చెదురుతున్న ‘ఏకాగ్రత’!

Up to 78% of girls suffering with anemia - Sakshi

రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న రక్తహీనత సమస్య

78% మంది బాలికలకు రక్తహీనత

దీంతో పాఠాలపై శ్రద్ధ చూపలేకపోతున్న చిన్నారులు

కొద్ది దూరం నడిచినా అలసట.. శ్వాసకూ ఇబ్బందులు

పోషకాహారం అందకపోవడమే వారికి శాపం

మధ్యాహ్న భోజనంలో అన్నం.. కూర.. చారే..

మాంసం.. ఆకుకూరలు వండేది బహుతక్కువే..

ఈ బాలిక పేరు లావణ్య.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నాగోలు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. రోజూ స్కూల్‌కు వెళుతుంది.. టీచర్లు చెప్పే పాఠాలు వింటుంది.. కానీ, ఏకాగ్రత లేకపోవడం వల్ల ఆ పాఠాలు ఆమెకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. లావణ్య రక్తహీనతతో బాధపడుతుండటమే దీనికి కారణం.

ఈ అమ్మాయి పేరు కవిత.. మన్సూరాబాద్‌ జడ్‌పీహెచ్‌ఎస్‌లో చదువతున్న ఈమెదీ లావణ్య పరిస్థితే. తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. సరైన పోషకాహారం లేకపోవడంతో కవిత రక్తహీనత బారినపడింది. చదువుకుందామన్న ఆసక్తి ఉన్నా ఏకాగ్రత లోపించి ఇబ్బంది పడుతోంది.

అశ్వినీ.. ఆదిలాబాద్‌ జిల్లా మరికల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. ఎక్కువ దూరం నడవలేదు.. పాఠాలు ఏకాగ్రతతో వినలేదు. ఇటీవల స్కూల్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వెళ్లి పరీక్ష చేయించుకుంటే రక్తహీనత అని తేలింది.

..లావణ్య, కవిత, అశ్వినీ మాత్రమే కాదు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల్లో దాదాపుగా 78% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. రోజూ స్కూల్‌కు వెళ్లినా పాఠాలను శ్రద్ధగా వినలేకపోతున్నారు. టీచర్‌ చెప్పేటప్పుడు పాఠాలు వింటున్నట్లు అనిపించినా.. ఆ తర్వాత వారికి ఏం గుర్తుండటం లేదు. దీనికి రక్తహీనతే ప్రధాన కారణం. ఆహారంలో సరైన పోషకాలు అందకపోవడంతో వీరంతా ఇబ్బంది పడుతున్నారు.

చాదర్‌ఘాట్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికల్లో 92 శాతం మందికి హిమోగ్లోబిన్‌ సాధారణం కంటే తక్కువగా ఉంది. 8 శాతం మందికి 11 శాతం అంతకంటే ఎక్కువగా ఉంది. రాజ్‌భవన్‌కు సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనూ 60 శాతానికి పైగా బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ‘బాలుర కంటే బాలికల హాజరు శాతం ఎక్కువ. పాఠాలు కూడా శ్రద్ధగా విన్నట్లు కనిపిస్తారు. మధ్యలో ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం రాదు.

రక్తహీనత వారి ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. ప్రభుత్వం వారికి పోషకాహారం అందించాలే తప్ప సాధారణ(మధ్యాహ్న) భోజనం వల్ల ఫలితం లేదు’అని నగరంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని చెప్పారు. ఆమె పని చేస్తున్న పాఠశాలలోనూ 85 శాతం మంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని జీహెచ్‌ఎంసీ నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది.

మొక్కుబడిగా ‘మధ్యాహ్నం’
ప్రభుత్వ స్కూళ్లలో బాలబాలికలకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో కేంద్రం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ పథకం మొక్కుబడిగా మారిపోయిం ది. నెలలో ఎక్కువ రోజులు అన్నం, పప్పు, పచ్చిపులుసు లేదా పప్పుచారుతో కానిచ్చేస్తున్నారు. ‘మా ఇంట్లో కూడా భోజనం ఇంచుమించుగా ఇలాగే ఉంటోంది.

మేం స్కూల్‌లో తినే భోజనం వల్ల పౌష్టికాహారం ఎలా వస్తుంది? ఎప్పుడో నెలలో రెండుసార్లు సగం గుడ్డు ఇస్తున్నారు’అని నల్లగొండ జిల్లా గడిపల్లి జెడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న సునీత వాపోయింది. మధ్యాహ్న భోజనంపై తనిఖీలకు వచ్చిన బృందానికి ఈ పథకం ఎంత నిరుపయోగమో ఈమె వివరించింది. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నివేదిక లోనూ ఈ అభి ప్రాయాన్ని పేర్కొ న్నారు. ఇది జరిగి నాలుగేళ్లయినా  పథకంలో ఏ మార్పూ లేదు.

గ్రామాల్లో మరీ దారుణం
గ్రామీణ తెలంగాణలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొన్ని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తే.. రాజధాని కంటే ఎక్కువ శాతంలోనే బాలికలు రక్తహీనతతో బాధపడు తున్నారని తేలింది. ఖమ్మం, మహబూబ్‌నగర్, నిర్మల్, భూపాలపల్లి, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల్లో ఈ రక్తహీనత ఎక్కువగా ఉంది. ఈ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నా ఉపయోగం ఉండటం లేదు. రోజూ అన్నం, పప్పు, చారుతోనే సరిపెడుతున్నారు. దీంతో పిల్లలు ఆ భోజనం తినడానికి ఆసక్తి చూపడం లేదు.

ఖమ్మం రూరల్‌ మండలం జలగం నగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న గుగులోతు లలిత మాటల్లో ‘ఇంటి దగ్గర అన్నం తిని వస్తాం. మళ్లీ మధ్యాహ్నం అదే అన్నం, చారు. ఎప్పుడో ఒకసారి గుడ్డు ఇస్తారు. జ్వరం వచ్చిందని డాక్టర్‌ దగ్గరకు వెడితే రక్తం తక్కువగా ఉంది. పండ్లు బాగా తినాలని చెప్పారు. మాకు ఏం పండ్లు దొరుకుతాయి. కొనే శక్తి లేదు కదా..’అని ఆవేదన చెందింది. రక్తహీనత వల్ల సరిగ్గా పాఠాలు వినలేకపోతున్నానని, ఏకాగ్రత లోపించిందని అదే పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న వేల్పుల రోజారాణి పేర్కొంది.

మహబూబ్‌నగర్‌ జిల్లా బొమ్మనపాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వర్ష, అనూషలదీ అదే పరిస్థితి. రక్తహీనతతో బాధపడుతున్న తమకు పోషకాహారం లభించడం కష్టంగా ఉందని వారిద్దరూ ఆవేదన చెందారు. ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంత ఉన్నత పాఠశాలల్లో 12 చోట్ల 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తే 80 శాతం మందికి సాధారణం కంటే తక్కువ స్థాయిలో హిమోగ్లోబిన్‌ ఉన్నట్లు తెలింది. మహబూబాబాద్‌ జిల్లాలోని గిరిజన గ్రామాల్లోనూ రక్తహీనత కారణంగా బాలికల్లో ఎదుగుదల లోపించింది.

పరీక్షలు చేసి.. మందులు ఇచ్చినా..
జాతీయ ఆరోగ్య పథకం కింద ఆరోగ్య అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు సరఫరా చేస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, కొమరంభీమ్, మహబూబాబాద్, జనగామ వంటి జిల్లాల్లో జనవరి, ఫిబ్రవరిలో వేలాది మందికి ఆరోగ్య పరీక్షలు చేశారు. జూన్‌–జూలైలో కొన్ని స్కూళ్లను సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు వచ్చిందా అని పరిశీలించారు.

‘మేము తర చూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రులు మాకు సహకరిస్తున్నాయి. ఈ పరీక్షల్లో వెల్లడవుతున్న దేమిటంటే 12–15 ఏళ్ల మధ్య బాలికల్లో హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉండటమే. దీనికి తగిన ఔషధాలు ఇస్తున్నాం. నాలుగైదు మాసాల తర్వాత జరిపిన పరీక్షల ఫలితాలు ఇంకా మా చేతికి రాలేదు’అని కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.

పండ్లు, మాంసాహారం ఎలా తినాలి..
నేను అన్నం తప్ప మరొకటి తినను. స్కూల్‌కు వచ్చిన తర్వాత కూడా అన్నం, ఒక కూర పెట్టి చారు పోస్తారు. ఇంట్లో తిన్నదానికి, స్కూల్లో మధ్యాహ్న భోజనా నికీ తేడా ఉండదు. ఇక పోషకాహారం ఎక్కడి నుంచి వస్తుంది. రక్తహీనత పోవడానికి మాంసాహారం, పండ్లు తినాలంటున్నారు. నోటు పుస్తకాలు కొనడానికే డబ్బు ల్లేవు. పండ్లు, మాంసాహారం ఎక్కడి నుంచి వస్తుంది. – సుజాత, పదో తరగతి విద్యార్థిని, చాదర్‌ఘాట్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల

కళ్లు తిరుగుతాయి.. శ్వాస ఆడదు..
రక్తం తక్కువగా ఉండటం వల్ల నీరసంగా ఉంటోంది. చదువుపై ఏకాగ్రత చూపలేకపోతున్నాను. ఎక్కువగా నడిస్తే కళ్లు తిరుగుతున్నాయి. శ్వాస సరిగా ఆడదు. పాఠశాలలో నిర్వహించిన వైద్య శిబిరంలో పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. కానీ ప్రయోజనం లేదు. – అఖిల, ఆరో తరగతి విద్యార్థిని,ఆదిలాబాద్‌ జిల్లా మరికల్‌ ఉన్నత పాఠశాల

అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది..
పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో కచ్చితంగా వారంలో ఆరు రోజులు ఆకుకూరలు ఉండాలి. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వాలి. వారంలో ఒక రోజు చికెన్, ఒక రోజు మాంసం పెట్టాలి. ఇలా చేయగలిగినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరు తుంది. లేదంటే కాంట్రాక్టు ఏజెన్సీలు డబ్బులు సంపాదించుకునేదిగా మారుతుంది.
– డాక్టర్‌ దశరథరామారెడ్డి, ఆర్థోపెడిక్‌ వైద్యుడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top