హమ‍్మయ్యా! తెరిచే ఉంటాయ్‌ | temples open in tamilnadu | Sakshi
Sakshi News home page

హమ‍్మయ్యా! తెరిచే ఉంటాయ్‌

Dec 28 2017 7:32 PM | Updated on Oct 17 2018 4:54 PM

temples open in tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై: కొత్త సంవత్సరం వేళ రాత్రి వేళ ఆలయాలు తెరచి ఉంచేందుకు ఎలాంటి ఆటంకాలు లేనట్టే. ఆలయాల మూసివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు స్పందించలేదు. స్టే ఇవ్వబోమని తేల్చిచెప్పింది. 

ఏటా ఆంగ్ల కొత్త సంవత్సరాదిని ఆహ్వానించే రీతిలో వేడుకలు మిన్నంటుతూ వస్తున్నాయి. ప్రధానంగా 31వ తేదీ రాత్రి సాగే హంగమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సమయంలో ఆ రోజు రాత్రంతా ఆలయాలు తెరిచే ఉంటాయి. కొత్త ఏడాది తొలిరోజు దైవ దర్శనం చేసుకునేందుకు అర్థరాత్రి వేళ జనం ఆలయాల వద్ద బారులు తీరుతుంటారు. అయితే, ఇది ఆగమ విరుద‍్ధమని చాలామంది ఆగ్రహం వ‍్యక‍్తంచేశారు. ఈ నేపథ్యంలో అశ్వర్థామ అనే న్యాయవాది బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. ఆగమ నిబంధనల్నివివరిస్తూ ఆరోజు రాత్రి ఆలయాలను మూసివేయాల్సిందేనని పట్టుబట్టారు.

ఆగమ శాస్త్రం మేరకు రాత్రి తొమ్మిది గంటలకు ఆలయాల్లో ఏకాంత సేవ ముగించాలని, మరుసటి రోజు ఉదయం 4.30-6.30 గంటల మధ్య సుప్రభాత సేవ నిర్వహించాల్సి ఉందన్నారు. అయితే, కొత్త సంవత‍్సర వేడుకలంటూ 31వ తేదీ ఆలయాలను మూయడం లేదని, ఇది ఆగమ విరుద్దమని కోర్టుకు వివరించారు. వైష్ణవ ఆలయాలు వైకుంఠ ఏకాదశి వేళ, శివాలయాలు శివరాత్రి వేళ మాత్రం రాత్రుల్లో తెరచి ఉంచేందుకు వీలుందని, అయితే, ఆంగ్ల సంవత్సరాదిని ఆహ్వానించే విధంగా ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద‍్ధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆగమ నిబంధనల మేరకు ఆలయాలను మూసిఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 

ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు ఎంఎస్‌ రమేష్, స్వామినాథన్‌ బెంచ్‌ గురువారం విచారించింది. పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ముందుగా ఈ వ్యవహారంలో దేవాదాయ శాఖ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాల్సి ఉందన్నారు. ఈ దృష్ట్యా, వారి వివరణకు నోటీసులు జారీచేశారు. తదుపరి విచారణ జనవరి 8వ తేదీకి వాయిదా వేశారు. అలాగే, పిటిషనర్‌ విజ్ఞప్తి మేరకు ఆలయాల విషయంలో ఎలాంటి ఉత్తర్వులను తాము ఇవ్వబోమని బెంచ్‌ స్పష్టం చేసింది. దీంతో పరోక్షంగా కొత్త వేడుక వేళ రాత్రుల్లో ఆలయాలు తెరిచే ఉంచుకునేందుకు అనుమతి లభించినట్టు అయింది. ఇదిలా ఉండగా ఆలయాలను తెరచి ఉంచడమా, లేదా మూసివేయడమా అనే విషయం తేల్చుకోలేక దేవాదాయ శాఖ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement