మళ్లీ విచారణ | Madras High Court attack Again inquiry | Sakshi
Sakshi News home page

మళ్లీ విచారణ

Apr 28 2014 12:03 AM | Updated on Mar 28 2019 6:26 PM

హైకోర్టు దాడి ఘటన మళ్లీ తెర మీదకు రానున్నది. మళ్లీ విచారణకు సీబీఐను ప్రత్యేక కమిటీ ఆదేశించింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీ

 సాక్షి, చెన్నై:హైకోర్టు దాడి ఘటన మళ్లీ తెర మీదకు రానున్నది. మళ్లీ విచారణకు సీబీఐను ప్రత్యేక కమిటీ ఆదేశించింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీ ఇందుకు సంబంధించిన  ఉత్తర్వులను జారీ చేసింది. ‘ఫిబ్రవరి 19, 2009’ రాష్ట్ర హైకోర్టు చరిత్రలో దుర్దినం. ఆ రోజు చోటుచేసుకున్న ఘటన మాయని మచ్చగా మారింది. న్యాయవాదులు, పోలీసుల మధ్య భీకర యుద్ధం చోటు చేసుకుంది. వాహనాలు దగ్ధమయ్యా యి. పోలీసు స్టేషన్ ఆహుతి అయింది. అనేక మంది తలలు పగిలాయి. ఆ పరిసరాలు రణరంగాన్ని తలపించడంతో రాష్ట్ర చరిత్రలో హైకోర్టు అకారణంగా నెలరోజుల పాటు సెలవు ప్రకటించాల్సి వచ్చింది. న్యాయవాదులు, పోలీసులు పరస్పరం దాఖలు చేసుకున్న పిటిషన్ల విచారణ తొలుత రాష్ట్ర హైకోర్టులో
 జరిగింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో జరుగుతూ వస్తున్నది.
 
 తమ మీద దాడి చేసిన పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకోవాలన్న నినాదంతో న్యాయవాదులు నేటికీ ఉద్యమిస్తూనే ఉన్నారు. సుప్రీం కోర్టులో విచారణ ఓ వైపు ఉంటే, సీబీఐ విచారణ ఏకపక్షంగా జరిగినట్టుగా న్యాయవాదుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో హైకోర్టు నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీ రంగంలోకి దిగింది.
 మళ్లీ విచారణ : న్యాయమూర్తులు ఎస్ రాజేశ్వరన్, ఆర్ సుబ్బయ్య, ఏ ఆర్ముగ స్వామితో కూడిన ఈ కమిటీ సీబీఐ విచారణ నివేదికను సమగ్రంగా పరిశీలించింది. అదే సమయంలో ఈ ఘటన విచారణను ప్రత్యేక సిట్‌కు అప్పగించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాది ముత్తురామలింగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఆ కమిటీ చెంతకు చేరింది. ఇప్పటి వరకు సాగిన విచారణను పరిశీలించిన ఆ కమిటీ మళ్లీ సమగ్ర దర్యాప్తునకు సీబీఐను ఆదేశించేందుకు నిర్ణయించింది.
 
 ఉత్తర్వులు : పిటిషనర్ల వాదనలు, సీబీఐ నివేదికను పరిశీలించిన ఈ కమిటీ సమగ్ర దర్యాప్తుకు ఆదేశిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. సంఘటన జరిగిన రోజు పరిస్థితి, మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన ఫొటోలు, వార్తలు, కథనాలు, టీవీల్లో ప్రసారాల వివరాలను అన్ని కోణాల్లోనూ పరిశీలించాలని సూచించింది. అలాగే, కోర్టుల్లో పిటిషన్ల దాఖలు చేసిన వారందరూ సీబీఐ దృష్టికి తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించాలని సూచించారు. సమగ్ర దర్యాప్తు నివేదికను మూడు నెలల్లో సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ప్రత్యేక సిట్ విచారణకు ఆదేశించాల్సిన పరిస్థితిని సీబీఐ తీసుకు రాదన్న నమ్మకం ఉందని, ఆ దిశగా దర్యాప్తును సమగ్రంగా చేపట్టాలంటూ హితవు పలికారు. దీన్ని బట్టి చూస్తే, ఇప్పటి వరకు సాగిన విచారణ ఏక పక్షంగా ఉన్నట్టు తేటతెల్లం అవుతోందని న్యాయవాద సంఘాలు పేర్కొంటుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement