కుక్కలు వస్తే చిక్కులు | Greater Noida: RWA threatens Rs 21k fine for dog poop in parks | Sakshi
Sakshi News home page

కుక్కలు వస్తే చిక్కులు

Jul 31 2014 10:54 PM | Updated on Sep 29 2018 4:26 PM

శునకాలకు అనుమతి లేదంటూ పార్కుల్లో ప్రత్యేకంగా బోర్డులు అమర్చినా యజ మానులు ఖాతరు చేయకుండా వాటిని తీసుకురావడం గుర్గావ్ పార్కుల్లో సర్వసాధారణమే.

 గ్రేటర్ నోయిడా: శునకాలకు అనుమతి లేదంటూ పార్కుల్లో ప్రత్యేకంగా బోర్డులు అమర్చినా యజ మానులు ఖాతరు చేయకుండా వాటిని తీసుకురావడం గుర్గావ్ పార్కుల్లో సర్వసాధారణమే. అయితే వీటి సంచారం వల్ల కాలనీ పార్కులు తీవ్రంగా దెబ్బతింటున్నట్టు గుర్తించిన నోయిడాలోని బెటా-1 సెక్టార్ నివాసుల సంక్షేమ సంఘం (ఆర్‌డబ్ల్యూఏ) పెంపుడు జంతువుల సంచారంపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. కాలనీ పార్కుల్లోకి కుక్కలను తీసుకువస్తే ఇక నుంచి రూ.21 వేల జరిమానా వేస్తామని హెచ్చరించింది. జంతువులను తీసుకురాకూడదని ఎన్నిసార్లు చెప్పి నా యజమానులు వినడం లేదని, గ్రేటర్ నోయిడా ప్రాధికార సంస్థ కూడా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆర్‌డబ్ల్యూఏ వివరణ ఇచ్చింది. ‘బెటా సెక్టార్‌లో దాదాపు 1,800 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ ఎనిమిది పార్కులు ఉన్నాయి.
 
 చాలా మం దికి ఒకటి కంటే ఎక్కువ కుక్కలు ఉన్నాయి. వీటిని తీసుకురాకూడదని ఎంత చెప్పినా యజమానులు చెవికెక్కించుకోవడం లేదు. పార్కులను అందరి సౌకర్యం కోసం నిర్మించారు. పెంపుడు జంతువుల వల్ల అవి తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ విష యం గురించి గ్రేటర్ నోయిడా మున్సిపాలిటీకి ఎన్నిసార్లు ఫిర్యాదులు ఇచ్చినా స్పందన లేదు’ అని ఆర్‌డబ్ల్యూఏ ప్రధాన కార్యదర్శి హరీందర్ భట్టి వివరించారు. కుక్కలను తీసుకువస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ ప్రతి పార్కులో రెండు బోర్డులు పెడతామని తెలిపారు. పెంపుడు జంతువుల తీసుకురావడాన్ని ప్రోత్సహించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చారు.
 
 బెటా ఆర్‌డబ్ల్యూఏ మాదిరిగానే మిగతా సంఘాలు కూడా ఇదే బాటను అనుసరించాలని భావిస్తున్నాయి. కుక్కల యజమానులు మాత్రం ఆర్‌డబ్ల్యూఏ నిర్ణయంపై మండిపడుతున్నారు. గ్రేటర్ నోయిడా మున్సిపాలిటీ మాత్రం ఈ విషయంపై ఏమీ చెప్పడం లేదు. ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జంతు సంక్షేమ సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం హౌసింగ్ సొసైటీలు పెంపుడు జంతువుల సంచారంపై నిషేధం విధించడం కుదరదు. జరిమానాలు విధించడం కూడా చట్టవిరుద్ధమే.  పార్కుల్లోకి జంతువులను తీసుకురావడానికి నిర్దేశిత సమయాన్ని సూచించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement