పాజిటివ్‌ 30.. మరణాలు 3 | 30 Corona Positive Cases Reported In Telangana | Sakshi
Sakshi News home page

పాజిటివ్‌ 30.. మరణాలు 3

Apr 2 2020 2:13 AM | Updated on Apr 2 2020 5:25 AM

30 Corona Positive Cases Reported In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రం నుంచి ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌కి వెళ్లొచ్చినవారికి, వారివల్ల వారి కుటుంబ సభ్యులకు మాత్రమే తెలంగాణలో కొత్తగా వైరస్‌ సోకుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. బుధవారం జరిపిన పరీక్షల్లో 30 మందికి పాజిటివ్‌ అని వెల్లడైంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 127కి చేరింది. కరోనా కారణంగా బుధవారం గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, యశోదా ఆసుపత్రిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఈ వైరస్‌ వల్ల మరణించిన వారి సంఖ్య 9కి చేరింది. బుధవారం వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిన 30 మంది, చనిపోయిన ముగ్గురు కూడా మర్కజ్‌ కు వెళ్లి వచ్చిన వారిగానే తేలింది. గతంలో మరణించిన ఆరుగురు కూడా మర్కజ్‌ కు వెళ్లి వచ్చినవారే’అని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం అర్ధరాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, రోగులకు అందుతున్న చికిత్స, వైద్యసిబ్బంది భద్రతకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌ లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 12 గంటల వరకు ఉన్నతాధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎంఓ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

మరో 300 మందికి పరీక్షలు..
మొదట్లో విదేశాల నుంచి వచ్చినవారిలో కొంతమందికి, వారి ద్వారామరికొంత మందికి వైరస్‌ సోకింది. వారంతా క్రమంగా కోలుకుంటున్నారు. వారిలో చాలా మంది డిశ్చార్జి కూడా అయ్యారు. అలాంటివారిలో ఎవరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా లేదు. ఎవరూ చనిపోలేదు. అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసులన్నీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారివిగానే తేలాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం మర్కజ్‌ వెళ్లి వచ్చి న వారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించి, వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తోంది. మరో 300 మందికి ఇం కా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మర్క జ్‌ వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా ఉన్నవారు ఇంకా ఎవరైనా వైద్య పరీక్షలు నిర్వహించుకోకుండా ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు నిర్వహించుకోవాలి. మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారికి సోకిన వైరస్‌ ప్రమాదకరంగా మారుతోంది కాబ ట్టి, వారంతా తప్పక పరీక్షలు చేయించుకోవాలి. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిం చుకోవడం వల్ల, వైరస్‌ సోకినట్లు తేలినా, వారి ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. అందువల్ల మర్కజ్‌ వెళ్లి వచ్చిన ప్రతీఒక్కరూ తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి’అని సీఎంఓ పేర్కొంది. 

ప్రజలు సహకరించాలి: కేసీఆర్‌ 
తెలంగాణలో కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, దీనికి ప్రజలు కూడా సహకరించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.  కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నిర్వహిస్తున్న లాక్‌డౌన్‌ను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. మరికొద్ది రోజులపాటు ప్రజలు సహకరిస్తే, వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం వెల్లడించారు. వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్స్, ఎన్‌–95 మాస్కులు, హైడ్రాక్సిక్లోరోక్విన్‌ మాత్రలు, అజిత్రోమైసిన్‌ ట్యాబ్లెట్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన మెడికల్‌ కిట్స్‌ను కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement