breaking news
-
కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నాం. ఫామ్ హౌస్‌లోనే ఉండి మాట్లాడతారా.. లేదా అసెంబ్లీకి వస్తారా?’’ అంటూ ఎద్దేవా చేశారు.కేసీఆర్ ఇన్నాళ్లు అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: మల్లు రవికేసీఆర్ ఇన్నాళ్లు అసెంబ్లీకి ఎందుకు రాలేదంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కుంభకర్ణుడిలా ఏడాదిగా నిద్రపోతున్నారు. సోషల్ మీడియాలో మాతరమే బీఆర్ఎస్ పని చేస్తుంది. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఓటింగ్ చేసి.. జిమ్మిక్కులు చేసింది. మేము ప్రజల్లో పనిచేస్తున్నాం. రెండు లక్షల రుణమాఫీ ఏడాది లోపలే చేశాం. మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశాం. కవిత వల్ల కేజ్రీవాల్ లాంటి వారే జైలుకు పోయారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
నేను కొడితే మాములుగా ఉండదు : కేసీఆర్
సాక్షి,హైదరాబాద్ : సుదీర్ఘ కాలం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ( kcr) మౌనం వీడారు. ‘నేను కొడితే మాములుగా ఉండదు’ అంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ (congress party) పాలనపై నిప్పులు చెరిగారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో జహీరాబాద్ బీఆర్ఎస్ (brs) కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ నెల 27న జహీరాబాద్ నుంచి పాదయాత్రగా ఇవాళ ఎర్రవల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులుగా నేను మౌనంగా ఉన్నా.. గంభీరంగా చూస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుతా. కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారు. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కు ఓటేశారు. 👉చదవండి : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్నిన్న కాంగ్రెస్ వాళ్లు ఓటింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చింది. నేను చెప్పినా వినలేదు. అత్యాసకు పోయి కాంగ్రెస్‌కు ఓటేశారు. మన విజయం తెలంగాణ విజయం కావాలి. భూముల ధరలు అమాంతం పడిపోయాయి. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి. ఫిబ్రవరి నెలాఖరును భారీ బహిరంగ సభ పెడుతున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. ఓట్ల కోట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంటుంది. సంగమేశ్వ, బసవేశ్వర టెండర్లను ఎందుకు పిలవలేదు. కాంగ్రెస్‌పై అంతటా అసంతృప్తే. అన్ని వర్గాలను కాంగ్రెస్ ముంచేసింది. పాలన వైఫల్యాలను ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారు.రైతుబంధుకి రాంరాం, దళితబంధుకు జైభీం చెబుతారని ఆనాడే చెప్పా. అన్నీ మబ్బులు తొలగి పోయి అన్నీ బయటకు వస్తున్నాయి. మంచేదో చెడేదో ప్రజలకు తెలుస్తోంది. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కు ఓటేశారు. రాబోయే రోజుల్లో విజయం మనదే. మనం విజయం తెలంగాణ విజయం కావాలి. కైలాసం ఆడితే పాము మింగినట్లుగా ఉంది పరిస్థితి. మాట్లాడితే ఫామ్ హౌస్.. ఫామ్ హౌస్ అని బద్నం చేస్తున్నారు. ఫామ్ హౌస్‌లో పంటలే ఉంటాయి కదా’ అని వ్యాఖ్యానించారు. -
2028లో కేసీఆరే ముఖ్యమంత్రి
తెలంగాణ భవన్: మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ ఆత్మీయ సత్కారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆరే’అని అన్నారు. శుక్రవారం కేటీఆర్ పదవీకాలం ముగిసిన మున్సిపల్ ఛైర్మన్ , వైస్ చైర్మన్ ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2028లో ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. కేసీఆరే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోని అన్నీ రాష్ట్రాల కంటే మన రాష్ట్ర మున్సిపాలిటీలను అభివృద్ది చేసుకున్నాం. బీఆర్ఎస్ హయంలో 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చాం. రూ. 700 కోట్లతో నల్లగొండను అభివృద్ది చేసుకున్నాం.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతుంది, 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గంలో మున్సిపల్ ఉద్యోగులకు 4 నెలలగా జీతాలు రావడం లేదు.సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్ జనరల్ స్థానంలో దళిత బిడ్డకు అవకాశం ఇచ్చాం. టకీ టకీమని డిల్లీలో పైసలు పడుతున్నాయి తప్పా..రైతుల అకౌంట్లలో మాత్రం పడడం లేదు. పదవి కాలం ముగిసిన మున్సిపల్ ఛైర్మన్ , వైస్ చైర్మన్లు ప్రజల్లోనే ఉంటే తిరిగి ప్రజలే గెలిపిస్తారు’ అని కేటీఆర్ దిశానిర్ధేశం చేశారు. -
రేవంత్.. నీళ్ల మీద నీచ రాజకీయాలు ఎందుకు?: కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని సూచనలు చేశారు. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘నీళ్లు-నిజాలు’పై నేడు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నీటి రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..‘నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోంది. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ నిలబడింది. కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం పూర్తి చేయాలి. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి.వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీని కేసీఆర్ కొనసాగించారు. కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తోంది. అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలి. రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్లా పనిచేస్తున్నారు. కేసీఆర్ శత్రువు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఆంధ్ర కేడర్‌లో పనిచేసిన ఆదిత్యా నాథ్ దాస్‌ను బాధ్యతల నుంచి తొలగించాలి. కృష్ణ ట్రిబ్యునల్‌లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలి.కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారు. కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తి చేశాం. మిషన్ కాకతీయ ద్వారా నీటిని అందించడం జరిగింది. కేవలం చెరువులను బాగు చేసుకోవడం వల్ల 9.6 టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకున్నాం. తెలంగాణ ఏర్పడే సమయానికి 68 లక్షల టన్నుల వరి పండితే.. 2022-23 నాటికి కోటి 68 లక్షల టన్నుల ధాన్యం పండింది. గోదావరి, కృష్ణా జలాలను వినియోగంలోకి తెచ్చుకోడానికి కేసీఆర్ కష్టపడ్డారు. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదీ. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు పనికిరావని దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగొట్టారు. బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా ఆ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వలేదు’ అంటూ మండిపడ్డారు. -
ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా ఆపొద్దు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా డబ్బులు నిలిపి వేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఇది కొనసాగుతున్న పథకమే.. ఎన్నికల పేరుతో రైతుల పొట్టకొట్టకండి అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాల్సిందేనని చెప్పుకొచ్చారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా ఓ ప్రకటనలో.. ‘రైతు భరోసా డబ్బులు వేయండి. ఇది కొనసాగుతున్న పథకమే. ఎన్నికల కోడ్ సాకుతో రైతుల పొట్టకొట్టకండి. ఎన్నికలు గ్రాడ్యుయేట్లు, టీచర్లకే పరిమితం. రైతు భరోసాతో ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశమే లేదు. ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము ఎగొట్టారు. అసలే అన్నదాతలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేయాల్సిందే. రేషన్ కార్డులు అర్హులందరికీ ఇవ్వాల్సిందే.ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. రైతు కూలీల అకౌంట్స్‌లో వేయాల్సిందే. ఎన్నికల కోడ్ సాకుతో ఆపితే ఊరుకునేది లేదు. ప్రభుత్వ చేతకానితనాన్ని ఎన్నికల కోడ్ పేరుతో ముడి పెట్టకండి. ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను కొనసాగించండి. అవసరమైతే బీజేపీ పక్షాన ఎన్నికల సంఘానికి లేఖ పంపిస్తాం. తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించండి. అవసరమైతే అందరం కలిసి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేద్దాం’ అని కామెంట్స్ చేశారు. -
Telangana: స్థానిక పోరుకు రెఢీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులోగా లేదా మార్చి మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మార్చి మొదటివారంలో ఇంటర్ పరీక్షలు, మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. దీనితో వచ్చే నెల చివర్లోగానీ, ఆ రెండు పరీక్షల మధ్య సమయంలో (మార్చి 17, 18 నాటికి)గానీ ఎన్నికల ప్రక్రియ ముగించవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెల 5న కేబినెట్ భేటీ ఉంటుందని, స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ కూడా తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మొదలైన నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ చేపట్టవచ్చా అన్న సందేహాలున్నా.. ఆ కోడ్ స్థానిక ఎన్నికలకు అడ్డుకాబోదని ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ ఒకరు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి.. స్థానిక ఎన్నికలకు సన్నాహాల్లో భాగంగానే సమగ్ర కుల సర్వే నివేదిక ఫిబ్రవరి 2న మంత్రివర్గ ఉప సంఘానికి చేరనుందని అధికారవర్గాలు తెలిపాయి. ఉప సంఘం ఆ నివేదికపై చర్చించి తగిన ప్రాధాన్యతాంశాలతో మంత్రివర్గానికి నివేదిక అందిస్తుందని వెల్లడించాయి. ఫిబ్రవరి 5న జరిగే కేబినెట్ భేటీలో ఉప సంఘం నివేదిక, బీసీ రిజర్వేషన్ల పెంపు, డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫార్సులపై చర్చించనున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి 6 లేదా 7వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపించనున్నట్టు సమాచారం. ఎంపీటీసీ స్థానాల డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహాలు మొదలుపెట్టాయి. రెవెన్యూ మండలాల పరిధి, స్థాయికి తగినట్టుగా మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ)ల పునర్విభజన చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు గురువారం పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో ఎంపీటీసీ స్థానంలో 3వేల నుంచి 4 వేల మధ్య జనాభా ఉండేలా రూపకల్పన (కార్వింగ్) చేయాలని సూచించారు. 2011 జనాభా లెక్కలకు అనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ‘కార్వింగ్’ చేయాలని ఆదేశించారు. శుక్రవారం వరకు ఎంపీటీసీ స్థానాల ముసాయిదా ప్రచురించి.. శుక్ర, శనివారాల్లో అభ్యంతరాలకు గడువు ఇవ్వాలని.. శని, ఆదివారాల్లో వాటిని పరిష్కరించి 3వ తేదీన తుది ప్రచురణ చేయాలని సూచించారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా జెడ్పీటీసీలు, రెవెన్యూ మండలాలకు తగ్గట్టుగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ఉండాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో పంచాయతీల విలీనం వల్ల ఎంపీటీసీ స్థానాలు ప్రభావితమైన చోట, నిర్ణీత జనాభాకు మించి, లేదా తక్కువగా ఉన్నచోట పక్కనే ఉన్న స్థానాలతో సర్దుబాటు చేయడం, లేక కొత్త స్థానాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లలో ఎస్ఈసీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ నిర్ణయం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఎదురుచూస్తోంది. తేదీలపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి... రెండు, మూడు వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలపెట్టినట్టు సమాచారం. ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్‌కు ఏర్పాట్లతోపాటు సర్పంచ్ పదవికి 30దాకా, వార్డు మెంబర్లకు 20 దాకా వివిధ ఫ్రీసింబల్స్ (ఎన్నికల చిహ్నాలను) సిద్ధం చేసినట్టు జిల్లాల్లో అధికారులు చెబుతున్నారు. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, వివిధ శాఖల నుంచి నోడల్ అధికారుల నియామకం, బ్యాలెట్ బాక్స్‌లను సైతం సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమైనట్టు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పెంపు సాధ్యమేనా? బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు చర్యలు చేపట్టింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి 50శాతం మించరాదని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేరుగా 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం కాకుండా... ఎక్కడికక్కడ పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్‌ల పరిధిలోని జనాభా ప్రామాణికంగా వేర్వేరుగా రిజర్వేషన్లు అమలు చేసే యోచన కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంటే ఎస్సీ, ఎస్టీల జనాభా అధికంగా ఉన్నచోట బీసీలకు తక్కువగా, బీసీల జనాభా ఎక్కువగా ఉన్నచోట 42 శాతం దాకా రిజర్వేషన్లు ఇచ్చేలా ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు. కానీ ఇది ఆచరణ సాధ్యమేనా అన్న సందేహాలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీపరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం నుంచి 50 శాతం దాకా టికెట్లు ఇవ్వవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
రేవంత్‌ను నమ్మారా.. నమ్మితే నట్టేట మునిగినట్లే : పాడి
సాక్షి,తెలంగాణ భవన్ : సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. ఎవ్వరి సంతకాలు లేకుండా పత్రాలు ఇస్తే ప్రజలు ఎలా నమ్మాలి. ఈ పత్రాలు చూసి ఇళ్ళు కట్టుకుంటే ప్రజలు మోసపోతారు ..తస్మాత్ జాగ్రత్త. రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ మోసపోవద్దు ..ఇండ్లు కట్టుకున్న తర్వాత రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వరు. స్థలం లేని వారికి ఇండ్ల కేటాయింపులో స్పష్టత లేదు. రేవంత్ రెడ్డి ఓ పెద్ద జోకర్లా మారారు. తుగ్లక్‌లా పాలిస్తున్నారు. ఓ మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నారు.కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది ఆయన తీరు. టకీ టకీ అని రైతు భరోసా డబ్బులు పడతాయని రేవంత్ అన్నారు.ఒక్క రోజు డబ్బులు వేసి ఆపేశారు. అధికారులు వచ్చి నామమాత్రపు పత్రాలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ సంతకాలు లేకుండా పత్రాలు ఇస్తే ప్రజలు ఎలా నమ్మాలి?ఈ పత్రాలు చూసి తొందరపడి ఇల్లు కట్టుకుంటే మోసపోతారు.. తస్మాత్ జాగ్రత్త.- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి pic.twitter.com/RRNCkW8D6L— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) January 30, 2025ఆరునెలల దాకా ఎన్నికల కోడ్ పేరు చెప్పి రైతు భరోసాను ఆపే కుట్ర జరుగుతోంది. కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ఎవరి పాలన బాగుంది అంటే కేసీఆర్ పాలన బాగుంది అని 70 శాతం నెటిజన్లు సమాధానమిచ్చారు. దాదాపు 90 వేల మంది ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రజలు కాంగ్రెస్ చెంప చెళ్లుమనిపించారు.మరో ఛానల్ నిర్వహించిన సర్వేలో కూడా 80 శాతం మంది కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు. అన్ని పథకాలు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు. -
‘కాంగ్రెస్ ఔట్.. ప్రజలు తిడుతున్నారని ఎమ్మెల్యేనే చెప్పారు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీకి ఉరితాళ్లు కాబోతున్నాయి. ఎన్నికల్లో గట్టెక్కడానికి గడ్డి తిన్నారు.. అమలు చేయమంటే ఆర్ధిక పరిస్థితి బాగా లేదని సాకులు చూపుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయండి లేకపోతే అధికారం నుంచి దిగిపోవాలని ఘాటు విమర్శలు చేశారు.రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘అసెంబ్లీ స్పీకర్ హామీలను అమలు చేయమని స్వయంగా చెప్పడంతో కాంగ్రెస్ మోసపూరిత వైఖరి బహిర్గతం అయ్యింది. ఆర్ధిక పరిస్థితి తెలియక హామీలు ఇచ్చామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెబుతున్నారు. ఎన్నికల్లో గట్టెక్కడానికి గడ్డి తిన్నారు.. అమలు చేయమంటే ఆర్ధిక పరిస్థితి బాగా లేదని సాకులు చూపుతున్నారు. వంద రోజుల్లో 420 హామీలు అమలు చేస్తామని విస్మరించారు.ప్రజలు తిరగబడుతున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. హామీలు అమలు చేయండి లేకపోతే అధికారం నుంచి దిగిపోవాలి. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చాలా మంది రైతులను విస్మరించారు. మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు ఆ ఊసే లేదు. హామీలు ఇచ్చి మొండి చెయ్యి చూపితే బీజేపీ ఊరుకోదు. హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మోసాలను గుర్తించి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు.తెలంగాణలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకువస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఏడాది కింద ఎనిమిది వేల మంది పదవి విరమణ పొందితే.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితి దుర్భరంగా ఉంది. కేసీఆర్ మూడేళ్లలో ఇస్తామని బాండ్స్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే తక్షణమే ఇస్తామని చెప్పి కాంగ్రెస్ విస్మరించింది. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకోకుండా పదవి విరమణ పొందిన ఉద్యోగులను గోస పుచ్చుకుంటున్నారు.ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రేకులు వేయాలి. బీజేపీ అభ్యర్ధులకు ఓటు వేసి గెలిపించండి.. మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించినట్లు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘అక్రమ అరెస్టు’లపై కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్‌ను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్ లను అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారాయన. ఇవాళ్టి సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు పడగా.. ఆపై ఆందోళనకు దిగిన వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.‘‘కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా?. గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ నిధులను కనీసం కూడా ఖర్చు చేయకుండా.. మరోసారి అవే కాగితాల పైన అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజా ప్రతినిధుల గొంతు నొక్కుతారా?. .. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్ఎంసీ అసమర్ధ తీరును ప్రశ్నిస్తే కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదు. హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలి. అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటాం. అరెస్టు చేసిన కార్పొరేటర్లను, పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలి. ఇచ్చిన హామీలను అమలను చేయకుండా అరెస్టుల పేరుతో ప్రజాప్రతినిధులను అణగదొక్కాలని చూస్తే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని అన్నారాయన. -
BRS కార్పొరేటర్లు సస్పెండ్.. ఆపై అరెస్ట్.. జీహెచ్ఎంసీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాల నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లను మేయర్ విజయలక్ష్మి సస్పెండ్ చేశారు. సమావేశానికి అడ్డుపడడంతో పాటు తనపై పేపర్లు విసిరడంతో జీహెచ్ఎంసీ సెక్షన్ 89/1 ప్రకారం ఆమె ఈ చర్యకు ఉపక్రమించారు. ఆపై రంగప్రవేశం చేసిన మార్షల్స్.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను బయటకు తీసుకెళ్లారు. అయితే బీహెచ్ఎంసీ బయటే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టగా.. పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.అంతకు ముందు.. ప్రశ్నోత్తరాలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. అప్పటికే బయటకు తీసుకెళ్లిన తమవాళ్లను లోపలికి తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు. అయితే.. బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎవరో తనకు తెలియదని, ఆ పార్టీ సభ్యులు తనపై పేపర్లు విసిరారని మేయర్ విజయలక్ష్మి ఆరోపణలకు దిగారు. దీంతో.. మేయర్‌కు క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్కు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో మేయర్ పోడియం వద్ద చేరుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు పరస్పరం దూషించుకున్నారు. దీంతో.. సమావేశాన్ని మేయర్ మరోసారి వాయిదా వేశారు. అంతకుముందు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో రసాభాస చోటు చేసుకోవడంతో కాసేపు సమావేశాన్ని మేయర్ వాయిదా వేశారు. ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ ఫ్లకార్డులతో నిరసనకు దిగగా.. బడ్జెట్ ఆమోదం విషయంలో మొండిపట్టుతో ఉన్న కాంగ్రెస్ సభ్యులు వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ సభ్యుల్లో కొందరిని మార్షల్స్ సాయంతో మేయర్ బయటకు పంపించేశారు. ఆపై విపక్షాల ఆందోళన నడుమ గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా పడింది.ఎన్నికల హామీల మాటేంటి?గురువారం ఉదయం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే.. ముందుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు మేయర్ ప్రకటించారు. అయితే.. ప్రజా సమస్యలపై ముందు చర్చించాలని బీఆర్ఎస్, బీజేపీలు పట్టుబట్టాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు గురించి నిలదీశాయి. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. ఫ్లకార్డులు పట్టుకుని బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. మేయర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో సభను వాయిదా వేసిన మేయర్.. ఆ వెంటనే బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఇది మరింత అగ్గి రాజేసింది.ఏకపక్షంగా బడ్జెట్‌ను మేయర్ ఆమోదించడంపై నిరసనకు దిగిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల చేతుల్లోని ఫ్లకార్డులు లాక్కొని చించేశారు కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్. దీంతో.. కార్పొరేటర్లు ఒకరినొకరు తోసేసుకున్నారు. మేయర్ ఎంత విజ్ఞప్తి చేసినా సభ్యులు తగ్గలేదు. మేయర్‌కు వ్యతిరేకంగా కౌన్సిల్లో విపక్షాలు ఆందోళనకు దిగారు. దీంతో సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారామె. ఆపై కౌన్సిల్ హాల్లోకి మార్షల్స్ ప్రవేశించి.. బీఆర్ఎస్ కార్పొరేటర్లలో కొందరిని బయటకు తీసుకెళ్లారు.అంతకుముందు.. కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపించింది. సర్వసభ్య సమావేశం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులు భావించారు. ఈ క్రమంలోనే ఆఫీస్ బయట భారీగా పోలీసులు, మీటింగ్ హాల్ వద్ద మార్షల్స్‌ను మోహరించారు. ‘బిచ్చగాళ్లు’గా బీజేపీ కార్పొరేటర్లుబీజేపీ కార్పొరేటర్ల(BJP Corporaters) వినూత్న నిరసనకు దిగారు. బిచ్చగాళ్ల వేషధారణ తో జీహెచ్ఎంసీ(GHMC) కౌన్సిల్ మీటింగ్‌కి వచ్చారు. ట్యాక్సులు కడుతున్నా తమ డివిజన్లకు నిధులు కేటాయించడం లేదని ఆరోపిస్తున్నారు వాళ్లు. ‘‘మా డివిజన్‌కి నిధులు ఇవ్వండి సారూ..’’ అంటూ అడుక్కుంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఇక.. కౌన్సిల్ లో గందరగోళం నెలకొంటే కారకులైన ఆ వ్యక్తులను బయటకు పంపుతామని అధికారులు చెబుతున్నారు.సర్వసభ్య సమావేశంలో రూ.8,440 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌పై చర్చించనున్నారు. మరోవైపు కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగగ్రెస్ చర్చలు జరుపుతోంది. ఈ ఉదయం మంత్రి పొన్నం నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు చర్చలు జరుపుతున్నారు. ఇక.. ఫిబ్రవరి 10 తర్వాత మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. -
‘బండి సంజయ్.. నువ్వు కార్పొరేటర్ కాదు కేంద్రమంత్రి’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకుడు బండి సంజయ్ కార్పొరేటర్ కాదు.. కేంద్రమంత్రి అని గుర్తు పెట్టుకోవాలని చురకలంటించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. పద్మా అవార్డుల విషయంలో బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇదే సమయంలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో అయినా బీజేపీ ఎంపీలు విభజన హామీల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు.ఎంపీ చామల కిరణ్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ కేంద్రమంత్రి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడటానికి ఆయనేం కార్పొరేటర్ కాదు. పద్మశ్రీ అవార్డుల విషయం పార్లమెంట్ జీరో అవర్‌లో లేవనెత్తుతాను. అవార్డుల విషయంలో బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది బీజేపీ నేతలను ఎంపీలుగా గెలిపించారు. మిమ్మల్ని గెలిపించింది ఎందుకు?. జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో అయినా బీజేపీ ఎంపీలు విభజన హామీల గురించి మాట్లాడాలన్నారు. కేంద్రం బీహార్, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదు. అందుకే బడ్జెట్లో మొండి చేయి చూపిస్తున్నారు. కిషన్ రెడ్డి దావోస్ పర్యటనను, కంపెనీలపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లారో కేటీఆర్‌ను అడిగితే వ్యంగ్యంగా చెప్పాడు. ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని రాష్ట్రానికి పెద్దన్నలాగా ఉండమన్నారు. హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ కోసం కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ లైఫ్ లైన్ ఆర్ఆర్ఆర్కు 45వేల కోట్లు అవసరం. ఆర్ఆర్ఆర్, మెట్రోతో హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవుతుందన్నారు. నల్లగొండలో రైతులు ఎవ్వరు కేటీఆర్ ధర్నాను పట్టించుకోలేదు. మూసీ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ఎంపీలందరూ పార్లమెంట్లో కొట్లాడాలి. మహారాష్ట్ర కంటే మన రాష్ట్రం ఎక్కువగా కేంద్రానికి జీఎస్టీ పన్నులు కడుతోంది. పదేళ్లు రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పించడంలో బీఆర్ఎస్ విఫలమైంది. హరీష్ రావు ముందు కేసీఆర్‌ను ప్రజలకు దర్శనం ఇవ్వాలని చెప్పాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
పొలిటికల్ హీట్.. రేవంత్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో విషయమై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యద్ధం నడుస్తోంది. తెలంగాణలో రేషన్ కార్డులపై, రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేస్తూ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) లేఖ రాశారు. దీంతో, మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది.కేంద్రమంత్రి బండి సంజయ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్బంగా లేఖలో..‘తెలంగాణలో రేషన్‌కార్డులపై, రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం పేరును కొనసాగించాలని కోరారు. ఇదే సమయంలో రాష్ట్రంలో అర్హులకు రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు.జనవరి 26 నుంచి అమలు చేసిన నాలుగు పథకాలు.. రాష్ట్రంలో మూడు శాతం మందికి కూడా చేరలేదని తెలిపారు. అలాగే, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పిన రైతు భరోసా ఎక్కడ? అని ప్రశ్నించారు. 10లక్షల మంది రైతు కూలీల కుటుంబాలకు ఇస్తామని చెప్పిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారు?. కొత్తగా ఇస్తామని చెప్పిన 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయారని లేఖలో పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు ఇందిరమ్మ ఇళ్లపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు చేసే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడతామంటే ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. మోదీ సర్కారు మంజూరు చేసే ఇళ్లకు ఇందిరమ్మ పేరు ఎలా పెడతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో కచ్చితంగా పెట్టాలని, లేదంటే రాష్ట్రానికి ఉచిత బియ్యం సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. అవసరమైతే కేంద్రమే పేదలకు ఉచిత బియ్యం పంపిణీపై ఆలోచిస్తుందన్నారు.ఇదే సమయంలో కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాల బాటలో నడుస్తోందని ఆరోపించారు. ఫాంహౌస్, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్ కేసులన్నీ మరుగునపడ్డాయని విమర్శించారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టుకు అన్ని ఆధారాలున్నాయని సీఎం చెప్పిన తర్వాత కూడా ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. దీంతో, తెలంగాణలో మరోసారి రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. -
‘వంద మంది అమిత్ షాలు వచ్చినా ఉద్యమాలు ఆగవు’
సాక్షి, హన్మకొండ: ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను అంతం చేయలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నాయకుడు చాడా వెంకట్‌రెడ్డి. ప్రజాకవి గద్దర్‌పై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరమూ కాదని చెప్పుకొచ్చారు.చాడా వెంకట్‌రెడ్డి తాజాగా హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులను అణచివేయాలని చూస్తున్నారు. ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను అంతం చేయలేరు. కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరం కాదు. నక్సలిజాన్ని సామాజిక, ఆర్థిక సమస్యగా చూడాలి. మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడాలి.గద్దర్‌కు అవార్డు ఇవ్వడం తప్పు అనేది సరైంది కాదు. గద్దర్‌పై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. దేశాన్ని రాచరికం ఏలుతున్న రోజుల్లో కమ్యూనిజం పుట్టింది. భారత సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపునిచ్చింది సీపీఐ పార్టీనే. ఎన్నో నిర్భంధాలను కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొంది. నవాళి కళ్యాణానికి బీజం వేసింది భారత కమ్యూనిస్టు పార్టీ. దీన్ని అంతం చేస్తామని కొందరు చెబుతున్నారు. కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరమూ కాదు అంటూ కామెంట్స్ చేశారు.మరోవైపు.. తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మావోయిస్టులపై వరుస ఎన్కౌంటర్ల విషయమై స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ..‘వంద మంది అమిత్ షాలు వచ్చినా ఉద్యమాలు ఆగవు. ఎన్కౌంటర్ల వల్ల ఉద్యమాలకు చెక్ పెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి ఎన్కౌంటర్లు గతంలో చాలా జరిగాయి.. ఉద్యమాలు మళ్ళీ మొదలు అయ్యాయి. ఎన్కౌంటర్ల వల్ల కొంతమంది మరణం మాత్రమే జరుగుతుంది. కొంత మందిని మాత్రమే చంపగలరు. ఉద్యమాన్ని ఆపలేరు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
నల్లగొండ టీ హబ్‌కు తాళం వేయించిందే కేటీఆర్: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్లగొండ బీఆర్ఎస్ రైతు ధర్నాలో చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పదేళ్లుగా నల్లగొండను పట్టించుకోకుండా.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారాయన. బుధవారం(జనవరి29) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘కేటీఆర్ పనికిరానోడు.. పనికి రాని మాటలు మాట్లాడుతున్నాడు. నల్లగొండలో కేటీఆర్ మీటింగ్‌కు మా మీటింగ్ కు వచ్చే పల్లీలు,ఐస్ క్రీం లు అమ్ముకునే వారు వచ్చేంత మంది కూడా రాలేదు. నల్లగొండలో టీ హాబ్‌కు తాళం వేసిందే కేటీఆర్. ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కంపెనీలు ఎందుకు తేలేకపోయారు. హరీష్‌రావు, కేటీఆర్ మీరు నా కాలి గోటికి కూడా సరిపోరు. కేటీఆర్ నీలాగా నాపై అవినీతి ఆరోపణలు లేవు. లక్షల కోట్లు సంపాదించుకోలేదు. కేసీఆర్ లాగా నేను ఎలక్షన్, కలెక్షన్ చేయలేదు. నేను మాట్లాడితే బీఆర్ఎస్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.ప్రతిపక్ష నేత పదవి కోసం హరీష్ రావు, కేటీఆర్ కత్తులతో పొడుచుకుంటున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా భట్టి పాదయాత్ర చేసి..ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. బడ్జెట్ సెషన్‌కు కేసీఆర్ వస్తడో రాడో చెప్పాలి.తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నరా? బండి సంజయ్ ఉన్నరా? గద్దర్‌కు అవార్డ్ ఇస్తే తప్పేంటి? కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది... కేసీఆర్ కంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఎంతో నయం అని కోమటిరెడ్డి అన్నారు. లాలూ జైల్లో ఉన్నప్పుడు.. బయట ఉన్న ఆయన కొడుకులు ఎంపీ సీట్లు గెలిపించారు. కానీ, కేటీఆర్ ఒక్క సీటు అయినా గెలిచారా? కేటీఆర్ ప్లేస్‌లో నేను ఉంటే.. ఈపాటికి బీఆర్ఎస్ దుకాణం క్లోజ్ చేసేవాడ్ని అని కోమటిరెడ్డి అన్నారు. -
ఎన్నికల ముందు పథకాల డ్రామా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్థానికసంస్థల ఎన్నికలు వస్తుండటంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పథకాల డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. ఆ ఎన్నికలు పూర్తయితే రైతుభరోసా బంద్ అవుతుందన్నారు. మంగళవారం నల్లగొండ గడియారం సెంటర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎన్జీ కాలేజీ నుంచి గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడే నిర్వహించిన మహాధర్నాలో కేటీఆర్ ప్రసంగించారు. మేం నాట్లకు ముందు.. కాంగ్రెస్ ఓట్లకు ముందు‘రేవంత్‌కు.. ఎన్నికలప్పుడే పథకాలు గుర్తుకొస్తా యి. అవి పూర్తయితే పట్టించుకోరు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తుండటంతో ఓట్ల కోసం కొత్త డ్రామా అడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో నాట్లకు ముందు రైతుబంధు ఇచ్చాం. కానీ రేవంత్ ప్రభుత్వం రైతుభరోసా డ్రామా ఆడుతోంది’అని కేటీఆర్ దుయ్యబట్టారు. ఒక్క హామీనీ పూర్తిగా అమలు చేయలేదు ఆరు గ్యారంటీల పేరుతో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని కేటీఆర్ విమర్శించారు. రూ. 2 లక్షల మేర రైతు రుణాలను డిసెంబర్ 9న మాఫీ చేస్తానని ప్రకటించి మోసం చేశారని ఆరోపించారు.ఏ ఊళ్లోనూ 100 శాతం రుణమాఫీ చేయలేదని.. యాసంగి రైతు భరోసా సైతం ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ రైతుబంధు ఇస్తానంటే రేవంత్‌రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఆపించారని కేటీఆర్ విమర్శించారు. వానాకాలం రైతు భరోసాను ఎగ్గొట్టారని, ఇప్పటివరకు ఒక్కో ఎకరానికి రూ.17,500 రేవంత్‌రెడ్డి బాకీ పడ్డారన్నారు. మోసం చేయడంలోనూ చరిత్రాత్మకమే బీఆర్ఎస్ రూ.12 వేలు రైతుబంధు ఇస్తానంటే, తాను రూ.15 వేలు ఇస్తానని చెప్పి రేవంత్‌రెడ్డి ప్రజలను మభ్య పెట్టారని కేటీఆర్ విమర్శించారు. ఓట్లు వేయించుకొని గెలిచాక సిగ్గులేకుండా రూ.12 వేలకు కుదించారన్నారు. ప్రజలను మోసం చేయడంలోనూ కాంగ్రెస్‌ది చరిత్రాత్మకమేనని ఎద్దేవా చేశారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తానని చెప్పి, చివరకు సన్నాలకే ఇస్తానని మెలిక పెట్టి మోసం చేశారన్నారు. . కేసీఆర్ హయాంలో 11 విడతలుగా రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు రైతుల అకౌంట్లలో వేశారని గుర్తు చేశారు. రైతులు తిరగబడాలి: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై తిరగబడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యార్థులు, రైతు లు, చేనేత కారి్మకులు చనిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుబంధు, రైతుభరోసా, రుణమాఫీ విషయంలో ప్రజలు తిరుగబడాలని, నల్లగొండ నుంచే పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు అండగా ఉండేందుకే..: జగదీశ్‌రెడ్డి రైతులను మోసం చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ అన్యాయంపై పోరాడేందుకు బీఆర్ఎస్ ముందుంటుందన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రజలకు చెప్పేందుకే కేటీఆర్ నల్లగొండ వచ్చారన్నారు. ప్రశ్నిస్తున్న రైతులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు.పలువురు నేతల ఫోన్లు, గొలుసులు చోరీ నల్లగొండలో కేటీఆర్ పాల్గొన్న రైతు మహాధర్నాలో దొంగలు రెచ్చిపోయారు. ఎన్జీ కాలేజీ నుంచి బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ర్యాలీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, స్థానిక నేత హమీద్ సెల్ఫోన్లతోపాటు ఆరుగురు నేతల నుంచి సుమారు 11 తులాల బంగారు గొలుసులు కొట్టేశారు. దొంగల ముఠాలోని ఒకరిని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆరోగ్యశ్రీ అంటే వై.ఎస్..రైతుబంధు అంటే కేసీఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేరు చెప్పగానే ప్రజలందరికీ ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకొస్తారని కేటీఆర్ చెప్పారు. అలాగే రైతుబంధు పథకం అనగానే మాజీ సీఎం కేసీఆర్ గుర్తుకొస్తారన్నారు. ఈ పథకాలను ఎవరూ చెరపలేరన్నారు. కానీ రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని పదేపదే చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి రైతుబంధు పథకాన్ని బంద్ చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సామాన్యులకు రేషన్‌కార్డు కావాలన్నా, రైతుబంధు కావాలన్నా ప్రభుత్వం కేవలం దరఖాస్తులే తీసుకుంటోందని విమర్శించారు. -
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కనిపించడం లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా ఏ పార్టీ కనిపించడం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేదని, అన్ని పార్టీలూ ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. భావస్వేచ్ఛపై తమ ప్రభుత్వానికి విశ్వాసం ఉన్నందునే ఆయా పార్టీలు వారి సిద్ధాంతాలను ప్రచారం చేసుకునే అవకాశమిచ్చామన్నారు. చెన్నై వేదికగా మంగళవారం ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘విద్య’అంశంపై నిర్వహించిన కాంక్లేవ్‌లో పాల్గొన్న భట్టి పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో భట్టి ఏమన్నారంటే... » ఫార్ములా ఈ–కార్ రేసు వ్యవహారంలో రాజకీయంగా మేం చేసిందేమీ లేదు. ప్రజాధనం దురి్వనియోగమైందన్న ఆరోపణల మేరకు నాటి మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదై విచారణ జరుగుతోంది. ఈ అంశంలో ఎవరైనా విచారణ సంస్థల ముందుకొచ్చి వారి అభిప్రాయాలను చెప్పొచ్చు. » ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థలపై మాకు నమ్మకం ఉంది. భారత రాజ్యాంగంపై అచంచల విశ్వాసం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు బలంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వంగా మేం కోరుకుంటున్నాం. అయితే, విధానపరమైన అంశాలపై కొట్లాడుతూనే ఉంటాం. » స్వాతంత్య్రోద్యమాన్ని ప్రచారం చేసేందుకు గాం«దీజీ యంగ్ ఇండి యా పత్రికను స్థాపించారు. ఆ పత్రిక స్ఫూర్తితోనే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకుని లక్షల్లో వస్తున్న విద్యార్థుల్లో ఎంఎన్‌సీలు ఆశిస్తున్న నైపుణ్యాలు ఉండటం లేదు. దీంతో ఉపాధి కష్టతరమవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని స్కిల్స్ వర్సిటీని స్థాపించాలని నిర్ణయం తీసుకున్నాం. » పాత లేత్ మెషీన్లతో ఉన్న ఐటీఐలను కంప్యూట ర్ యుగానికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలోని 65 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేస్తున్నాం. » విద్యపై పెట్టుబడితో గొప్ప మానవ వనరులను ఉత్పత్తి చేయొచ్చు. ఈ వనరుల ద్వారా రాష్ట్రానికి సంపద చేకూరుతుంది. అందుకే ఈ ఏడాది బడ్జె ట్లో విద్యకు రూ.21వేల కోట్లు కేటాయించాం.» అంతర్జాతీయ ప్రమాణాల పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్న ఫీజు దోపిడీపై విచారణ జరిపి చర్యలు చేపట్టేందుకే రాష్ట్రంలో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. » తెలంగాణలో ఇల్లు లేకుండా ఏ ఒక్కరూ మిగిలిపోకూడదు. విద్యా సౌకర్యం అందకుండా ఎవరూ బాధపడకూడదు. ఉపాధి లేదనే భావన ఎవరికీ కలగకూడదు. ఈ లక్ష్యాలతోనే ముందుకెళ్తున్నాం. రాష్ట్ర సంపదను అర్హులైన పేదలకు పంచడమే మా లక్ష్యం. -
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌వెస్లీ
సాక్షి, సంగారెడ్డి: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌వెస్లీ నియమితులయ్యారు. 60 మందితో సీపీఎం నూతన కార్యవర్గం ఏర్పాటు కాగా, 70 ఏళ్లు దాటిన నేతలకు రాష్ట్ర కమిటి నుంచి ఉద్వాసన పలికారు. తమ్మినేని వీరభద్రం, సీతారాములు, నర్సింగరావులకు సీపీఎం రాష్ట్ర కమిటీలో అవకాశం దక్కలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అమరచింతకు చెందిన జాన్ వెస్లీ.. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేశారు.అయితే, సీపీఎం నూతన రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎన్నికయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. సంగారెడ్డిలో జరుగుతున్న సీపీఎం 4వ రాష్ట్ర మహాసభలు నేటితో ముగిశాయి. చివరి రోజు మంగళవారం నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక జరిగింది. అనంతరం నూతన రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని ఆ కమిటీ ఎన్నుకోనుంది. -
పెట్టుబడులపై రేవంత్ మంత్రి వర్గంలోనే భిన్నాభిప్రాయాలా?: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దావోస్ పెట్టుబడులను పెద్ద విజయంగా సీఎం చెబుతుంటే మంత్రి శ్రీధర్ బాబు మాత్రం ఇది పెద్ద విజయం ఏమీ కాదన్నారు. ఉపాది అవకాశాలు పెరిగినపుడే పెట్టుబడులను విజయంగా భావిస్తామని శ్రీధర్ బాబు అన్నారు. రేవంత్ మంత్రి వర్గంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి’’ అంటూ పొన్నాల వ్యాఖ్యానించారు.‘‘సీఎం మొహం చూసి ఎవ్వరూ పెట్టుబడులు పెట్టలేదు. పెట్టుబడులు అనేవి నిరంతర ప్రక్రియ. పదేళ్ల కేసీఆర్ విధానాల ఫలితంగానే ఈ పెట్టుబడులు. మహారాష్ట్రకు 18 లక్షలు కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చాయంటే ఫడ్నవీస్ గొప్పతనం చూసి రాలేదు. అక్కడ ప్రభుత్వం మారి ఆరునెలలు కూడా కాలేదు. ప్రపంచ దేశాలతో పోటీ పడతా అని రేవంత్ అంటున్నారు. దేశాలతో కాదు.. మహారాష్ట్రతో రేవంత్ పోటీ పడాలి. ఈ పెట్టుబడులు ఎందుకు వచ్చాయో వివరించడానికి సీఎం మంత్రులతో చర్చకు సిద్ధం’’ అని పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు.‘‘2014, 2023 మధ్య 2 వేల స్టార్ట్అప్ కంపెనీలు వచ్చాయి. హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ కేసీఆర్ హయాంలో 7 లక్షలు స్క్వేర్ ఫీట్ లకు పెరిగింది. ఐటీ ఇన్నోవేషన్‌లో కేసీఆర్ హయాం లో తెలంగాణ నాలుగు శాతానికి పెరిగింది. 2014లో 3 లక్షలు ఐటీ ఉద్యోగాలు ఉంటే అది కేసీఆర్ విధానాల ఫలితంగా తొమ్మిది లక్షలకు పెరిగింది. ఏ రకంగా చూసినా కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ ఐటీ, పారిశ్రామిక రంగంలో భారీ పురోగతి సాధించింది...వాస్తవాలను సీఎం రేవంత్ వక్రీకరిస్తున్నారు. అప్పుడు వేసిన విత్తనాలకు ఇపుడు కాయలు కాస్తుంటే రేవంత్ తన గొప్ప అని చెప్పుకుంటే ఎట్లా?.స్కిల్ డెవెలప్మెంట్ అనేది వ్యక్తులను బట్టి ఆధారపడి ఉంటుంది. అన్ని అవకాశాలున్నా రేవంత్ ఎందుకు చదువుకోలేదు? ఎందుకు విజ్ఞానవంతుడిగా కాలేక పోయారు?. రేవంత్ భాష, స్వభావం అలా ఉండటానికి దేశంలో విద్యావకాశాలు లేక కాదు. కేసీఆర్ గురుకులాలు స్థాపించి అందరికీ ఉన్నత అవకాశాలు కల్పించారు’’ అని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. -
రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది.. అందుకు ఇదే నిదర్శనం
సాక్షి,హైదరాబాద్ : రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్పై సెటైర్లు వేశారు.తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ..ఎన్నికల్లో పోటీచేసేందుకు బీఆర్ఎస్ ముఖం చాటేసింది. కేసీఆర్ సొంత జిల్లాలో ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా?. ఎమ్మెల్సీ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలి. యువరాజు సమాధానం చెప్పాలి.టీచర్స్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టకపోవడం దారుణం. దేవిప్రసాద్ లాంటి వ్యక్తికి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వరు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు సీఆర్ఎస్ ఇచ్చారు. బీఆర్ఎస్ పని అయిపొయింది అనడానికి ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. బీఆర్ఎస్ తొకముడువడంతో బీజేపీ విజయం నల్లేరుమీద నడకయ్యిందని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇప్పటికే తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి సరోత్తమ్‌రెడ్డి (వరంగల్), కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మల్కా కొమరయ్య(పెద్దపల్లి), కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.అంజిరెడ్డి(సంగారెడ్డి)ని ఎంపిక చేసినట్టు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. -
ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్.. రైతుబంధు అంటే కేసీఆరే గుర్తొస్తారు: కేటీఆర్
సాక్షి, నల్గొండ: కాంగ్రెస్ పాలన కొత్త సీసాలో పాత సార అన్నట్లుగా ఉందని, పాలిచ్చే ఆవును కాదని దున్నపోతును తెచ్చుకున్నామని రైతులు అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్లగొండలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ రైతు ధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఇవాళ రైతు మహాధర్నాకు వచ్చినట్లు అనిపించలేదు. మళ్లీ మన ప్రభుత్వం వచ్చిందనే విధంగా నల్గొండలో అపూర్వ స్వాగతం లభించింది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారనే రీతిలో స్వాగతం ఉంది. బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా అనిపించింది.‘కేసీఆర్ 12సార్లు రైతుబంధు ఇచ్చారు కానీ ఇలా ప్రచారం చేసుకోలేదు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్, రైతుబంధు అంటే కేసీఆర్ గుర్తొస్తారు. రుణమాఫీ,రైతుబంధు, వరికి బోనస్ అన్నింటిలో మోసాలే. మోసం చేయడంలో కాంగ్రెస్ నేతలు చరిత్ర సృష్టించారు.పంజాబ్,హరియాణాను తలదన్నేలా వరి పండించడంలో తెలంగాణను నెంబర్ వన్ చేశారు కేసీఆర్. జనవరి 26నే రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. కేసీఆర్ రైతు బంధు కింద 73 వేల కోట్లు ఇచ్చారు.నల్గొండ రైతులు అవస్థలకు,పిల్లలు జీవచ్ఛవాలుగా మారడానికి కారణం కాంగ్రెస్ నేతలే. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ జరిగిందని చూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా.రుణమాఫీ 25 శాతం కూడా కాలేదు.గ్రామ సభల్లో హామీల అమలుపై జనాలు నిలదీస్తున్నారు. నల్గొండ నుంచే ప్రభుత్వంపై రైతు పోరు ప్రారంభిస్తున్నాం. దరఖాస్తుల వ్యాపారంతో రాష్ట్రంలో జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు మాత్రమే సంతోషంగా ఉన్నారు’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. -
నేడు బీఆర్ఎస్ రైతు ధర్నా.. హాజరుకానున్న కేటీఆర్
సాక్షి,నల్గొండ: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండలో రైతు మహా ధర్నా జరగనుంది. ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. మాజీ మంత్రి గుంటకంట్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నాలో పాల్గొంటారు. నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో నిర్వహించనున్న మహాధర్నా నిర్వహించేందుకు పోలీసులు మూడు గంటలు మాత్రమే అనుమతించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహించాలి. రైతు మహాధర్నా బీఆర్ఎస్ పార్టీ ఈనెల 12న నిర్వహించాల్సి ఉండగా.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వాయిదా వేసుకుంది. తిరిగి ఈ నెల 21న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక ధర్నాకు ఒక రోజు ముందు పోలీసులు అనుమతి నిరాకరించారు. సంక్రాంతి పండుగకు ఆంధ్రా ప్రాంతానికి వెళ్లిన వారు తిరిగి వస్తున్న క్రమంలో జాతీయ రహదారి అంతా రద్దీగా ఉంటుందని, పైగా క్లాక్ టవర్ సెంటర్ ఇరుకుగా ఉండటంతోపాటు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయని, ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు ఉన్నందున బందోబస్తు కల్పించలేమని పోలీసులు అనుమతి నిరాకరించారు.దీంతో బీఆర్ఎస్ నేతలు అదేరోజు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. కాగా, 27వ తేదీన కాకుండా 28వ తేదీన ధర్నా నిర్వహణకు పోలీసుల అనుమతికి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ దరఖాస్తు చేశారు. దీంతో పోలీసులు.. 1500 మందితో పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించి, ఆ తర్వాత ధర్నా నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు.రైతుకు భరోసా ఇచ్చేందుకే మహా ధర్నా:జగదీష్‌రెడ్డి‘రైతులు మొదటి నుంచీ బీఆర్ఎస్ వెంటే ఉన్నారు. వారిని ఆత్మహత్యల నుంచి బయట పడేసింది బీఆర్ఎస్ పార్టీనే. ప్రస్తుతం రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అందరికి రుణ మాఫీ చేయలేదు. రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని తగ్గిస్తున్నారు. సన్న ధాన్యానికి బోనస్ ఇస్తామని మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తిరుగుబాటు చేస్తున్నారు. గ్రామసభల్లో నిలదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ రైతులకు, ప్రజలకు అండగా ఉంటుంది. అందులో భాగంగానే రైతులకు భరోసా ఇచ్చేందుకు మహా ధర్నా చేపట్టబోతున్నాం. నల్లగొండ నుంచి రైతుల తరఫున పోరాటం చేసేందకు కేటీఆర్ వస్తున్నారు. బీఆర్ఎస్ ధర్నా అంటేనే జిల్లా మంత్రి, కాంగ్రెస్ నాయకులు భయపడిపోతున్నారు’అని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. -
దావోస్ పెట్టుబడులూ 6 గ్యారంటీల్లాగే..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీల తరహాలోనే దావోస్ పెట్టుబడుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ప్రజలు నమ్ముతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు విమర్శించారు. స్థానికసంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసమే ఆరు గ్యారంటీల పేరిట హంగామా చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో 12 వేలకుపైగా గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 600 గ్రామాల్లో పథకాల అమలు పేరిట స్థానికసంస్థల్లో ఓట్ల కోసం కొత్త మోసానికి సీఎం రేవంత్ తెరలేపారని దుయ్యబట్టారు. గతేడాది దావోస్ నుంచి వచ్చిన రూ. 40 వేల కోట్ల పెట్టుబడుల్లో ఇప్పటివరకు ఏదీ వాస్తవరూపం దాల్చలేదని.. ఒకవేళ ఆ పెట్టుబడులు కార్యరూపం దాలిస్తే తామే సీఎం రేవంత్‌కు సన్మానం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం డైరీ, కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. సీఎం సహా కేబినెట్వి పచ్చి అబద్ధాలు ‘వంద రోజుల్లో హామీల అమలు పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 13 నెలల్లోనే పూర్తిగా విఫలమైంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం విక్రమార్క సహా కేబినెట్ మంత్రులు, నేతలు అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. బాండ్ పేపర్లు, అఫిడివిట్లతో గోబెల్స్ సిగ్గుపడేలా ప్రచారం చేసిన సీఎం.. రేషన్‌కార్డులు ఇవ్వడాన్ని కూడా చారిత్రక కార్యక్రమం అనే భావదారి్రద్యంలో ఉన్నారు. బీఆర్ఎస్ పాలనలో 6.47 లక్షల రేషన్ కార్డులను ఇచ్చాం’అని కేటీఆర్ తెలిపారు. డూప్లికేట్ గాంధీ వైఫల్యాలు ఎండగట్టాలి డూప్లికేట్ గాందీలు ఇచ్చిన దొంగ హామీలు, వైఫల్యాలను ఎండగట్టాలని విద్యార్థులు, యువతకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు వివిధ హామీలిచ్చి 400 రోజులు గడిచిన సందర్భంగా ఈ నెల 31న రాష్ట్రవ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు నివాళులు అరి్పంచాలని సూచించారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గ్యాదరి కిషోర్, పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, చిరుమల్ల రాకేశ్, బాలరా>జు యాదవ్, ఆంజనేయ గౌడ్, రాజారాం యాదవ్, శుభప్రద్ పటేల్, తుంగ బాలు పాల్గొన్నారు. -
ఓవైపు గాంధీ పరివార్.. మరోవైపు గాడ్సే పరివార్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో రెండు పరివారాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకటి గాంధీ పరివారం.. మరోటి గాడ్సే పరివారం. గాంధీ పరివార్ వైపు నుంచి రాహుల్‌గాంధీ పోరాడుతున్నారు. గాడ్సే పరివారం నుంచి మోదీ ఉన్నారు. మనమంతా గాంధీ పరివారంగా రాహుల్‌గాందీకి మద్దతుగా నిలవాలి. రాహుల్ నేతృత్వంలో దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలి..’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇది ఎన్నికల ర్యాలీ కాదని, ఓ యుద్ధమని అభివర్ణించారు. ‘రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడే వారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునే వారికి మధ్య ఈ యుద్ధం జరుగుతోంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ మోదీ రాజ్యాంగాన్ని మార్చే పనిలో ఉన్నారు. గజనీ మహ్మద్ నాడు భారత్‌ను దోచుకునేందుకు యత్నించినట్టు నేడు రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ యత్నిస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలు ఫలించడం లేదు. మోదీ యత్నాలు ముందే గుర్తించిన రాహుల్‌గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. నాడు బ్రిటిషర్ల నుంచి దేశాన్ని మహాత్మాగాంధీ రక్షించినట్టు నేడు బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు ఆయన నిలబడ్డారు. ఈ యుద్ధంలో అందరూ రాహుల్‌గాంధీతో కలిసి నడవాలి. రాజ్యాంగ పరిరక్షణ కోసం కలిసికట్టుగా పోరాడాలి..’ అని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ వైఖరి మారుతోంది
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి మారుతోందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి నాలుగున్నర నెలలు గడిచినా.. ఇప్పటికీ వర్గీకరణ జరగలేదని ఆవేదన వ్యకం చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో మందకృష్ణతో సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఘాటుగా స్పందించారు. ‘వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచి్చన తర్వాత మొదటగా స్పందించిన వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి. వర్గీకరణ అమలులో తెలంగాణ మొదటి రాష్ట్రం అవుతుందని, గత నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పింది ఆయనే.కానీ మాట మార్చి నియామకాలు చేపడుతున్నారు. డీఎస్సీ, గ్రూప్–4 పూర్తి చేయడంతోపాటు వివిధ నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యింది. గ్రూప్–1,2,3 కూడా త్వరలో భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలతో మాదిగలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏదో ఒక రకమైన సాకుతో వర్గీకరణను ఆపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది. సీఎం రేవంత్ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సోదరుడు, కుమారుడు ఈ ప్రక్రియను అడ్డుకోవాలని నిర్ణయించారు.అందుకే అధిష్టానంపైన ఒత్తిడి చేసి వర్గీకరణకు బ్రేకులు వేస్తున్నారు. వర్గీకరణలో తీవ్ర జాప్యం జరుగుతున్నందున ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో ‘లక్ష డప్పులు, వేల గొంతుకలు’కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కేవలం దళితులే కాకుండా అన్ని కులాలకు చెందినవారు ఈ కార్యక్రమానికి మద్దతుగా ఉన్నారు’అని చెప్పారు. వర్గీకరణ సాధించిన తర్వాత ప్రజాసమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తానని, ఏ పార్టీ జెండా వేసుకోనన్నారు. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలులో లోపాలున్నాయని, జనాభా కంటే రిజర్వేషన్లు ఎక్కువగా ఉండడం ఇతర వర్గాలకు నష్టం కలిగించడమే అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అన్ని సమస్యలపైనా ఉద్యమాలు కొనసాగిస్తానన్నారు. -
పాత రోజులు మర్చిపో.. కడియంకు రాజయ్య వార్నింగ్
సాక్షి, జనగామ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంత చూసే వరకు నిద్రపోను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం పప్పులు కాంగ్రెస్‌లో ఉడకడం లేదు.. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.తాజాగా స్టేషన్ ఘనపూర్‌లో రైతు దీక్షలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజయ్య మాట్లాడుతూ..‘నా నోటికాడి బుక్కను గుంజుకొని తిన్న వ్యక్తి కడియం శ్రీహరి. ఆయన అంత చూసే వరకు నిద్రపోను. నియోజకవర్గంలో అభివృద్ధి ఏమాత్రం లేదు. ఉన్నది అవకాశవాదం మాత్రమే ఉంది. పార్టీ మారిన పది మంది కుక్కిన పేనులా ఉంటే.. కడియం మాత్రం కుమ్మరి పురుగుల తిరుగుతున్నాడు. కడియం పప్పులు కాంగ్రెస్ పార్టీలో ఉడకవు.పాత రోజులు మర్చిపో.. అక్రమ కేసులు పెడితే సహించేది లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది. మంత్రులు ఎవరికి వారే దుకాణాలు తెరుచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి సైతం వసూళ్లు కొనసాగిస్తున్నారు. క్యాబినెట్ మొత్తం తోడుదొంగలే ఉన్నారు. తెలంగాణను దోచుకుంటున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.ఇదిలా ఉండగా.. స్టేషన్ ఘనపూర్‌లో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు సీటు విషయంలో వీరి మధ్య గట్టి పోటీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్‌పై పోటీ చేసిన కడియం విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కడియం బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం గూటికి చేర్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడు రాజయ్య.. కడియంను టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు.