నాలుగు శ్లాబులుగా జీఎస్టీ! | Sakshi
Sakshi News home page

నాలుగు శ్లాబులుగా జీఎస్టీ!

Published Wed, Oct 19 2016 2:16 AM

జీఎస్టీ  కౌన్సిల్ భేటీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా

6, 12, 18, 26 శాతంగా పన్ను రేట్లు
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జైట్లీ ప్రతిపాదన, నేడు తుది నిర్ణయం
నిత్యావసరాలపై తక్కువ, విలాస వస్తువులపై అధికం
విలాస వస్తువులు, పొగాకుపై అదనపు సెస్ వసూలు
రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు ప్రతిపాదనలకు అంగీకారం
పరిహారం కోసం సెస్సు ఆదాయంతో రూ. 50 వేల కోట్ల నిధి

సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జఎస్టీ) రేట్లపై ఎట్టకేలకు ముందడుగు పడింది. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నాలుగు పన్ను శ్లాబుల్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. 6, 12, 18, 26 శాతంగా రేట్లను వర్గీకరిస్తూ పన్ను వసూలు చేయాలనేది ఆ ప్రతిపాదన సారాంశం. ఇంకా ఏకాభిప్రాయం రాకపోవడంతో బుధవారం జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. నిత్యావసర వస్తువులపై తక్కువ రేటు, విలాస వస్తువులపై అధిక పన్ను రేటు విధించాలని ప్రతిపాదనల్లో సూచించారు.

 ప్రతిపాదన సారాంశం..
‘ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని... పన్ను నుంచి ఆహార పదార్థాల్ని మినహాయించాలి. అలాగే దాదాపు 50 శాతం నిత్యావసర వస్తువుల్ని పన్ను నుంచి మినహాయించడం కానీ తక్కువ రేటు విధించడం కానీ చేయాలి. 70 శాతం వస్తువులపై పన్ను రేటు 18 శాతం కంటే తక్కువ ఉండాలి. విలాసవంతమైన కార్లు, పొగాకు, సిగరెట్లు, శీతల పానియాలు, కాలుష్యకారక వస్తువులపై అదనపు సెస్ విధించాలి. బంగారంపై మాత్రం 4 శాతం రేటు ఉండాలి. ఎఫ్‌ఎంసీజీ (త్వరగా ఖర్చయ్యే వస్తువులు, ఉదా: సబ్బులు), కన్స్యూమర్ డ్యూరబుల్ వస్తువులు(గృహోపకరణాలు, కార్లు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, బొమ్మలు)పై 26 శాతం పన్ను విధించాలి’ అని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం వీటిపై 31 శాతం పన్ను వసూలు చేస్తున్నారు.

నేడు పన్ను రేట్లపై తుది నిర్ణయం
విజ్ఞాన్‌భవన్‌లో మూడు రోజులు జరిగే ఈ సమావేశాల్లో బుధవారం తుది పన్ను రేట్లపై ఒక నిర్ణయానికి రానున్నారు.  మంగళవారం భేటీలో ఏయే వస్తువులపై ఎంత పన్ను విధిం చాలి? రాష్ట్రాలకు ఆదాయం తగ్గితే పరిహారం ఎలా చెల్లించాలి? అన్న అంశాలపై చర్చించా రు. పన్ను ఆదాయం వృద్ధి రేటు 14 శాతం ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రాలకు వస్తున్న పన్ను ఆదాయంపై 14 శాతం అదనపు ఆదాయం జీఎస్టీ అమలుతో రాకపోతే, తగ్గిన మొత్తాన్ని కేంద్రం పరిహారంగా చెల్లిస్తుంది. ఈ ప్రతిపాదన కు అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి.

సమావేశం అనంతరం జైట్లీ మాట్లాడుతూ... ఆదాయం లెక్కింపునకు 2015-16ను ఆధార సంవత్సరంగా పరిగణించాలన్న ప్రతిపాదనను అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని చెప్పారు. ‘గత ఐదేళ్ల ఆదాయాన్ని లెక్కించేందుకు 14 శాతం వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించాం. రాష్ట్రాలు ఇంతకంటే తక్కువ ఆదాయం పొందితే... కేంద్రం పరిహారమిస్తుంది. విలాస వస్తువులు, పొగాకువంటి పదార్థాలపై విధించే సెస్‌తో రూ. 50 వేల కోట్ల నిధి ఏర్పాటు చేసి రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తాం’ అని జైట్లీ పేర్కొన్నారు.

 సేవలపై మూడు శ్లాబులే..
కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మాట్లాడుతూ... సేవలపై పన్ను 6, 12, 18 శాతంగా మాత్రమే ఉంటుందని, గరిష్టంగా 18 శాతం విధిస్తారన్నారు. 

తుది నిర్ణయం తీసుకోలేదు: యనమల
శ్లాబులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, బుధవారం చర్చ కొనసాగుతుందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.

పేదలపై భారం ఉండరాదు: ఈటెల
సామాన్యులకు భారం కాకుండా పన్ను విధానం ఉండాలని మొదటి నుంచి తెలంగాణ కోరుతోందని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.  సమావేశం అనంతరం అరుణ్ జైట్లీని కలిసి వెనకబడిన జిల్లాలకు రెండో విడత నిధులు రూ. 400 కోట్లు ఇవ్వాలని కోరారు.

Advertisement
Advertisement