికి గురైన  మరో కాకతీయ ఆలయం

శిథిలావస్థలో శిల్పకళా సంపద 

పురావస్తు శాఖ అధీనంలో ఉన్నా అభివృద్ధి కాని వైనం 

కరీంనగర్‌ జిల్లా గొడిశాల గ్రామంలోని శివాలయం దుస్థితి

సాక్షి, హైదరాబాద్‌: చుట్టూ కొండలు. అబ్బురపరిచే శిల్ప సంపద. ఒకప్పుడు ధూపదీప నైవేద్యాలతో కళకళలాడిన శివాలయం.. నేడు శిథిలావస్థకు చేరుకుంది. కాకతీయ శిల్పకళా ప్రతిభకు తార్కాణంగా నిలి చిన ఈ ఆలయం కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండ లంలోని గొడిశాల గ్రామంలో ఉంది. తూర్పు ము ఖం కలిగి ఉన్న ఈ దేవాలయం నక్షత్రం ఆకారంలో ఉంది. ముఖ మండపానికి ఉత్తర, పడమర, దక్షిణ దిక్కల్లో గర్భగుడులు ఉండగా తూర్పు దిక్కున ప్రవే శ మండపం ఉంది. ఈ మూడు గర్భగుడుల్లో శివుడిని లింగం రూపంలో ప్రతిష్టించారు. పురావస్తు శాఖ పట్టించుకోకపోవడంతో శిల్ప సంపద చెల్లాచెదురు గా పడి ఉంది. ప్రభుత్వం స్పందించి ఆలయాన్ని పునర్‌ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

తెలుగు పద్యాలతో శాసనం.. 
గొడిశాల గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో కాకతీయుల కాలం నాటి ఆలయాలు ఉన్నాయి. పురాతన శాసనాల్లో గొడిశాల గ్రామాన్ని ఉప్పరపల్లిగా పిలిచేవారని చరిత్రకారులు చెబుతున్నారు. క్రీ.శ.1236 కాకతీయ గణపతి దేవుడి కాలంలో గ్రాంధిక భాషలో కావ్య శైలిలో వేయించిన శాసనం ఒకటి ఉంది. తెలు గు పద్యాలతో ప్రారంభమైన ఈ శాసనంలో వినాయకుడు, దుర్గ, వరాహ రూపంలో ఉన్న విష్ణు మూర్తిని, సూర్యుడిని స్తుతించారు. రాజనాయకుడు, రవ్వ మాంబ దంపతులకు జన్మించిన కాటయ..పంచ లింగాలతో ఈ శివాలయాలను నిర్మించాడు. ఆలయ నిర్మాణం మాత్రమే కాకుండా చెరువులను కూడా తవ్వించాడు. ధూప దీప నైవేద్యాల కోసం బ్రాహ్మణులకు పించరపల్లి అనే గ్రామా న్ని దానంగా ఇచ్చాడు. తాటి వనాన్ని, అంగడి సుం కాన్ని, మామిడి తోటలను కూడా దానం చేశాడు. రుద్రదేవుడి, గణపతి దేవుడి ప్రశంసలతోపాటు కాట య గురించి కూడా శాసనంలో వర్ణించారు. శాసనం చివరి భాగంలో ఈ ఆలయానికి గణపతి దేవ చక్రవర్తి కూడా భూ దానం చేసినట్లు రాశారు. శాసనంలో పేర్కొన్న పంచ లింగాలలో 3 త్రికుటాలయంలో ఉండగా, మరో 2 పక్కనే ఉన్న వేర్వేరు ఆలయాల్లో ప్రతిష్టించి ఉన్నాయి. (ప్రస్తుతం పునర్‌ నిర్మాణం కోసం ఆలయ స్తంభాలన్నీ విప్పి పెట్టారు). 

ఢిల్లీ సుల్తానులకు, కాకతీయులకు  యుద్ధం జరిగిన ప్రదేశం.. 
ఉప్పరపల్లి గ్రామానికి చారిత్రక నేపథ్యం ఉంది. 1303లో ఢిల్లీ సుల్తాన్‌ అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ.. మాలిక్‌ ఫక్రోద్దిన్, జునాఖాన్‌ల నాయకత్వంలో ఓరుగల్లు పైకి మొదటిసారి తన సేనలను దండయాత్రకు పం పాడు. కాకతీయ సైన్యాలు పోతుగంటి మైలి, రేచర్ల వెన్న భూపాలుడు, మంగయ దేవుడు ఇతర సేనాల నాయకత్వంలో ఇక్కడే అడ్డుకుని తిప్పి పంపారు.

పునర్నిర్మాణ పనులు చేపట్టాలి..  
చారిత్రక నేపథ్యం ఉన్న కాకతీయ ఆలయం నేడు శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయం బాగోగులు చూసేవారే కరువయ్యారు. ఆలయం చుట్టు పక్కల అనేక వందల స్తంభాలు, శిథిలాలు పడి ఉన్నాయి. ఇప్పటికైనా పురావస్తు శాఖ స్పందించి ఆలయాన్ని పునర్‌ నిర్మించాలి. 
– రామోజు హరగోపాల్,  తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top