ఇక మున్సిపల్‌ వార్‌

All Set For Municipal Elections in Medchal And Malkajgiri - Sakshi

పూర్తయిన వార్డుల పునర్విభజన ప్రక్రియ  

జిల్లాలో 13 మున్సిపాలిటీల్లో 191 వార్డులు

25న వార్డుల విభజన ముసాయిదా విడుదల  

30 వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ

31న విభజనపై తుది అధికారిక ప్రకటన

సాక్షి, మేడ్చల్‌జిల్లా: మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా లో మున్సిపల్‌  ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ఆదేశాలతో జిల్లాలో పాత మున్సిపాలిటీలైన బోడుప్పల్, ఫిర్జాదిగూడ, మేడ్చల్‌తో పాటు కొత్తగా ఏర్పడిన జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూముకుంట, నిజాంపేట, కొంపల్లి, దుండిగల్‌ మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా  ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ ప్రకారం 13 మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విజన ప్రక్రియను ప్రారంభించింది. జిల్లాలో పాత మూడు మున్సిపాలిటీల్లో ఏడు గ్రామాలు విలీనం కాగా, కొత్తగా ఏర్పడిన 10 మున్సిపాలిటీల్లో 30 గ్రామాలు విలీనమయ్యాయి. దీంతో 13 మున్సిపాలిటీల్లో జనాభా ప్రతిపాదికన 191 వార్డులు ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను బట్టి తెలుస్తోంది.  మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన ప్రతిపాదనలపై అధికార యంత్రాంగం.. స్థానిక ప్రజలు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర మున్సిపల్‌శాఖ జారీ చేసిన  మార్గదర్శకాలు, «విధి విధానాలను సంబంధిత మున్సిపల్‌ యంత్రాంగం పాటించాల్సి ఉంటుంది.

వార్డుల పునర్విభజన షెడ్యూల్‌ ఇదే..  
జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో వార్డుల విభజన ప్రక్రియకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను రూపొందించిన మున్సిపల్‌ యంత్రాంగం  ప్రజలు, ప్రజాప్రతినిదుల సలహాలు, సూచనలు స్వీకరించే విషయంపై దృష్టి పెట్టింది. మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన ముసాయిదా ప్రతిపాదనలపై 20వ తేదీ వరకు సూచనలు స్వీకరిస్తారు. 22వ తేదీ నాటికి వార్డుల పునర్విభజన ముసాయిదాకు తుది రూపల్పన చేస్తారు. ఈ నెల 24న పునర్విభజన ముసాయిదా ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదిస్తారు. 25న ప్రభుత్వం ఆయా ముసాయిదాపై అధికారికంగా ప్రకటన జారీ చేస్తుంది. మరోసారి వార్డుల పునర్విభజనపై మున్సిపల్‌ యంత్రాంగం ప్రజల నుంచి సలహాలు, సూచనలు 30వ తేదీ వరకు స్వీకరిస్తుంది. 31న తుది ముసాయిదా నివేదికను ప్రభుత్వానికి ఆయా మున్సిపాలిటీలు సమర్పిస్తే, అదేరోజు ప్రభుత్వం వార్డుల పునర్విభజనపై తుది ప్రకటన చేస్తుంది. 

విభజన మార్గదర్శకాలు ఇవీ..
కొత్త మున్సిపాలిటీల్లో వార్డుల విభజన సమాన సంఖ్యలో ఓటర్లు, జనాభా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. వార్డుల రూపు రేఖలు కనిపించేలా వేర్వేరు రంగుల్లో మ్యాప్‌లు తయారు చేయాలంది. వార్డుకు, మరో వార్డుకు మధ్య ఓటర్ల తేడా 10 వాతానికి మించకుండదని నిర్దేశించింది. 

జిల్లాలో 13 మున్సిపాలిటీల్లో 191 వార్డులు  
1. జవహార్‌నగర్‌: 21 వార్డులు
2. దమ్మాయిగూడ: 11 వార్డులు  (దమ్మాయిగూ డ, అహ్మద్‌గూడ, కుందనపల్లి, గోధుమకుంట)
3. నాగారం: 11 వార్డులు (నాగారం, రాంపల్లి)
4. పోచారం: 11 వార్డులు (పోచారం, ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, నారపల్లి, యన్నంపేట్‌)
5. ఘట్కేసర్‌: 11 వార్డులు (ఘట్కేసర్, కొండాపూర్, ఎన్‌ఎఫ్‌సీనగర్‌)
6. గండ్లపోచంపల్లి: 07 వార్డులు (గండ్లపోచంపల్లి, కండ్లకోయ, బాసిరేగడి, గౌరవెళ్లి, అర్కలగూడ)
7. తూముకుంట: 11 వార్డులు (దేవరయాంజల్, ఉప్పరపల్లి)
8. నిజాంపేట్‌: 25 వార్డులు (నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్‌)
9. కొంపల్లి: 11 వార్డులు (కొంపల్లి, దూలపల్లి)
10. దుండిగల్‌: 15 వార్డులు (దుండిగల్, మల్లంపేట్, డీపీపల్లి, గాగిల్లాపూర్, బౌరంపేట్, బహుదూర్‌పల్లి)  
11. బోడుప్పల్‌: 21 వార్డులు (బోడుప్పల్, చెంగిచర్ల),
12. ఫిర్జాదిగూడ: 21వార్డులు (ఫిర్జాదిగూడ, పర్వాతాపూర్, మేడిపల్లి)  
13. మేడ్చల్‌: 15 వార్డులు ( మేడ్చల్, అత్వెల్లి)

విభజన పూర్తయ్యాక కులగణన
జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ ముగిశాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించేందుకు  సర్వే చేపట్టనున్నారు. ఈ గణాంకాల ఆధారంగా ఆయా మున్సిపాలిటీల్లో వర్గాల వారిగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల షెడ్యూల్‌ త్వరలో విడుదల చేయనున్నట్టు మున్సిపల్‌ వర్గాలు తెలిపాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top