అడవులూ అన్యాక్రాంతం! | Alienation of the woods! | Sakshi
Sakshi News home page

అడవులూ అన్యాక్రాంతం!

Mar 25 2016 2:46 AM | Updated on Sep 3 2017 8:29 PM

అడవులూ అన్యాక్రాంతం!

అడవులూ అన్యాక్రాంతం!

వేలాది ఎకరాల భూములు ఆక్రమణ దారుల హస్తగతం అవుతున్నాయి. అంగ, అర్థ, రాజకీయ బలం ఉన్న వ్యక్తులు కనిపించిన చోటల్లా కబ్జా చేసేస్తున్నారు.

9 జిల్లాల్లో 29,318 ఎకరాల అటవీ భూముల కబ్జా


హైదరాబాద్: వేలాది ఎకరాల భూములు ఆక్రమణ దారుల హస్తగతం అవుతున్నాయి. అంగ, అర్థ, రాజకీయ బలం ఉన్న వ్యక్తులు కనిపించిన చోటల్లా కబ్జా చేసేస్తున్నారు. వీటిల్లో అడవులను నరికేసి ఆక్రమించుకున్న భూములు కొన్నయితే.. మైదాన ప్రాంతాల్లో ఉన్న భూములు మరికొన్ని. పేదలు, గిరిజనులు పోడు వ్యవసాయం కోసం భూములు దున్నుకుంటే హంగామా సృష్టించి భయభ్రాంతులకు గురిచేసే అటవీ అధికారులు.. బడా వ్యక్తులు కబ్జా చేసుకున్న వందల ఎకరాల గురించి పట్టించుకోలేదు. తాజాగా ‘తెలంగాణకు హరిత హారం’ ప్రాజెక్టులో భాగంగా కబ్జాదారుల చెరలో ఉన్న అటవీ భూముల వివరాలను జిల్లాల వారీగా అటవీ శాఖ సేకరించింది. హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో 29,318.37 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించింది. ఈ భూములను 2,431 మంది ఆక్రమించుకున్నట్లు అధికారులు తేల్చారు. ఇందులో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌ల్లోనే 25 వేల ఎకరాలకు పైగా ఉన్నాయి.

 
స్వాధీనానికి అటవీ శాఖ కసరత్తు

వ్యవసాయ అవసరాల కోసం పేద రైతులు, గిరిజనుల అధీనంలో ఉన్న భూములు మినహాయించి, 10 ఎకరాలకుపైగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోని భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం అటవీ శాఖను ఆదేశించింది. దీంతో 12,508 ఎకరాల అటవీ భూములను జిల్లా పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ రికార్డుల్లో ఉంది. ఇందులో ఖమ్మంలో అత్యధికంగా 10,064, ఆదిలాబాద్‌లో 1,671, నిజామాబాద్‌లో 708 ఎకరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో కబ్జాదారుల చేతిలో ఉన్న 64.32 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని మొక్కల పెంపకానికి సిద్ధం చేశారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో భూములు ఆక్రమించిన పలువురిపై పీడీ చట్టం కింద కేసులు కూడా నమోదు చేయడం గమనార్హం. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న 12 వేల ఎకరాల్లో భారీ ఎత్తున మొక్కలు నాటాలని అటవీ శాఖ నిర్ణయించింది. అటవీ శాఖకు చెందిన భూముల విషయంలో రెవెన్యూ విభాగంతో కూడా వివాదాలున్నాయి. దీంతో అటవీ భూముల వివాదంపై సర్వే జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement