breaking news
Radhakrishna Vikhe Patil
-
కాంగ్రెస్‌కు అసెంబ్లీ ప్రతిపక్షనేత రాజీనామా
ముంబై: సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనసభలో ప్రతిపక్షనేత రాధాకృష్ణ వీకే పాటిల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఆయన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించారు. అయితే రాధాకృష్ణ రాజీనామాపై రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాధాకృష్ణ కుమారుడు సుజయ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన వారం రోజులకే ఆయన ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ తరఫున అహ్మద్‌నగర్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవాలని భావించిన సుజయ్‌కు టికెట్ దక్కకపోవడంతోనే ఆయన పార్టీ మారినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీల పొత్తులో భాగంగా అహ్మద్‌నగర్ స్థానాన్ని ఎన్సీపీ దక్కించుకున్నట్టుగా సమాచారం. దీంతో సుజయ్‌కు బీజేపీ నుంచి ఆఫర్ రావడంతోనే పార్టీ మారారనే ప్రచారం జరుగుతోంది. తన కుమారుడు పార్టీని వీడిన తరుణంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై రాధాకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. శరద్ పవార్ పాత కక్షలను మనసులో ఉంచుకుని మాట్లాడటంతో తన కొడుకు కాంగ్రెస్‌ను వీడారని ఆరోపించారు. అయితే గతకొంతకాలంగా రాధాకృష్ణ వ్యవహార శైలిపై కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. -
‘విదర్భ’ ఆత్మహత్యలు తగ్గుతాయ్!
ముంబై: కరువు పీడిత విదర్భ ప్రాంత రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు వారికి క్రమంతప్పకుండా ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నందున ఆత్మహత్యలు తగ్గుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2007-08తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆత్మహత్యలు దాదాపు 70 శాతం తగ్గుముఖం పడుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ పైవిషయం తెలిపారు ‘విదర్భలోని ప్రభావిత జిల్లాల రైతులు ప్రతి ఖరీఫ్‌లోనూ ఒకే పంటపండించి నష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. దీనివల్ల ఒక్కసారి వచ్చిన ఆదాయాన్ని ఏడాది మొత్తానికి వాడుకోవాలి. ఖరీఫ్ పంట కోసిన తరువాత ఇతర ధాన్యాలు, ఉద్యానవన పంటలు, పుష్పాలు, సోయాబీన్ సాగుపై దృష్టి సారించాలని మేం రైతులకు సూచిస్తున్నాం’ అని ఆయన వివరించారు. విదర్భలోని అకోలా, అమరావతి, బుల్డాణా, వాషిమ్, యావత్మల్, వార్ధా జిల్లాల్లో భారీసంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2007-08లో కరువు విజృంభించడంతో ఏకంగా 2,395 మంది బలవన్మరణాల పాలయ్యారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రాంత రైతులకు రాయితీలు, శిక్షణలు ఇవ్వడానికి ప్రధానమంత్రి పథకం కింద రూ.3,750 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1,075 కోట్లు కేటాయించామని పాటిల్ వెల్లడించారు. నాణ్యమైన విత్తనాలను 50 శాతం రాయితీకి సరఫరా చేస్తున్నామన్నారు. సంవత్సరాంతం వరకు రైతులకు ఆదాయం సమకూర్చిపెట్టగల డెయిరీ, దాణా పరిశ్రమల స్థాపనకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ సామగ్రి, విత్తనాల వంటి కోసం ప్రతి రైతు కుటుంబానికి రూ.25 వేల ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. బిందుసేద్య పరికరాలపైనా 50 శాతం రాయితీలు ఇస్తున్నామని మంత్రి చెప్పారు. విదర్భ రైతులను ఆదుకోవడానికి మరిన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని రాధాకృష్ణ విఖేపాటిల్ ఈ సందర్భంగా వివరించారు.