‘విదర్భ’ ఆత్మహత్యలు తగ్గుతాయ్! | Farmer suicides to fall 70% from 07-08 figure, claims Maharashtra govt | Sakshi
Sakshi News home page

‘విదర్భ’ ఆత్మహత్యలు తగ్గుతాయ్!

Oct 3 2013 12:07 AM | Updated on Nov 6 2018 8:28 PM

కరువు పీడిత విదర్భ ప్రాంత రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు వారికి క్రమంతప్పకుండా ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నందున ఆత్మహత్యలు తగ్గుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ముంబై: కరువు పీడిత విదర్భ ప్రాంత రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు వారికి క్రమంతప్పకుండా ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నందున ఆత్మహత్యలు తగ్గుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2007-08తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆత్మహత్యలు దాదాపు 70 శాతం తగ్గుముఖం పడుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ పైవిషయం తెలిపారు ‘విదర్భలోని ప్రభావిత జిల్లాల రైతులు ప్రతి ఖరీఫ్‌లోనూ ఒకే పంటపండించి నష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. దీనివల్ల ఒక్కసారి వచ్చిన ఆదాయాన్ని ఏడాది మొత్తానికి వాడుకోవాలి.
 
 ఖరీఫ్ పంట కోసిన తరువాత ఇతర ధాన్యాలు, ఉద్యానవన పంటలు, పుష్పాలు, సోయాబీన్ సాగుపై దృష్టి సారించాలని మేం రైతులకు సూచిస్తున్నాం’ అని ఆయన వివరించారు. విదర్భలోని అకోలా, అమరావతి, బుల్డాణా, వాషిమ్, యావత్మల్, వార్ధా జిల్లాల్లో భారీసంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2007-08లో కరువు విజృంభించడంతో ఏకంగా 2,395 మంది బలవన్మరణాల పాలయ్యారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రాంత రైతులకు రాయితీలు, శిక్షణలు ఇవ్వడానికి ప్రధానమంత్రి పథకం కింద రూ.3,750 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1,075 కోట్లు కేటాయించామని పాటిల్ వెల్లడించారు. నాణ్యమైన విత్తనాలను 50 శాతం రాయితీకి సరఫరా చేస్తున్నామన్నారు. సంవత్సరాంతం వరకు రైతులకు ఆదాయం సమకూర్చిపెట్టగల డెయిరీ, దాణా పరిశ్రమల స్థాపనకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ సామగ్రి, విత్తనాల వంటి కోసం ప్రతి రైతు కుటుంబానికి రూ.25 వేల ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. బిందుసేద్య పరికరాలపైనా 50 శాతం రాయితీలు ఇస్తున్నామని మంత్రి చెప్పారు. విదర్భ రైతులను ఆదుకోవడానికి మరిన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని రాధాకృష్ణ విఖేపాటిల్ ఈ సందర్భంగా వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement