breaking news
-
కాంగ్రెస్ 420 హామీలు అమలు చేసేదాకా విడిచిపెట్టం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ నోటికి ఎంతొస్తే అంత అన్నట్టుగా హామీలు ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం జరిగిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదని, అవి 420 హామీలని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుల్లయ్యిందని, రాష్ట్ర ఏర్పాటు విఫలమైందని, అబద్ధాలు మాట్లాడించారని, వాస్తవాలు ఏంటో తెలియజేసేందుకు ‘స్వేద’పత్రం విడుదల చేసినట్టు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తెలంగాణ సమగ్ర అభివృద్ధిని గణాంకాలు, ఆధారాలతో సహా వివరించినట్టు చెప్పారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని, రూ.2 లక్షల రుణం తెచ్చుకోండని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ మాట్లాడారని గుర్తు చేశారు. కానీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణాలు వసూలు చేయాలని, లేకుంటే కేసులు పెట్టమని ఆదేశాలు జారీ చేశారన్నారు. వ్యవసాయ రుణాలు విడతల వారీగా మాఫీ చేస్తా మని ఇచ్చిన హామీని విస్మరించి, ముక్కుపిండి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం శోచనీయమన్నారు. ప్రియాంకాగాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, భట్టి విక్రమార్క అలా చెప్పలేదని హరీశ్‌రావు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా విడిచి పెట్టేది లేదని పునరుద్ఘాటించారు. ప్రధాని, అదానీ ఒక్కటని విమర్శలు చేసిన రాహుల్‌గాందీ, రేవంత్‌రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ అదానీని తిడితే, రేవంత్‌రెడ్డి అదే సమయంలో దావోస్‌లో ఒప్పందం చేసుకున్నారని, నోటికి వచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసలు రంగు బయట పడుతున్నదన్నారు. కేసీఆర్ ఉన్నంతకాలం అదానీ ఇక్కడ అడుగు పెట్టలేదని, కానీ కాంగ్రెస్ రాగానే ఎలా వస్తున్నాడని కేటీఆర్ నిలదీశారు. ఈసారి కూడా మెదక్ మనదే ... మెదక్ లోక్‌సభ సెగ్మెంట్లో మరోసారి గులాబీ జెండా ఎగరబోతున్నదని కేటీఆర్ అన్నారు. గత ఎంపీ ఎన్నిక ల్లో హరీశ్‌రావు నాయకత్వంలో కార్యకర్తలంతా క్రియాశీలకంగా పనిచేయడంతో అత్యధిక మెజారిటీ సాధించామని, మరోసారి అది పునరావృతం కావాలన్నారు. కొందరు దు్రష్పచారం చేయడంతోనే మెదక్ పార్లమెంట్ పరిధిలో తాను ఒక్కదాన్నే ఓడిపోయానని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎమ్మెల్సీలు వెంకటరామిరెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. పనికొచ్చే సమీక్షలు చేయడం లేదు: హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం పనికొచ్చే సమీక్షలు చేయడం లేదని, సమీక్షల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసిందంటూ లీకులు ఇస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ఇదంతా ఓ ఆరునెలలు సాగుతుందేమో, ఆ తర్వాత చెల్లదని స్పష్టం చేశారు. ఎవరూ అధైర్య పడొద్దని, భవిష్యత్‌లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత నిజమైన మార్పు వస్తుందన్నారు. కొందరు బీఆర్ఎస్ నుంచి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని, చెత్త పార్టీ నుంచి వెళ్లిపోతోందని భావిద్దామని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వారు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసులతో భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. పోలీస్ స్టేషన్లు, జైళ్లు, పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. కార్యకర్తలకు ఏం జరిగినా, 39 మంది బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలు బస్సు వేసుకుని భాదితుల దగ్గరికి వచ్చి అండగా ఉంటారన్నారు. రైతు బంధు విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. -
శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు తమ ప్రభుత్వం ఒప్పుకోలేదని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టులపై శుక్రవారం ఆయన సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆ జిల్లాకు చెందిన ఇతర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్షించారు. అనంతరం భట్టి విక్రమార్కతో కలిసి సచివాలయం మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణకు నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్కను అదనంగా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించే అంశంపై గత ప్రభుత్వం అనుసరించిన వైఖరి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై త్వరలో రాష్ట్ర శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సీతారామ ప్రాజెక్టులో భారీ దోపిడీ: భట్టి విక్రమార్క సీతారామ–సీతమ్మసాగర్ ప్రాజెక్టు పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.792 కోట్లతో రాజీవ్‌సాగర్, రూ.760 కోట్లతో ఇందిరాసాగర్ మిగులు పనులు పూర్తి చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.3లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభించేదన్నారు. మొత్తం రూ.1552 కోట్లతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో కలిపేసి సీతారామ ప్రాజెక్టుగా పేరు మార్చడంతోపాటు అంచనా వ్యయం రూ.13,057 కోట్లకు చేరిందని, కేసీఆర్ ప్రభుత్వం ఆ తర్వాత రూ.18,500 కోట్లకు పెంచిందని ఆరోపించారు. అదనపు నీటినిల్వ సామర్థ్యం కోసం రూ.3481 కోట్లతో సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం చేపట్టి తర్వాత దీని వ్యయం సైతం రూ.4481 కోట్లకు పెంచిందన్నారు. ఇలా సీతారామ–సీతమ్మప్రాజెక్టుల అంచనాలను మొత్తం రూ.22,981 కోట్లకు పెంచారని విమర్శించారు. రూ.1552 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్టు అంచనాలను రూ.22,981 కోట్లకు పెంచి ఇప్పటికే రూ. 8వేల కోట్లను ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. శబరి, గోదావరి కలిసే చోట పోలవరం వద్ద ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ఇందిరాసాగర్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం విరమించుకోవడంతో 365 రోజులు ప్రవహించే శబరి నదిని రాష్ట్రం కోల్పోయిందన్నారు. దేశ చరిత్రలో ఇంత దోపిడీ జరిగి ఉండదు: ఉత్తమ్ భారతదేశ చరిత్రలో ఇలాంటి దోపిడీ జరగడం చాలా అరుదు అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రూ.10, రూ.20 కోట్లకే ఉద్యోగాలు పోతాయని, ప్రభుత్వాలు కూలుతాయన్నారు. రోజురోజుకు బయటకు వస్తున్న విషయాలను చూసి నీటిపారుదలశాఖ మంత్రిగా నిర్ఘాంతపోతున్నట్టు పేర్కొన్నారు. ఎన్నో కుంభకోణాలు జరిగాయని, విచారణకు ఎంత మందో జడ్జిలు కావాలో అన్న అంశంపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు సీజేకు లేఖ రాశామని, కేసీఆర్, హరీశ్‌రావులు నీటిపారుదలశాఖ మంత్రులుగా వ్యవహరించి ఆ శాఖను ధ్వంసం చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులనే ఇంకా కొనసాగించడంపై విలేకరులు ప్రశ్నించగా, త్వరలో మార్పులు చూస్తారని బదులిచ్చారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చిస్తామని చెప్పారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా కలి్పంచే విధానం లేదని, బదులుగా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్ర పథకాల కింద 60శాతం నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జాతీయ హోదాపై మాట్లాడేందుకు హరీశ్‌రావుకు సిగ్గుశరం ఉండాలన్నారు. గతంలో 2–4శాతం వడ్డీలతో ప్రభుత్వాలు రుణాలు తెచ్చాయని, తెలంగాణ వచ్చాక 10.5శాతం వరకు అధిక వడ్డీలతో గత ప్రభుత్వం రూ.2లక్షల కోట్ల అప్పులు చేసి మనందరి జీవితాలను తాకట్టు పెట్టిందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల శాఖ రుణాల తిరిగి చెల్లింపులకే రూ.18వేల కోట్లు, జీతాలకు మరో రూ..2వేల కోట్లు, గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లుల చెల్లింపులకు మరో రూ. 9500 కోట్లు అవసరమన్నారు. తమ ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో వడ్డీలను తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కర్ణాటకకు వెళ్లి తాగునీటి అవస రాల కోసం 10 టీఎంసీలను విడుదల చేయాలని కోరుతామని చెప్పారు. కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు ఉందా? శ్రీశైలం ప్రాజెక్టు వెనుకభాగంలో ఏపీ లిఫ్ట్‌లు కట్టుతుంటే ఎప్పుడైనా మాట్లాడారా? అని నిలదీశారు. ఏపీ చేపట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టుపై ఒక్కసారైనా కేసీఆర్, హరీశ్ మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలతోపాటు సీలేరు ప్రాజెక్టును కేంద్రం ఏపీకి కేటాయించినా ఏం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. -
సీతారామ ప్రాజెక్టు భారీ కుంభకోణం: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టు భారీ కుంభకోణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. స్వతంత్ర భారత దేశంలో ఇంతటి భారీ కుంభకోణం చూడలేదని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ మురళీధర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులు,సీతారామ ప్రాజెక్టు అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఒక్కో ప్రాజెక్టుపై సమీక్ష చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ, ఇతర సాగునీటి ప్రాజెక్టు పనుల వేగవంతంపై చర్చించామని తెలిపారు. ఈ ప్రాజెక్టు గతంలో రాజీవ్ దుమ్ముగూడ, ఇందిరాసాగర్.. అని రెండు వేర్వేరుగా ఉండేవని. ఆ రెండింటినీ ఏ విధంగా ఒక్కటి చేసి సీతారామ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారో తెలియడం లేదన్నారు. గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న కేసీఆర్ సైతం సీతారామ ప్రాజెక్టుపై అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. 2014లో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు మరో 1,400 కోట్లు ఖర్చు చేస్తే దుమ్ముగూడ, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు ఏడాదిలో పూర్తయ్యేవని కేసీఆర్ చెప్పినట్లు గుర్తిచేశారు. అయితే పదేళ్లు అయినా అవి పూర్తి కాలేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టు పూర్తయితే 3 లక్షలకు పైగా ఆయకట్టుకు నీళ్ళు అప్పుడే వచ్చేదని... కానీ ఇప్పటికీ ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ రూ. 1,681కోట్ల ప్రాజెక్టు మాత్రమేనని.. 2014 నాటికి 7వందల కోట్లు ఖర్చు చేస్తే అయిపోయే ప్రాజెక్టు అని తెలిపారు. రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ రెండు ప్రాజెక్టులు రూ. 1552 కోట్లు ఖర్చు చేస్తే అయిపోయేవని అన్నారు. 3 లక్షల 30 వేల ఎకరాలకు నీళ్ళు వచ్చేమని పేర్కొన్నారు. వీటిని రీడిజైన్ చేసి.. రెండు ప్రాజెక్టులు కలిపి సీతారామ అని పేరు పెట్టి 18వేల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. రూ.7500 కోట్లు అదనంగా ఖర్చు చేశారని మండిపడ్డారు. 1,500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్‌ను 22 వేల కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. ఇప్పటికే 9 వేల కోట్లు ఖర్చు చేసినా.. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇంతటి దోపిడి నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి ప్రజలు సహకరించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన దోపిడి చూస్తుంటే కడుపు తరుక్కుపోతోదన్నారు. -
కాంగ్రెస్ 420 హామీలను అమలు చేసేదాకా విడిచి పెట్టం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని, 420 హామీలని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నోటికి ఎంత వస్తే అంత అనుకుంటూ హామీలు ఇచ్చారని, అందుకే 420 హామీలను అమలు చేసేదాకా విడిచి పెట్టామని తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పాల్గొని బీఆర్ఎస్ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రధాని, అదానీ ఒక్కటని విమర్శలు చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ నిన్ననే అదానీని తిడితే, రేవంత్ రెడ్డి అదే సమయంలో దావోస్‌లో ఒప్పందం చేసుకున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. . కేసీఆర్ ఉన్నంత కాలం అదానీ ఇక్కడ అడుగు పెట్టలేదు. కానీ కాంగ్రెస్ రాగానే ఎలా అడుగు పెడుతున్నాడని కేటీఆర్ నిలదీశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసలు రంగు బయట పడుతుందన్నారు. ‘గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుళ్ళ అయ్యిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలం అయ్యిందని అబద్ధాలు మాట్లాడించారు. అందుకే స్వేద పత్రం విడుదల చేశాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధిని పొందుపరిచాం. గణాంకాలు, ఆధారాలతో సహా వివరించాం. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తా.. రూ. 2 లక్షల రుణం తెచ్చుకోండి అని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ మాట్లాడారు. తుమ్మల నాగేశ్వర్ రావు రుణాలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లేకుంటే కేసులు పెట్టండి అని అంటున్నాడు. పత్రికల్లో కూడా వచ్చింది. ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, భట్టి విక్రమార్క భృతి ఇస్తామని చెప్పలేదని హరీష్ రావు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అబద్దం చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని హామీ ఇచ్చారు కానీ అది సాధ్యం కాదని మొన్న స్పష్టమైంది. కేసీఆర్, హరీశ్ రావు నాయకత్వంలో కార్యకర్తలంతా క్రియాశీలకంగా పని చేయడంతో గత ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించాం. ఈ సారి కూడా మెదక్‌లో గులాబీ జెండా ఎగరబోతున్నది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గత పదేళ్ళలో తెలంగాణ తరుపున గళం విప్పింది మన బీఆర్ఎస్ ఎంపీలు అనే విషయం మరచి పోవద్దు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మన బలం, మన గళం, మన గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలి. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని. ఇదే విషయం ప్రజలకు చెప్పాలి. నిరాశ వీడాలి. బయటికి రావాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు హరీష్ రావు, సునీతా లక్ష్మా రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి ప్రసంగం ముఖ్యాంశాలు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుళ్ళ అయ్యిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలం అయ్యిందని అబద్ధాలు మాట్లాడించారు. అందుకే స్వేద పత్రం విడుదల చేశాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధిని… pic.twitter.com/T5oUTyWAAP — BRS Party (@BRSparty) January 19, 2024 -
ఎమ్మెల్సీలుగా బల్మూరి వెంకట్, మహేశ్ గౌడ్ నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 11న వెలువడింది. నామినేషన్ల స్వీకరణకు గురువారం చివరి రోజు కాగా కాంగ్రెస్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజర య్యారు. వీరితో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎన్నిక ఏకగ్రీవమే రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత ఫలితాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. 119 ఎమ్మెల్యేలు కలిగిన తెలంగాణ అసెంబ్లీలో సీపీఐతో కలుపుకుని కాంగ్రెస్‌కు 65 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. మరోవైపు 39 మంది ఎమ్మెల్యేలు కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నిక పక్రియకు దూరంగా ఉంది. దీంతో కాంగ్రెస్ తరపున ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఎమ్మెల్సీలుగా బల్మూరు వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. నామినేషన్ల అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందనేందుకు ఈ ఇద్దరు నాయకులను శాసన మండలికి పంపడమే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. -
KTR: ఇలాగైతే 6 నెలల్లోనే తిరుగుబాటు!
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయాలి. రైతు రుణమాఫీ, కరెంటు బిల్లుల చెల్లింపు, రైతుబంధు రూ.15 వేలకు పెంపు, రూ.4 వేల ఆసరా పింఛన్‌ను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామనే హామీని గుర్తు చేస్తున్నాం. నిరుద్యోగ భృతిపై ప్రియాంక గాంధీ హామీ ఇస్తే, అమలు సాధ్యం కాదని డిప్యూటీ సీఎం అసెంబ్లీ వేదికగా చెప్తున్నారు. రుణమాఫీ హామీని దశల వా రీగా అమలు చేస్తామంటూ రేవంత్ మాట మార్చా రు. గతంలో వారం రోజుల్లో 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలన్నర దాటినా రైతుల ఖాతాల్లోకి డబ్బులు రావడం లేదు. ఎరువుల కోసం మళ్లీ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే కేవలం ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో గురువారం జరిగిన మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. గెలుపు బాట కష్టం కాదు ‘ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా, హైదరాబాద్‌లోనూ వేల కోట్ల రూపాయల ఆస్తులు సృష్టించి బంగారు పళ్లెంలో తెలంగాణను కాంగ్రెస్‌కు అప్పగించినా.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం విస్తృతంగా జరిగింది. ఇలాంటి వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఉంది. కార్యకర్తల అభిప్రాయం మేరకే ఇకపై పార్టీ కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతుంది. పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి గెలుపుబాట పట్టడం కష్టమేమీ కాదు’అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ వైఖరి ఎందుకు మారింది? దావోస్ సాక్షిగా అదానీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అలయ్ బలయ్ చేసుకున్నారని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీలో అదానీతో కొట్లాడుతున్న కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం ఎందుకు కలిసి పనిచేస్తోందని ప్రశ్నించారు. ‘మోదీ, అదానీ ఒకటే అని రాహుల్‌గాంధీ అంటుండగా, ఇటీవలి కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో రేవంత్ కూడా వారు ఒకటేనంటూ మాట్లాడారు. రూ.13 లక్షల కోట్లు దోచిన అదానీ డబ్బులు ప్రధానికి, బీజేపీ ఖాతాలోకి వెళ్తాయని ఎన్నికల సమయంలో విమర్శించడంతో పాటు అదానీని దొంగ అంటూ సంబోధించారు. అధికారంలో లేనప్పుడు అదానీని దేశానికి శత్రువుగా పోచ్చిన రేవంత్.. ఇప్పుడు అతనితో ఎందుకు కలిసి పనిచేస్తున్నారో చెప్పాలి. అదానీ పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎందుకు మారిందో చెప్పాలి. బీజేపీ ఆదేశాల మేరకే తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ అదానీతో కలిసి పని చేస్తున్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను కాంగ్రెస్, బీజేపీ కలిసి బొంద పెట్టాలంటూ బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి బండి సంజయ్ పిలుపునిస్తారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలి’అని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. ఎమ్మెల్సీలకు సమన్వయ బాధ్యతలు! లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీలకు కీలక బాధ్యతలు అప్పగించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ ఓడిపోయిన నియోజక వర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్సీలకు సమన్వయ బాధ్యతలు అప్పజెప్పాలని పార్టీ భావిస్తున్నట్లు కూడా కేటీఆర్ చెప్పినట్లు తెలిసింది. అవసరమైతే వారినే ఎంపీలుగా పోటీకి నిలిపే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా నిజామాబాద్ స్థానానికి కల్వకుంట్ల కవిత, మల్కాజిగిరికి శంభీపూర్ రాజు, మెదక్‌కు పి.వెంకట్ రాంంరెడ్డి, మహబూబాబాద్‌కు సత్యవతి రాథోడ్, నల్లగొండకు గుత్తా తనయుడు అమిత్ రెడ్డి పేర్లను సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఎమ్మెల్సీలు కీలకంగా వ్యవహరించాలి గ్రామ స్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకు బీఆర్ఎస్ను పునర్వ్యవస్థీకరించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తదనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని, చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని చెప్పారు. కేటీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో సమావేశమై మాట్లాడారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని, తదనుగుణంగా ఎన్నికల ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఎమ్మెల్సీలు కీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వారం తరువాత కేసీఆర్‌తో ఎమ్మెల్సీల సమావేశం ఉంటుందని తెలిపారు. ఆ భేటీలోనే శాసన మండలికి సంబంధించి పార్టీ నేతలను ఎన్నుకుంటారని పేర్కొన్నారు. -
TS BJP: పలు జిల్లాలకు అధ్యక్షుల మార్పు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పలు జిల్లాల అధ్యక్షులను మార్చింది. పలు జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. అలాగే, కొత్తగా ఆరుగురు బీజేపీ మోర్చా అధ్యక్షులను కూడా నియమించింది. వివరాల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ నాయకత్వం పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పలు జిల్లాల అధ్యక్షులను మార్చింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులకు.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫోన్ చేసి సమాచారమందించారు. కొత్తగా నియమితులైన ఆరు మోర్చాలా అధ్యక్షులు ఎస్టీ మోర్చా - కల్యాణ్ నాయక్ ఎస్సీ మోర్చా - కొండేటి శ్రీధర్ యువ మొర్చా - మహేందర్ OBC మోర్చా - ఆనంద్ గౌడ్ మహిళ మోర్చా - డాక్టర్ శిల్పా కిసాన్ మోర్చా - పెద్దోళ్ల గంగారెడ్డి. కొత్త అధ్యక్షులు వీరే.. నిజామాబాద్ - దినేష్ కుమార్ పెద్దపల్లి - చందుపట్ల సునీల్ సంగారెడ్డి - గోదావరి అంజిరెడ్డి సిద్దిపేట - మోహన్ రెడ్డి యాదాద్రి - పాశం భాస్కర్ వనపర్తి - డి నారాయణ వికారాబాద్ - మాధవరెడ్డి నోల్గొండ - డాక్టర్ వర్షిత్ రెడ్డి ములుగు - బలరాం మహబూబ్ నగర్ - పీ శ్రీనివాస్ రెడ్డి వరంగల్ - గంట రవి నారాయణపేట - జలంధర్ రెడ్డి. -
గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించేందుకు కుట్రలు చేశారు: హరీష్ రావు
సాక్షి, గజ్వేల్: అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించేందుకు అనేక కుట్రలు జరిగాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ భారీ మెజార్టీతో గెలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులే అయినా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కేసులు పెడున్నారు అని తీవ్ర విమర్శలు చేశారు. కాగా, హరీష్ రావు గజ్వేల్ కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు పనిచేశాయి. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. అయినా కూడా కేసీఆర్ విజయం సాధించారు. మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఇది మీ విజయం. మీ అందరి కష్టం. మీకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ ప్రత్యేక సమావేశం. కుట్రలు భగ్నం.. గజ్వేల్‌లో కేసీఆర్‌పై 154 నామినేషన్లు వేశారు. అనేక కుట్రలు. విత్ డ్రా తర్వాత 47 మిగిలాయి. నాలుగు మిషన్ల ఏర్పాటు వల్ల కొందరు కన్ఫ్యూజ్ అయ్యారు. 18,750 ఓట్లు చితికిపోయాయి. మరో 2200 ఓట్లు కారును పోలిన రోడ్డు రోలర్ గుర్తుకు పడ్డాయి. ఇన్ని కుట్రలు జరిగినా కేసీఆర్ 45 వేల మెజారిటీతో గెలిపించారు. మూడోసారి గెలుపు అందించారు. గజ్వేల్ ప్రజలందరికీ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ తరుపున ధన్యవాదాలు. గజ్వేల్ అభివృద్ధి ఎంతో జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీలో గజ్వేల్‌పై కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కింది. గత చరిత్రను బీఆర్ఎస్ తిరగరాసింది. ఒక్కనాడు కూడా కాంగ్రెస్ నాయకులపై కేసుకు పెట్టలేదు. గజ్వేల్ ఎలా బాగు చేయాలి అని నిరంతరం ఆలోచించారు. కానీ, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నెల రోజులు కూడా కాలేదు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. కేసులు పెడుతున్నారు. కేసీఆర్ గజ్వేల్‌ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తే, కాంగ్రెస్ వాళ్లు కేసులు, కుట్రలతో ముందుకు తీసుకెళుతున్నారు. ప్రగతి భవన్ గురించి భట్టి చెప్పాలి.. డిసెంబర్ 9న రుణమాఫీ.. నాలుగు వేలకు పింఛన్లు పెంచుతాం.. కరెంట్ బిల్లు కట్టొద్దు.. రైతుబంధు పెంచుతాం అన్నారు. వడ్లకు రూ.500 బోనస్, నిరుద్యోగ భృతి అన్నారు.. ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారు. ప్రగతి భవన్లో 250 బెడ్ రూమ్స్ ఉన్నాయన్నారు. బంగారు బాత్ రూములు ఉన్నాయన్నారు. అక్కడ ఉంటున్న భట్టి గారు వాస్తవాలు చెప్పాలి. కేటీఆర్ దావోస్ వెళ్లి పెట్టుబడులు తెస్తే దండుగ అన్నారు. ఉత్తకుమార్ రెడ్డి అక్కడికి వెళ్ళడం వేస్ట్ అన్నారు. మీ ముఖ్యమంత్రి వెళ్ళారు ఏం సమాధానం చెబుతారు. బీజేపీతో కోట్లాడతం అని దోస్తీ చేస్తున్నది ఎవరు? బండి సంజయ్, అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్‌ను బీఆర్ఎస్ ఓడించింది. ఈ దేశం అదానీ, అంబానీ చేతుల్లో ఉందని, అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడని, ఈ ఇద్దరి చేతుల్లో 500 కంపెనీలు ఉన్నయని రాహుల్ గాంధీ అంటాడు. సాయంత్రం రేవంత్ రెడ్డి, అదానీ కలిసి హగ్ ఇచ్చుకుంటారు. షేక్ హ్యాండ్ చేసుకుంటారు. రాహుల్ కరెక్టా? రేవంత్ కరెక్టా?. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది. గజ్వేల్ ప్రజలకు అండగా ఉంటా.. గజ్వేల్ ప్రజల కోసం నా తలుపులు 24 గంటల పాటు తెరిచే ఉంటాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకుంటాను. ఎక్కడ అన్యాయం జరిగినా ఫోన్ చేయండి, నేనే మీ వద్దకు వస్తాను భుజం కలిపి పోరాటం చేస్తాను. పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యి మెదక్ జైల్లో నాలుగు రోజుల పాటు ఉన్నాను. ధైర్యంగా ఉండండి, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. కలిసి పనిచేద్దాం.. మన కేసీఆర్ కోలుకుంటున్నారు. త్వరలోనే గజ్వేల్ క్యాంప్ ఆఫీస్‌కి వస్తారు. మీ అందరితో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో మీకు పూర్తిస్థాయిలో సహకారం ఉంటుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు మనకు అద్భుతమైన విజయమందిస్తారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో మూడు వంతుల ఎంపీ సీట్లు అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందని వార్తలు వస్తున్నాయి. ఎంపీ ఎన్నికల్లో కలిసి పని చేద్దాం. ఏడు ఎమ్మెల్యేలలో ఆరు ఎమ్మెల్యేలు మన పార్టీ వాళ్ళు ఉన్నారు. అద్భుత విజయం సాధిస్తాం. మీకు స్థానిక నాయకులతో పాటు, కేసీఆర్, నేనూ అందుబాటులో ఉంటాము. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. కలిసి ముందుకు వెళ్దాం అని వ్యాఖ్యలు చేశారు. -
ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. ఎన్నికల ముందు అదానీ దొంగ అని విమర్శించిన రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక దావోస్ సాక్షిగా అదానీతో అలయ్-బలయ్ చేసుకున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ- అదానీ ఒకటేనని రాహుల్ అంటున్నారని.. మొన్న రేవంత్ కూడా అదానీ-మోదీ ఒకటేనని విమర్శించారని గుర్తు చేశారు. ఢిల్లీలో అదానీతో కొట్లాడుతూ తెలంగాణలో మాత్రం అదానీతో కలిసి ఎందుకు పనిచేస్తున్నారో చెప్పాలని రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. సభకు మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నేతలు హాజరయ్యారు. చదవండి: MLC: నామినేషన్ వేయని ప్రతిపక్షాలు.. ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవం! ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అవకాశవాదం, దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీ ఆదేశాల మేరకు అదానీతో రేవంత్‌రెడ్డి కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు. రూ.2లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారని.. ఇప్పుడు రుణమాఫీ దశలవారీగా చేస్తామని వ్యవసాయ మంత్రి అంటున్నారని గుర్తు చేశారు. ఎరువుల కోసం రైతులు లైన్లో నిలబడే పరిస్థితులు మళ్లీ వచ్చాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు కాదు.. ఆస్తులు సృష్టించిందన్నారు. బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణను కాంగ్రెస్‌కు అప్పగించామన్నారు. -
MLC: నామినేషన్ వేయని ప్రతిపక్షాలు.. ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. రెండు స్థానాల కోసం ఇద్దరు అభ్యర్థులు(కాంగ్రెస్) నుంచి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇక, ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇదిలా ఉండగా.. ప్రతిపక్షాల నుంచి ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో, వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మరోవైపు.. రేపు నామినేషన్ల పరిశీలన కొనసాగనుంది. ఈనెల 22వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకు అభ్యర్థుల ఎన్నికపై ప్రకటన వెలువడనుంది. కాంగ్రెస్ అభ్యర్థుల బయోడేటా 1. పేరు : బల్మూరి వెంకట్/బల్మూరి వెంకట నర్సింగరావు తండ్రి: మదన్మోహన్రావు పుట్టిన తేదీ : నవంబర్ 2, 1992 విద్యార్హత: ఎంబీబీఎస్ పుట్టిన ఊరు: తారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా కులం: ఓసీ (వెలమ) 2. పేరు: బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ తండ్రి: బి.గంగాధర్ గౌడ్ పుట్టిన తేదీ: ఫిబ్రవరి 24, 1966 విద్యార్హత: బీకామ్ పుట్టిన ఊరు: రహత్‌నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా కులం: బీసీ (గౌడ) -
MLC elections: నామినేషన్లు వేసిన కాంగ్రెస్ అభ్యర్థులు
హైదరాబాద్, సాక్షి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు కాగా, కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు నామినేషన్ పత్రాలు సమర్పించారు. మరోవైపు బీఆర్ఎస్ తరఫున నామినేషన్లు దాఖలు కాకుంటే.. ఓటింగ్‌తో పని లేకుండా వీళ్ల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. లేకుంటే ఎమ్మెల్యేలు ఓటేయక తప్పదు. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2021 నవంబర్‌లో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి పదవీ కాలం 2027 నవంబర్ వరకు ఉంది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వెంటనే ఇద్దరు తమ ఎమ్మెల్సీ పదవులకు(డిసెంబర్ 9వ తేదీన) రాజీనామా చేశారు. దీంతో జనవరి 4వ తేదీన ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక కోసం వేరువేరుగా ఓటింగ్ నిర్వహణకు షెడ్యూల్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే శాసనసభలో కాంగ్రెస్‌కు తగినంత సంఖ్యాబలం ఉండడంతో.. రెండూ తమ స్థానాల్లో గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమాలో ఉంది. మరోవైపు వేర్వేరుగా షెడ్యూల్ విడుదల చేయడంతో.. వేర్వేరుగా ఓటింగ్ నిర్వహించాల్సి వస్తుండడంపై బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈసీ షెడ్యూల్ జనవరి 4వ తేదీన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల జనవరి 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల జనవరి 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జనవరి 19వ తేదీ నామినేషన్ల పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 22వ తేదీ వరకు గడువు 2024 జనవరి 29వ తేదీన ఎన్నికల నిర్వహణ ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు పోలింగ్.. అదే రోజు సాయంత్రం కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఫిబ్రవరి 1 వ తేదీ లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కాంగ్రెస్ అభ్యర్థుల బయోడేటా 1. పేరు : బల్మూరి వెంకట్/బల్మూరి వెంకట నర్సింగరావు తండ్రి: మదన్మోహన్రావు పుట్టిన తేదీ : నవంబర్ 2, 1992 విద్యార్హత: ఎంబీబీఎస్ పుట్టిన ఊరు: తారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా కులం: ఓసీ (వెలమ) 2. పేరు: బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ తండ్రి: బి.గంగాధర్ గౌడ్ పుట్టిన తేదీ: ఫిబ్రవరి 24, 1966 విద్యార్హత: బీకామ్ పుట్టిన ఊరు: రహత్‌నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా కులం: బీసీ (గౌడ) -
నందమూరి ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ చూసిన ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య.. ఫ్లెక్సీని తీసేయాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో బాలకృష్ణ అభిమానులు.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. ఫ్లెక్సీలు తొలగించడంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. గతంలో చంద్రబాబు అరెస్ట్ విషయంలో నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీయార్ సైతం మౌనంగా ఉండిపోవడంతో నందమూరి, నారా కుటుంబాలకు పెద్ద షాకే ఇచ్చింది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో తారక్ స్పందించకపోవడంతో ఆయనపై బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్ కేర్ అంటూ ఫైర్ అయిన విషయం తెలిసిందే. 👉: తాత వర్థంతికి సిసలైన మనవడు ఎన్టీఆర్ నివాళి.. బాలయ్య సీరియస్ (ఫొటోలు) -
కాంగ్రెస్ మార్క్ సెలక్షన్!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ మార్కు స్పష్టంగా కనిపించింది. ఎవరూ ఊహించని విధంగా భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావుకు అవకాశం ఇచ్చింది. వెంకట్‌తో పాటు ముందు నుంచీ ఊహిస్తున్న విధంగానే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ను మరో అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. బల్మూరి వెంకట్ ఓసీ (వెలమ) వర్గానికి చెందిన వారు కాగా, మహేశ్‌కుమార్ బీసీ (గౌడ) వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. తొలుత బల్మూరితో పాటు దళిత నాయకుడు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు ఖరారైందనే వార్తలు వెలువడ్డాయి. నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాల్సిందిగా చెప్పిందని కూడా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఝలక్ ఇచ్చింది. గవర్నర్, స్థానిక సంస్థలు, గ్రాడ్యుయేట్స్ కోటా ఎమ్మెల్సీ పదవులను ఎస్సీ, మైనార్టీ వర్గాలకు కేటాయిస్తారని తెలుస్తోంది. మొదట్నుంచీ పార్టీకి విధేయుడు ఎన్నికైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అతి తక్కువ వయసులో ఎమ్మెల్సీ అయిన నేతగా బల్మూరి వెంకట్ రికార్డు సృష్టించనున్నారు. ఇక ఆయన ఎంపికకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వెంకట్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. విద్యార్థి స్థాయి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఖచ్చితంగా భవిష్యత్ ఉంటుందన్న సంకేతాలు పంపడంలో భాగంగానే వెంకట్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారనే చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో పాలు పంచుకున్న పలువురు నేతలకు కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యత కల్పించిందని, అందులో భాగంగా వెంకట్‌కు ఈ ప్రాధాన్యత లభించిందని చెబుతున్నారు. మరోవైపు పార్టీ పట్ల వెంకట్కున్న విధేయత కూడా కలిసి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2021 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి వెంకట్‌ను పోటీకి దింపిన కాంగ్రెస్ పార్టీ.. అంతకు ముందు 2018 ఎన్నికల్లో పెద్దపల్లి అసెంబ్లీ టికెట్‌ను, ఆ తర్వాత 2023 ఎన్నికల్లో హుజూరాబాద్ టికెట్‌ను ఇవ్వలేదు. అయినా పార్టీ పట్ల విధేయతతో వెంకట్ అవిశ్రాంతంగా ఉద్యమాలు నిర్వహించారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ, పేపర్ లీకేజీలు, పోలీసు ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడారు. అనేకసార్లు గాయపడ్డారు. పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో జైలుకు కూడా వెళ్లారు. చర్లపల్లి జైల్లో ఉన్న వెంకట్‌ను ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా పరామర్శించారు. ఈ విధేయతే వెంకట్‌కు అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లే అవకాశాన్ని కల్పించిందని, 2023 ఎన్నికల కంటే ముందే కేసీ వేణుగోపాల్ స్వయంగా వెంకట్ భవిష్యత్తుకు హామీ ఇచ్చిన దృష్ట్యా ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. వెంకట్ పేరును రాహుల్‌గాంధీ స్వయంగా ప్రతిపాదించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండో ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్, మహేశ్‌గౌడ్‌ల పేర్ల పరిశీలన జరిగిందని, చివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైపు పార్టీ మొగ్గు చూపిందని చెబుతున్నారు. సంస్థాగత నిర్మాణంలో మహేశ్ సక్సెస్ మహేశ్‌కుమార్ గౌడ్ కూడా విద్యార్థి రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 1986–1990 వరకు నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్‌లోనూ పనిచేశారు. అనంతరం పీసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2013–14 వరకు ఉమ్మడి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. ఇక, 2014లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగస్వామి అయిన మహేశ్‌గౌడ్ ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల బాధ్యుడిగా పనిచేస్తున్నారు. 2023 ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించినా కొన్ని సమీకరణల వల్ల సాధ్యం కాలేదు. అయినా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దడంలో సఫలీకృతులయ్యారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేని కారణంగా ఎమ్మెల్సీ లేదా పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామని గతంలోనే అధిష్టానం మహేశ్‌కు హామీ ఇచ్చిందని, ఈ హామీ మేరకే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంపిక చేసిందని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. నిస్వార్థంతో చేసిన కష్టానికి గుర్తింపు: వెంకట్ ప్రజాసమస్యల పరిష్కారం కోసం, పార్టీ బలోపేతం కోసం నిస్వార్థంతో సేవ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఓ యువ కార్యకర్తకు గుర్తింపునిచ్చిందని బల్మూరి వెంకట్ చెప్పారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాందీ, రాహుల్‌గాందీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై నమ్మకంతో పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ గౌడ్, బల్మూరి నేడు నామినేషన్ల దాఖలు సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇద్దరిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావు (వెంకట్) అభ్యర్థిత్వాలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇద్దరికీ పార్టీ బీ ఫారాలు అందజేశారు. కాగా మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్ గురువారం ఉదయం విడివిడిగా తమ నామినేషన్లు దాఖలు చేస్తారని సీఎల్పీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. బల్మూరి వెంకట్ బయోడేటా పేరు : బల్మూరి వెంకట నర్సింగరావు తండ్రి: మదన్మోహన్రావు పుట్టిన తేదీ : నవంబర్ 2, 1992 విద్యార్హత: ఎంబీబీఎస్ పుట్టిన ఊరు: తారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా కులం: ఓసీ (వెలమ) మహేశ్‌కుమార్ గౌడ్ బయోడేటా పేరు: బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ తండ్రి: బి.గంగాధర్ గౌడ్ పుట్టిన తేదీ: ఫిబ్రవరి 24, 1966 విద్యార్హత: బీకామ్ పుట్టిన ఊరు: రహత్‌నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా కులం: బీసీ (గౌడ) -
గ్యారంటీల చావు వార్తే
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఏటా రూ. 3.5 లక్షల కోట్లు కావాలి. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆ రాష్ట్ర ఆర్థిక సలహదారు చెప్తున్నారు. తెలంగాణలోనూ గ్యారంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు’అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఎలాగూ అధికారంలోకి రాలేమనే భావనతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను అరచేతిలో వైకుంఠం చూపేలా తయారు చేసిందని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో వచ్చే ఆదాయానికి మించిన హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని, వాటిని నెరవేర్చడం అసాధ్యమని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకుని కేవలం నెల రోజుల్లోనే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్ష, సన్నాహక సమావేశాలు మొదలుపెట్టాం. కార్యకర్తల నుంచి విలువైన సూచనలు అందుతున్నాయి. కార్యకర్తలు కోరుకున్న రీతిలోనే ఇకపై పార్టీ పనిచేస్తుంది. ప్రతిపక్ష స్థానంలోకి వచ్చినా అధైర్యపడకుండా పోరాడుదాం. సోషల్ మీడియా దు్రష్పచారాల కాలంలో ప్రభుత్వం మారేందుకు బలమైన కారణాలు అవసరం లేదు. కాంగ్రెస్‌తో సహా ఐదేళ్లలోపే ప్రజావ్యతిరేకత మూటగట్టుకుని ఇంటికి వెళ్లిన సందర్భాలే ఎక్కువ. ఉద్యమానికి ఊపిరి లూదిన వాళ్లం, పేగులు తెగే దాకా మన మాతృభూమి కోసం కొట్లాడిన వాళ్లం. మనకు సత్తువ.. సత్తా ఉంది. ప్రతిపక్ష హోదాలో కూడా మన మట్టి మనుషుల ఆకాంక్షల కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడుదాం’అని పిలుపునిచ్చారు. సంప్రదాయ రాజకీయ పద్ధతులకు దూరం వల్లనే నష్టం రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేసినా సంప్రదాయ రాజకీయ పద్ధతులకు దూరంగా ఉండటం వల్లే నష్టం చేసిందనే భావన కార్యకర్తల్లో ఉందని హరీశ్‌రావు అన్నారు. ‘విభజన సమస్యల పరిష్కారంతో పాటు పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్రం చేతులెత్తేసింది. కేంద్రంపై పోరు చేయాల్సిన కాంగ్రెస్ ఢిల్లీలో బీజేపీ నాయకులకు దండలు వేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేస్తారని బండి సంజయ్ అనే బ్రహ్హజ్ఞాని చెప్తున్నాడు. పారీ్టలను కూల్చడం, చీల్చడం వంటివి కాంగ్రెస్, బీజేపీలకే అలవాటు. కాంగ్రెస్, బీజేపీ మైత్రిని ఒప్పుకుంటూ వార్తల్లో ఉండేందుకు బండి సంజయ్ తాపత్రయ పడుతున్నారు’’అని హరీశ్ ధ్వజమెత్తారు. హత్యారాజకీయాలు చేస్తోన్న కాంగ్రెస్ ’’రాష్ట్ర ఆర్దిక స్థితిగతులపై శ్వేతపత్రం ప్రకటించి బీఆర్ఎస్ను బదనాం చేసేందుకు ప్రయతి్నంచే క్రమంలో కాంగ్రెస్ తమ గోతిని తామే తీసుకుంది. తెలంగాణ ఆరి్ధక పురోగతిని నీతి ఆయోగ్ తాజా నివేదిక కూడా పొగిడింది. దేశంలో పేదరికంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ దిగువ నుంచి మూడో స్థానంలో ఉంది. దావోస్ వెళ్లడం దండగ అంటూ గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉంది పెట్టుబడులు వద్దని కాంగ్రెస్ చెప్తుందా? అని హరీశ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. సమావేశంలో మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. -
Congress: ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. అద్దంకి దయాకర్‌కు ఝలక్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు, యువనేత బల్మూరి వెంకట నర్సింగరావు(బల్మూరి వెంకట్)తోపాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌ను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. అయితే అభ్యర్ధుల ప్రకటనలో కాంగ్రెస్ స్వల్ప మార్పులు చేసింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. తొలుత అద్దంకి దయాకర్‌కు, బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేయగా.. చివరి నిమిషంలో సీనియర్లు చక్రం తిప్పడంతో అద్దంకిని కాదని మహేష్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ అవకాశం వరించింది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయగా.. ఆ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 29వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి ఈనెల 18న నామినేషన్లకు చివరి తేదీ. ఈ క్రమంలో గురువారం ఉదయం 11 గంటలకు ఇద్దరు అభ్యర్ధులు నామినేషన్ వేయనున్నారు. చదవండి: అందుకే ఆగాం, లేకుంటేనా.. : హరీష్‌రావు ఇక 2021 ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన వెంకట్.. 2023 సార్వత్రిక ఎన్నికల్లో అధిష్టానం సూచన మేరకు టికెట్ రేసు నుంచి వైదొలగారు. సమీకరణల్లో భాగంగా అక్కడ హుజూరాబాద్ మండలం సింగాపురానికి చెందిన వొడితెల ప్రణవ్‌కు పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇద్దరి పేర్లను ప్రకటించింది అధిష్టానం. -
అందుకే ఆగాం, లేకుంటేనా.. : హరీష్‌రావు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు తండ్లాడినా.. అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డామని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో జరిగిన నాగర్ కర్నూల్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. ఆయన కాంగ్రెస్ సర్కార్‌పై సెటైర్లు సంధించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో వరసగా పదేళ్లు పాలించిన సందర్భాలు చాలా అరుదు. ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి 45 రోజులవుతోంది. కరీంనగర్ కు ఒక్క రూపాయి తెనోడు అడ్డమైన విషయాలు అడ్డం పొడువు మాట్లాడుతున్నాడు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారాయన. ఎలాగూ అధికారం రాదు కదా అని అరచేతిలో వైకుంఠం చూపేలా మేనిఫెస్టోను రాసేశారు. మన దగ్గర కూడా కాంగ్రెస్ నేతలు గ్యారంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని బీఆర్ఎస్ సీనియర్ నేత చెప్పారు. దావోస్ వెళ్లడం అంటే ఖర్చు దండగ అని ప్రతిపక్షం లో ఉండగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు, ఇప్పుడేమంటారు?.. దావోస్‌కు వెళ్లిన సీఎం బృందం రాష్ట్రం అప్పుల్లో ఉంది.. పెట్టుబడులకు రావొద్దు అని చెప్పదలుచుకుందా? అని నిలదీశారాయన. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ హత్యా రాజకీయాలు మొదలుపెడుతోందని మండిపడ్డారు. ఇంకా వంద రోజులు కాలేదు కదా అని ఆగుతున్నాం. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్లం అని మండిపడ్డారాయన. కొన్ని రోజులు పోయాక ఇంట్లో కూర్చున్న బీఆర్ఎస్ నేతల్ని ప్రజలే బయటకు తీసుకువస్తారని హరీష్‌రావు అన్నారు. -
అనూహ్యంగా తెరపైకి బల్మూరి వెంకట్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావు పేరు తెరపైకి వచ్చింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ పేరు దాదాపు ఖరారైందని ప్రచారం జరిగినా, మంగళవారం అనూహ్యంగా వెంకట్ రేసులోకి వచ్చారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌తో పాటు వెంకట్‌ను రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం నుంచే ప్రచారం జరిగినా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఇద్దరికీ ఏఐసీసీ నుంచి వ్యక్తిగతంగా సమాచారం అందిందని, నామినేషన్లు సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. ఈ నెల 18న నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఏ క్షణమైనా ఈ ఇద్దరి పేర్లను ఏఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుందని తెలుస్తోంది. నిజానికి మంగళవారమే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని, బుధవారం అధికారిక ప్రకటన వస్తుందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. జగ్గారెడ్డికి బీ ఫారాలపై సంతకాల అధికారం ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు సమర్పించనున్న బీఫారాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి సంతకాలు చేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో బీఫారాలిచ్చే అధికారాన్ని ఏఐసీసీ జగ్గారెడ్జికి ఇచి్చంది. ఇక నామినేషన్ల దాఖలు, ఎమ్మెల్యేల చేత ప్రతిపాదిత సంతకాలు చేయించే వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యతను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించినట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అతిపిన్న వయస్కుడిగా మండలిలో అడుగుపెట్టే ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ రికార్డు సృష్టించనున్నారు. దేశంలోనే శాసనమండలికి ఎన్నికైన వారిలో ఇంత చిన్న వయస్సు ఉన్న వారెవరూ లేరు. ప్రస్తుతం వెంకట్ వయసు 30 సంవత్సరాల 9 నెలలు. ఇప్పటివరకు 33 ఏళ్ల వయసులో ఒకరు గుజరాత్ శాసనమండలికి ఎన్నిక కావడమే రికార్డు అని, ఇప్పుడు ఆ రికార్డును వెంకట్ అధిగమిస్తారని గాంధీభవన్ వర్గాల సమాచారం. -
తెలంగాణలో బీజేపీ ప్లాన్ ‘బీ’.. టార్గెట్ బీఆర్ఎస్!
దేశమంతా చక్రం తిప్పుతున్న కమలం పార్టీ దక్షిణాదిన పాగా వేయలేకపోతోంది. తెలంగాణలో అధికారం వస్తుందన్న దశ నుంచి తిరోగమించింది. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పుంజుకోవాలని ఆశిస్తోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది కాషాయసేన. మోదీ పేరు చెప్పుకుని తెలంగాణలో ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించడానికి ప్లాన్ చేస్తోంది. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యూహాలు రచిస్తోంది. ఇంతకీ తెలంగాణ బీజేపీ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలు ఏంటి?.. తెలంగాణలో బలం పెంచుకోవడానికి కమలం పార్టీ హైకమాండ్ పెద్ద స్కెచ్చే గీస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన చేరికల కమిటీని మళ్లీ ఏర్పాటు చేస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఈటల రాజేందర్ నేతృత్వంలో జాయినింగ్స్ కోసం ప్రత్యేకంగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో డబుల్ డిజిట్ పార్లమెంట్ సీట్లు సాధించడమే లక్ష్యంగా కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీలో ఇప్పటికే కొన్ని పార్లమెంట్ స్థానాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. మల్కాజిగిరి, జహీరాబాద్, మెదక్, హైదరాబాద్ ఎంపీ టికెట్ల కోసం బీజేపీలో గట్టిపోటీ నెలకొంది. కొత్తగా బీజేపీలో చేరే ఆ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు ఎవరు? వాళ్లు వస్తే తమ భవిష్యత్ ఏంటీ? అనేదానిపై పార్టీలో నేతల మధ్య విస్తృత చర్చ సాగుతోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ చాలాకాలం నుంచి కలలు కంటోంది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు కూడా రాలేదు. దానికి అనేక కారణాలున్నాయని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాకపోయినా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తాజాగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు కసరత్తు ప్రారంభించింది. బీఆర్ఎస్లోని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బీజేపీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. స్థానిక సంస్థల్లో బలోపేతమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలున్నాయని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ నేతృత్వంలో వేసిన చేరికల కమిటీ ముందు బీజేపీ హైకమాండ్ పెద్ద టార్గెట్ పెట్టినట్లు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే విధంగా పనిచేయాలని అందుకు తగ్గట్టుగా సిద్దం కావాలని కమలం పార్టీ డిసైడ్ అయింది. అందులో భాగంగానే క్రింది స్థాయి నేతలను భారీగా చేర్చుకోవాలని పార్టీ స్కెచ్ వేస్తోంది. మరి బీజేపీ వైపు గులాబీ పార్టీ నేతలు ఏ మేరకు మొగ్గు చూపుతారో చూడాలి. -
MLC Election: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీనియర్ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను ఖరారు చేసింది. దీంతో, వీరిద్దరూ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. వివరాల ప్రకారం.. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను కాంగ్రెస్ ఫైనల్ చేసింది. కాంగ్రెస్ ముఖ్య నేతలు వీరికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఇక, ఈనెల 18వ తేదీన ఎమ్మెల్సీ నామినేషన్లకు ఆఖరు తేదీ. 29న ఎన్నికలు జరగనున్నాయి. కాగా, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండటంతో వీరి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. -
సీపీఎం తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు
సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండె పోటుకు గురయ్యారు. దీంతో, మెరుగైన వైద్యం కోసం తమ్మినేనిని వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. ఇక, గతంలోనే తమ్మినేని స్ట్రోక్ రావడంతో స్టంట్ కూడా పడింది. వివరాల ప్రకారం.. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం గుండె పోటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన స్వగ్రామం తెల్దారపల్లిలో ఉన్న సమయంలోనే తమ్మినేని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో లంగ్స్ ఇన్ఫ్‌క్షన్‌తో పాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలో అంబులెన్స్‌లో తమ్మినేనిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. గతంలో తమ్మినేనికి స్ట్రోక్ వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఆయనకు వైద్యులు స్టంట్ వేశారు. తాజాగా మరోసారి మైల్డ్ స్ట్రోక్ రావడంతో పరిస్థితి కొంచెం విషమంగా మారింది. -
తెలంగాణ బీజేపీలో కొత్త రచ్చ.. హైకమాండ్ ఏం తేల్చబోతుంది?
తెలంగాణ కాషాయ పార్టీలో కొత్త రచ్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఖర్చు విషయంలో పోటీ చేసిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఫండ్ పక్కదారి పట్టిందని పలువురు నేతలు రచ్చకెక్కుతున్నారు. మరికొందరు అధిష్టానం వరకు ఈ వివాదాన్ని తీసుకువెళ్లారు. బీజేపీ హైకమాండ్ ఎన్నికల ఖర్చు లెక్కలపై ఏం తేల్చబోతుంది ? లెక్కలు సరిచేస్తారా ? వదిలేస్తారా ? తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఖర్చు లెక్కలపై ఆరా తీస్తోంది. ఎన్నికల సందర్భంగా వచ్చిన పార్టీ ఫండ్ దారితప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై పలువురు బీజేపీ అభ్యర్థులు హస్తినకు ఫిర్యాదులు చేశారు. పార్టీ హైకమాండ్ ఇచ్చిన నిధులు కింది వరకు అందకపోవడంతో.. చాలా సెగ్మెంట్లలో పార్టీ ఓడిపోయిందని వారు అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారట. రాష్ట్రానికి చెందిన పలువురు నేతల ఫిర్యాదు మేరకు నిధుల సంగతి తేల్చేందుకు తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చెందిన షాడో టీమ్ రంగంలోకి దిగిందని చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను మూడు కేటగిరీలుగా విభజించి ఫండ్ కేటాయించిందని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. నియోజకవర్గాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారని వారు వెల్లడించారు. ఏ కేటగిరీ అంటే గెలిచేదిగా, బీ అంటే కొంచెం కష్టపడితే గెలిచేదిగా, సీ కేటగిరి అంటే గెలిచే ఛాన్స్ లేకపోయినా.. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడమే లక్ష్యం. అయితే పార్టీకి ఏమాత్రం బలం లేని పలు అసెంబ్లీ సెగ్మెంట్లకు భారీగా నిధులు సమకూర్చారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అదే గెలుపునకు దగ్గరలో ఉన్నారనుకున్న సెగ్మెంట్లకు చాలా తక్కువ నిధులు కేటాయించడంతో ఓటమి పాలయ్యామని పలువురు పార్టీ అధిష్టానం ముందు ఆవేదన వ్యక్తం చేశారట. అభ్యర్థుల నుంచి అందిని ఫిర్యాదుల మేరకు అసలు..ఎవరికెంత ఇచ్చారనే దానిపై అమిత్ షా టీమ్ రంగంలోకి దిగిందని చెబుతున్నారు. ఈ వివరాలపై ఆరా తీస్తున్న హైకమాండ్ బృందానికి సర్దిచెప్పేందుకు రాష్ట్ర నాయకత్వం హైరానా పడుతోంది. తెలంగాణలో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 19 సెగ్మెంట్లలో రెండో స్థానంలో నిలిచింది. అయితే రెండో స్థానంలో నిలిచిన చాలా సెగ్మెంట్లకు అధిష్టానం కేటాయించిన నిధుల్లో సగం మాత్రమే అందాయని, మిగతా సగం నిధులు దారి మళ్లాయని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ఆ స్థానాల్లో పార్టీ ఓటమికి నిధులు సక్రమంగా అందకపోవడమే కారణమని హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తెలంగాణకు వచ్చిన అమిత్ షా టీమ్ ఇంకా ఏయే అంశాలపై ఆరా తీయనుందనేది అంతుచిక్కడం లేదు. ఈ వివరాలతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అంశాలపైనా దృష్టి కేంద్రీకరించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమేనని చెప్పిన ఆశావహులు టికెట్ వచ్చాక మాత్రం ఇలాంటి ఫిర్యాదులు చేయడంపైనా హైకమాండ్ దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. అమిత్ షా టీమ్ ఎలాంటి నివేదికను అధిష్టానానికి అందించనుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి వచ్చిన ఢిల్లీ టీమ్ ఇచ్చే నివేదికపై జాతీయ నాయకత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి. ఇదీ చదవండి: బీఆర్ఎస్ అదిరిపోయే ప్లాన్.. ఎన్నికల్లో సక్సెస్ అయ్యేనా? -
ఆ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాల్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఎంతో నైపుణ్యం కలిగిన పవర్లూమ్ నేతన్నలు, అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారు. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్ లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలి. గత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలు ఈ రంగానికి ఉన్నాయి. అయితే ఈ రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: కవిత రానంది.. ఈడీ యాక్షన్ ఎలా ఉండనుందో? -
Liquor Scam: కవిత రానంది.. ఈడీ యాక్షన్ ఎలా ఉండనుందో?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కేసులో నాలుగోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. విచారణకు రాలేనంటూ ఆమె ఈడీకి మెయిల్ పంపారు. ఈ నేపథ్యంలో ఈడీ యాక్షన్ ఎలా ఉండబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. లిక్కర్ కేసులో ఇవాళ(మంగళవారం, జనవరి 16న) ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు పంపించింది. అయితే సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ ఉత్తర్వులు ఉన్నాయని.. తన కేసు ఇంకా సుప్రీంలో పెండింగ్‌లో ఉందని లేఖలో పేర్కొన్న కవిత.. కాబట్టి తాను విచారణకు రాలేనని మెయిల్ ద్వారా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ ఎలాంటి చర్యలకు ఉపక్రమించనుందో స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. గతంలో మూడు సార్లు కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈడీ విచారణ సమయంలో కవిత అరెస్టు అయ్యే ఛాన్స్ ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను విచారించిన ఈడీ అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. -
బీఆర్ఎస్ అదిరిపోయే ప్లాన్.. ఎన్నికల్లో సక్సెస్ అయ్యేనా?
తెలంగాణలో పూర్వ వైభవం సాధించేందుకు గులాబీ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవానికి లోక్‌సభ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకుంటుందా? పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలో ఏం తేల్చారు? అసెంబ్లీ స్థానాల వారీ రివ్యూల్లో ఏం తేల్చబోతున్నారు? అసెంబ్లీ ఎన్నికల ఓటమికి కారణాలుగా ఏం చెప్పబోతున్నారు? రాబోయే లోక్‌సభ ఎన్నికలకు పార్టీని ఎలా సంసిద్ధం చేయబోతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాడి ఎలా ఉండబోతోంది?.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై బీఆర్ఎస్ అగ్రనాయకులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ముందుగా మరో మూడు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల పరాజయానికి ప్రతీకారం తీర్చుకుని లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరేయాలని నాయకత్వం కృతనిశ్చయంతో ఉంది. పార్లమెంటు నియోజక వర్గాల వారీగా పార్టీ స్థితి గతులు బలాబలాలపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. నియోజక వర్గాల వారీగా నిర్వహిస్తోన్న సమీక్షల్లో కిందిస్థాయి కార్యకర్తలను నాయకత్వాన్ని కలవనీయకుండా కొందరు నేతలు అడ్డుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. దాన్ని నాయకులు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. లోక్‌సభ నియోజక వర్గాల వారీ సమీక్షలు పూర్తి అయిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగానూ సమీక్ష జరపాలని నిర్ణయించారు. ఈ నెల 21 వరకు పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష పూర్తి కాగానే అసెంబ్లీ నియోజక వర్గాల్లో క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తలను నేరుగా కలిసి పార్టీలో ఉన్న సమస్యలేంటి, లోపాలేంటి ఇటీవలి ఎన్నికల్లో ఓటమికి కారణాలేంటి? లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవాలంటే ఏం చేయాలి? అన్న అంశాలపై ఆరాలు తీసి ఆ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, కవితలు నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలు నేతలతో భేటీలు నిర్వహిస్తారు. తుంటి ఎముక గాయంతో సర్జరీ చేయించుకున్న పార్టీ అధినేత కేసీఆర్ కోలుకున్నాక వచ్చే నెల 15 నుండి ఆయన కూడా ప్రజాక్షేత్రంలో పర్యటించి పార్టీకి దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. అదే సమయంలో రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీలన్నింటినీ అమలు చేసేలా ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించుకుంది. అవసరమైతే పోరాటాలకూ సిద్ధం కావాలని భావిస్తోంది. తక్షణ కర్తవ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో పదికి పైగా స్థానాల్లో ఘన విజయాలు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాగానే మొత్తం సమీకరణలు మారిపోతాయని.. కోట్లాది మంది తెలంగాణ ప్రజలు తిరిగి బీఆర్ఎస్కే మద్దతు తెలుపుతారని నాయకత్వం నమ్ముతోంది. -
Jupally Krishna Rao: కేటీఆర్‌కు మంత్రి జూపల్లి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్ అయ్యారు. సంక్రాంతి రోజున కేటీఆర్ కారణంగా ప్రెస్‌మీట్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఇదే సమయంలో కేటీఆర్‌కు జూపల్లి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. నిజాలు తెలుసుకుని మాట్లాడాలి అని కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి జూపల్లి సోమవారం సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడుతూ గతేడాది డిసెంబర్లో కొల్లాపూర్‌లో మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి తన బంధువుల చేతిలో హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత కారణాల వలన, భూ తగాదాలతో హత్య జరిగిందని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు అయ్యాక ఇప్పుడు తెర మీదికి ఆ హత్యను ఎందుకు తీసుకు వచ్చారు?. హంతకులను శిక్షిస్తామని మేము ముందే చెప్పాము. ఈ కేసుకు సంబంధించి కొందరు పోలీసుల అదుపులో ఉన్నారు. రాజకీయాలు వద్దు.. మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి బీజేపీ సానుభూతి పరుడు. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎన్నికల కోసం కేటీఆర్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. గతంలో కాంగ్రెస్ సర్పంచ్.. బీఆర్ఎస్ పార్టీలో చేరడం లేదని ఆయనను హత్య చేశారని గుర్తు చేశారు. తన నియోజకవర్గంలో జెట్పీటీసీ హనుమంత్ నాయక్, సర్పంచ్‌లపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేవారు. తన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో చాలా మందిని హత్యలు చేశారని గుర్తుచేశారు. చేయని వాటికి చేశానని తనపై బురద చల్లుతున్నారు. నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడుతున్నారు. రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. 1999 నుండి ఇప్పటి వరకు ఎన్నికల్లో నా మెజార్టీ పెరుగుతూ వస్తుందని, తన విలువలుతో కూడిన రాజకీయాలు చేస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. కొండగట్టు మరణాల సంగతేంటీ? ఇదే సమయంలో మా నియోజక వర్గంలో జరిగిన ప్రతి హత్యపై సాక్ష్యదారాలతో సహా గతంలో డీజీపీకి ఫిర్యాదు చేసిన అప్పుడు ఎవరు పట్టించుకోలేదన్నారు. అప్పుడు జరిగిన హత్యల గురించి ఆనాడు ప్రగతి భవన్లో ఉన్న పెద్దలకు చెప్పినా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు మీరు జనాలను పట్టించుకోలేదు కాబట్టి మిమ్మల్ని జనాలు ఓడగొట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. కొండగట్టు ప్రమాదంలో 60 మంది చనిపోతే మీరు వెళ్ళలేదు కానీ వ్యక్తిగత కారణాలు, భూ వివాదాల వలన చనిపోయిన వ్యక్తి చావుతో శవ రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు.