షీలా సర్కారు విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు | Sheila dixit government concerns against policies | Sakshi
Sakshi News home page

షీలా సర్కారు విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు

Sep 7 2013 5:52 AM | Updated on Sep 1 2017 10:32 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 70 స్థానాల నుంచి పోటీచేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి చెప్పారు.

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 70 స్థానాల నుంచి పోటీచేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి  చెప్పారు. పార్లమెంటు భవనం వెలుపల ఆమె విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను రానున్న 10-12 రోజుల్లో ప్రకటించనున్నట్లు ఆమె చెప్పారు. అంతకుముందుమాయావతి అధ్యక్షతన నగరంలో శుక్రవారం బీఎస్పీ కార్యకర్తల సమావేశం జరిగింది. 
 
 మహా ర్యాలీ పేరిట తాల్కటోరా స్టేడియంలో జరిగిన ఈ సమావేశంలో మాయావతి మాట్లాడుతూ జాతీయ రాజధానికి జీవనోపాధి నిమిత్తం వలసవచ్చిన బీహార్, ఉత్తర్‌ప్రదేశ్‌వాసులపై స్థానిక కాంగ్రెస్, బీజేపీలు సవతితల్లి ప్రేమను కనబరుస్తున్నాయని మాయావతి విమర్శించారు. షీలా దీక్షిత్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తమ పార్టీ ఆధ్వర్యంలో వారం రోజులపాటు ధర్నాలు, ర్యాలీ లు, ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీకి బీహార్, యూపీ నుంచి వలసవచ్చిన వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిందని, ఇక్కడ వారు చాలా కష్టాలు పడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశానికి  బీఎస్పీ టికెట్ ఆశిస్తున్న నేతలు తమ మద్దతుదారులతో పాల్గొన్నారు.
 
 బీఎస్సీ 1993 నుంచి ఢిల్లీ ఎన్నికలలో పోటీచేస్తోంది. గత ఎన్నికల సమయంలో బీఎస్పీని ఢిల్లీ రాజకీయాల్లో మూడవ శక్తిగా పరిగణించారు. ఆ ఎన్నికల్లో బీఎస్పీ రెండు స్థానాలను సాధించింది. ఐదు స్థానాలలో రెండవ స్థానంలో నిలిచింది, అయితే బదర్‌పూర్ నుంచి బీఎస్పీ తరఫున గెలిచిన రామ్‌సింగ్ నేతాజీ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 
 
 రానున్న ఎన్నికల్లో బీఎస్పీకి ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి పోటీనిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా, రామ్ అచల్ రాజ్‌భర్‌ను ఢిల్లీ బీఎస్పీ ఇన్‌చార్జిగా నియమించారు. ఇంతకాలం ఢిల్లీ వ్యవహారాలు చూస్తోన్న రామ్ చంద్ర త్యాగీని జార్ఖండ్ ఇన్‌చార్జిగా నియమించారు. రామ్ అచల్ ఉత్తరాఖండ్ ఇన్‌చార్జిగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement