జంటనగరాల్లో 20 మినీ ట్యాంక్‌బండ్‌లు

20 Mini Tank Bands In Hyderabad : Minister Harish Rao - Sakshi

మండలిలో మంత్రి హరీశ్‌ వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌ : జంట నగరాల పరిధిలోని 20 చెరువులను రూ.287 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌లుగా మారుస్తామని నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మరో 64 చెరువులను రూ.94 కోట్లతో పునరుద్ధరిస్తామన్నారు. శనివారం శాసనమండలిలో సభ్యులు పూల రవీందర్, కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రజల సౌకర్యాన్ని, భూగర్భజలాల పెంపు లక్ష్యంగా పట్టణ ప్రాంత చెరువులను పునరుద్ధరిస్తున్నామన్నారు. 

220 మంది పిల్లలు చనిపోయారు: పాతూరి  
సిద్దిపేట జిల్లా కోహెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏడాదిలో 220 మంది పిల్లలు చనిపోయారని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి మండలి దృష్టికి తెచ్చారు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా? అని మంత్రి లక్ష్మారెడ్డిని ప్రశ్నించారు. ఈ పీహెచ్‌సీ పరిధిలో ఏడాదిగా వైద్యు డు లేరని, వైద్యున్ని నియమించాలని పట్టుబడితే తన గ్రామంలోని ఏఎన్‌ఎంను తొలగించా రన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.  

జీతాలు పెంచుతాం: తలసాని 
త్వరలోనే గోపాలమిత్రల జీతాలు పెంచుతామని పశు సంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.

సంక్షేమంపై కేంద్రం పెత్తనమెందుకు: ఈటల 
రాష్ట్రాల జనాభా, వెనుకబాటుతనం, విస్తీర్ణం దృష్ట్యా కాకుండా విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రాలకు అధిక నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గొప్ప సంక్షేమ పథకాలు చేపడుతున్న తెలంగాణకు నిధులివ్వాలని కోరుతున్నా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ వంటి శాఖలపై కేంద్రం పెత్తనం ఎందుకని ప్రశ్నించారు. మిషన్‌ భగీరథకు, మిషన్‌ కాకతీయకు కలిపి రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా కేంద్రం ఇంతవరకూ ఒక్క రూపాయి ఇవ్వలేదని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top