ఐఏఎస్ అధికారిణి దుర్గానాగ్‌పాల్ మీద సస్పెన్షన్ ఎత్తివేత? | SC dismisses PIL against suspension of UP IAS officer Durga Nagpal | Sakshi
Sakshi News home page

ఐఏఎస్ అధికారిణి దుర్గానాగ్‌పాల్ మీద సస్పెన్షన్ ఎత్తివేత?

Aug 20 2013 10:47 PM | Updated on Sep 1 2017 9:56 PM

ఐఏఎస్ అధికారి దుర్గాశ క్తి నాగ్‌పాల్ మీద అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌పై వివిధ వర్గాల నుంచి వెల్లువెత్తిన విమర్శలు ప్రభుత్వాన్ని కుదిపినట్లు కనిపిస్తోంది.

లక్నో: ఐఏఎస్ అధికారి దుర్గాశ క్తి నాగ్‌పాల్ మీద అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌పై వివిధ వర్గాల నుంచి వెల్లువెత్తిన విమర్శలు ప్రభుత్వాన్ని కుదిపినట్లు కనిపిస్తోంది. గత నెలలో ఇసుక మాఫియా ఒత్తిడులకు తలొగ్గి గౌతమ్‌బుద్ధానగర్ జిల్లా ఐఏఎస్ అధికారి దుర్గాశక్తినాగ్‌పాల్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు యూపీ ప్రభుత్వ చర్యను గర్హించారు. దశదిశల సాగిన దాడితో ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరయింది. 
 
 కేంద్ర ప్రభుత్వంతో పాటు, ఐఏఎస్ అధికార్ల సంఘం ఒత్తిళ్లు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే దుర్గాశక్తి నాగ్‌పాల్‌ను సస్పెండ్ చేయడం వలన అధికారులకు ఇప్పటికే ఓ బలమైన హెచ్చరిక సందేశాన్ని జారీ చేసినట్లయిందని అఖిలేష్ సంతృప్తిపడుతున్నట్లు కనిపిస్తోంది. కాగా ఓ సీనియర్ సమాజ్‌వాది పార్టీ నేత మాత్రం ఎంతగా ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గేది లేదనే నిర్ణయంతో ముఖ్యమంత్రి ఉన్నాడని తెలిపారు. 
 
 దుర్గా నాగ్‌పాల్ ఇప్పటికే ప్రభుత్వ అభియోగానికి సంజాయిషీ సమాధానం పంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సంజాయిషీ పత్రంలో తాను అమాయకురాలినని నాగ్‌పాల్ పేర్కొన్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. సమాధానం పరిశీలిస్తామని నోట్ రాసిన ఈ అధికారి అంతకుమించి ఏ విషయం మాట్లాడడానికి సుముఖంగా ఉన్నట్లు కనిపించలేదు. అధికార వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం నాగ్‌పాల్ పంపించిన ఐదు పేజీ సమాధానంలో తాను నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని పేర్కొన్నట్లు తెలిసింది. కాగా ప్రభుత్వ అభియోగాల్లో పసలేదని, అందులో అన్నీ అవాస్తవాలే ఉన్నాయని అధికార వర్గాలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పునరాలోచనలో పడడానికి ఇది కూడా ఒక కారణమయి ఉంటుందని మరో అధికారి అభిప్రాయపడ్డారు. 
 
 స్థానిక గూఢచార వర్గాల సమాచారంతో పాటు గౌతమ్‌బుద్ధనగర్ జిల్లా మేజిస్ట్రేట్ సేకరించిన సమాచారం ప్రకారం, కదల్‌పూర్‌లో జరిగిన మసీద్ గోడ కూల్చివేత సమయంలో దుర్గా నాగ్‌పాల్ లేరని స్పష్టం చేసినట్లు తెలిసింది. మసీద్ గోడ కూల్చివేత సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన మతసామరస్యానికి భంగం వాటిల్లే ప్రమాదం ఉండేదని ముఖ్యమంత్రి తన చర్యను సమర్థించుకోజూశారని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దుర్గానాగ్‌పాల్‌కు జీబీనగర్ మేజిస్ట్రేట్ ఇప్పటికే క్లీన్ చీట్ ఇచ్చారు. అక్రమంగా నిర్మించిన మసీదు గోడను గ్రామస్థులే కూల్చివేశారని జిల్లా మేజిస్ట్రేట్ తన నివేదికలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement