ఆల్‌ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రానికి వచ్చి వెళ్లిన తర్వాతే అభ్యర్థుల ఎంపిక ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి.
సాక్షి, బెంగళూరు : ఆల్‌ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రానికి వచ్చి వెళ్లిన తర్వాతే అభ్యర్థుల ఎంపిక ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరమేశ్వర్ వ్యాఖ్యలను గమనిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఫిబ్రవరి 1న సోనియాగాంధీ గుల్బర్గకు వస్తున్నారన్నారు.
ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై నేడు (సోమవారం) జరగాల్సిన సమావేశం వాయిదా పడిందన్నారు. అందువల్లే తాను ఢిల్లీ వెళ్లడం లేదన్నారు. ‘మేడం’ వచ్చి వెళ్లిన తర్వాత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో అభద్రత భావం ఏర్పడిందని విపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితవున్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం రైతులు, కార్మికులతో సహా అన్ని వర్గాల ప్రజలకు అనుగుణంగా సంక్షేమపథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎం.వీ రాజశేఖరన్, హెచ్.ఎం రేవణ్ణ తదితరులు పాల్గొన్నారు.