ప్రసవ వేదనలో 108

108 Employees Strike In Medak - Sakshi

మెదక్‌రూరల్‌: ఆపద వస్తే వెంటనే అందరికి గుర్తుకు వచ్చేది 108. ఇప్పుడు ఆ 108 వాహనం ప్రసవ వేదనతో బాధపడుతోంది. అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడే ఆపద్బాంధవులు తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కారు. కార్మిక చట్టం ప్రకారం ఎనిమిది గంటల పనిదినాలను కల్పించడంతో పాటు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని పద్నాలుగు  రోజులుగా సమ్మె బాట పట్టారు. జిల్లాలో మొత్తం ఎనిమిది 108 వాహనాలునాయి. ఇందులో 36 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 18 మంది ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్స్‌(ఈఎమ్‌టీ), 18 మంది పైలెట్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసర సమయాల్లో  వైద్య సేవలు ప్రతి పల్లెకు అందాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2005లో 108 వాహనాలను ప్రవేశపెట్టారు. 24 గంటల అత్యవసర వైద్య సేవలను ప్రాణాపాయ, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారికి అందించాలనే లక్ష్యంతో ఈ వాహనాలను ప్రారంభించారు.

సమాచారం అందుకున్న 20 నిమిషాల వ్యవధిలోనే ఈ 108 వాహనం సంఘటన స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించడం సిబ్బంది పనితీరుకు నిదర్శనం. అలాగే ఎంతో మంది గర్భిణులకు అంబులెన్స్‌లోనే పురుడుపోసి తల్లీబిడ్డలను సురక్షితంగా కాపాడుతున్న  సిబ్బంది సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆపదలో ఆదుకునే ఆపద్భాంధవులకు కనీస వేతన చట్టాల విషయంలో అటు ప్రభుత్వం, ఇటు జీవీకే యాజమాన్య పట్టింపులేని దోరణి వ్యవహరిస్తుండటంతో సిబ్బంది కుటుంబ పోషణ భారమైంది.

దీంతో ఈ నెల 11 నుంచి రాష్ట్ర  వ్యాప్తంగా హక్కుల సాధన కోసం108 ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సమ్మెబాట పట్టారు. చాలీచాలని వేతనాలతో 12 గంటలు రెండు షిఫ్ట్‌లల్లో వెట్టిచాకిరి చేస్తున్నామని సిబ్బంది వాపోతున్నారు. ఆపదలో ఉన్న ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న వారికి కార్మిక చట్టం ప్రకారం ఎనిమిది గంటల పనిదినాలను కల్పించి వేతనాలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. జీఓ నంబర్‌ 3ను వెంటనే అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 108 వ్యవస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్న జీవీకే సంస్థను తొలగించి 108 నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకోవాలని పలువురు సిబ్బంది కోరుతున్నారు.

కరువైన ప్రథమ చికిత్స 
గర్భిణులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, పాముకాటుకు గురైన వ్యక్తులను, ఒంటికి నిప్పంటించున్న వారికి అత్యవసర ప్రథమ చికిత్స చేసే 108 సిబ్బంది సమ్మెబాట పట్టడంతో అత్యవసర సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి.  సిబ్బంది సమ్మె చేస్తుండటంతో తాత్కాలిక సిబ్బందిని నియమించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. అడ్డమీద నుంచి డ్రైవర్లను పైలట్‌లుగా, ఇటీవల శిక్షణ పొందిన ఎలాంటి అనుభవం లేని సిబ్బందిని నియమించారు.

దీంతో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుభవం లేని డ్రైవర్లు వాహనాలను నడిపిస్తుండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించడంలో తాత్కాలిక సిబ్బంది అవగాహన లేమితో విఫలమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అనుభవం లేని డ్రైవర్ల కారణంగా జిల్లాలోని పలు చోట్ల 108 వాహనాలు ప్రమాదాలు జరిగి దెబ్బతిన్నాయనే సమాచారం ఉంది. సమ్మె నేపథ్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రజలకు అత్యవసర సేవలు కరువయ్యాయనే చెప్పాలి.

కార్మిక చట్టాన్ని అమలు చేయాలి
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రజలను కాపాడే మాకు కార్మిక చట్టం ప్రకారం న్యాయం చేయాలి. ఎనిమిది గంటల పని దినాలను కల్పించాలి. జీఓ నంబర్‌ 3ను అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పిస్తూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకొని ప్రభుత్వమే 108 వ్యవస్థను నడిపించాలి. న్యాయమైన మా డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం చేస్తాం. –కె. పాండు, జిల్లా అధ్యక్షుడు, 
రాష్ట్ర 108 ఉద్యోగుల సంఘంఉద్యోగ భద్రత కల్పించాలి 
పదమూడేళ్లుగా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగులుగా నియమిస్తూ కార్మిక చట్టం ప్రకారం ఎనిమిది గంటల పని దినాలను కల్పించాలి. జీఓ నంబర్‌ 3ను అమలు చేయాలి. 108 నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టాలి. వెంటనే వేతనాన్ని కూడా పెంచి ఆదుకోవాలి. –ప్రసాద్, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top