మాకొద్దు ఈ నగరం ! | no security to womens in delhi | Sakshi
Sakshi News home page

మాకొద్దు ఈ నగరం !

Mar 13 2014 10:23 PM | Updated on Jul 23 2018 9:13 PM

మాకొద్దు ఈ నగరం ! - Sakshi

మాకొద్దు ఈ నగరం !

ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన మహిళల్లో సగం మంది రాజధాని నుంచి తిరిగి వెళ్లిపోవాలని కోరుకుంటున్నారని ఒక సర్వేలో వెల్లడయింది.

 ఢిల్లీలో మహిళలకు భద్రత అత్యల్పం కాబట్టి తక్కువ జీతానికి అయినా ఇతర నగరాల్లో ఉద్యోగం వెతుక్కోవడం మేలని ఇక్కడ పనిచేసే పరాయి రాష్ట్రాలకు చెందిన ఉద్యోగినులు అనుకుంటున్నారు. మహిళలు రాత్రిపూట ఉద్యోగాలు చేయడం ఎంతమాత్రమూ సురక్షితం కాదని చెబుతున్నారు.
 
 న్యూఢిల్లీ: ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన మహిళల్లో సగం మంది  రాజధాని నుంచి తిరిగి వెళ్లిపోవాలని కోరుకుంటున్నారని ఒక సర్వేలో వెల్లడయింది. ఢిల్లీలో మహిళలకు భద్రత అత్యల్పం కాబట్టి తక్కువ జీతానికి అయినా ఇతర నగరాల్లో ఉద్యోగం వెతుక్కోవడం మేలని దాదాపు 43 శాతం మంది అనుకుంటున్నారని ఇది పేర్కొంది. చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (సీసీఐ) నిర్వహించిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. ఢిల్లీలోని ఉద్యోగినులు, విద్యార్థినులు, ఉద్యోగార్థులను ప్రశ్నించడం ద్వారా సర్వే నిర్వహించామని సీసీఐ తెలిపింది. ఇది వెల్లడించిన వివరాల ప్రకారం.. నిర్భయ ఉదంతం తరువాత తమ ఉద్యోగాలపై ఎంతో కొంత ప్రతికూల ప్రభావం కనిపిస్తోందని దాదాపు ఉద్యోగినులంతా అంగీకరించారు. దేశరాజధానిలో దాదాపు 3,400 మంది మహిళలు పనిచేస్తుండగా, వీరిలో 60 శాతం మంది ఇతర రాష్ట్రాలవాసులే. ‘నిర్భయపై సామాహిక అత్యాచార ఘటన తదనంతరం ఢిల్లీలో ఉండడం క్షేమకరం కాదని దాదాపు 43 శాతం మంది మహిళా ఉద్యోగులు విశ్వసిస్తున్నారు. అందుకే వేరే ఏదైనా నగరంలో ఉద్యోగం వెతుక్కోవడం మేలని అనుకుంటున్నారు. తమ స్వస్థలాకు సమీపంలో ఉండే నగరాలైతే ఇంకా మంచిదని, జీతం తగ్గినా ఫర్వాలేదని భావిస్తున్నారు’ అని సర్వే నివేదిక వివరించింది.
 
 పగటి డ్యూటీలే మేలు
 నగరంలో లైంగిక నేరాల సంఖ్య ఎక్కువవుతుండడంతో, రాత్రిపూట ఉద్యోగాలు ఎంతమాత్రం క్షేమం కాదని మహిళా ఉద్యోగులు అంటున్నారు. ఈ పరిణామం వల్ల తమ విధులను కూడా సక్రమంగా నిర్వహిచలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దుపోయే వరకు కార్యాలయాల్లో ఉండాలంటే భయమేస్తుందని తెలిపారు. తమకు పగటిపూట ఉద్యోగాలే మేలని సర్వేలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది స్పష్టం చేశారు. మొత్తం ఉద్యోగుల్లో నాలుగు శాతం మంది మహిళలు మాత్రమే రాత్రి వేళల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగాలు చేసే మహిళలు ప్రభుత్వ రవాణా వాహనాల్లో ప్రయాణించడమే మంచిదని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. మెట్రోలో ప్రయాణం సురక్షితం కాబట్టి దాని పనివేళలను అర్ధరాత్రి వరకు కొనసాగించాలన్నారు. ఢిల్లీలో శాంతిభద్రతలు మరింత మెరుగుపడాలని సర్వేలో పాల్గొన్న వారంతా పేర్కొన్నారు.
 
  ‘ట్రాఫిక్ పోలీసులు క్రమం తప్పకుండా రోడ్డు భద్రత మదింపు నిర్వహించడం, సురక్షితం కాదని ప్రదేశాలను గుర్తించడం వంటి చర్యల ద్వారా మాకు భద్రత పెంచవచ్చు. సంఘవ్యతిరేక శక్తులపై ఫిర్యాదు అందగానే పోలీసులు తక్షణం స్పందించాలి’ అని ఒక మహిళ అన్నారు. లైంగిక నేరాల కేసుల్లో సత్వర న్యాయం కావాలంటే ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు అనివార్యమని చాలా మంది చెప్పారు. ‘వీధి దీపాలు, పబ్లిక్ టాయిలెట్ల వంటివి సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మహిళలకు సురక్షితం వాతావరణం కరువవుతోందని చాలా మంది అన్నారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ప్రాథమిక సదుపాయాల కల్పన అధ్వానంగా ఉంది’ అని సీసీఐ నివేదిక విశదీకరించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement