సర్వం సిద్ధం | Engineering Counselling | Sakshi
Sakshi News home page

సర్వం సిద్ధం

Jun 28 2015 3:44 AM | Updated on Sep 3 2017 4:28 AM

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నుంచి రెండు రోజుల పాటు రిజర్వుడు కోటా సీట్ల భర్తీ సాగనుంది. జులై ఒకటో తేదీ

సాక్షి, చెన్నై : ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నుంచి రెండు రోజుల పాటు రిజర్వుడు కోటా సీట్ల భర్తీ సాగనుంది. జులై ఒకటో తేదీ నుంచి జనరల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఉన్నత విద్యావిధానం మేరకు ఇంజనీరింగ్ కోర్సుల సీట్ల భర్తీ ప్రక్రియను ప్రతి ఏటా అన్నావర్సిటీ నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఆ మేరకు రాష్ట్రంలోని 538 ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వ కోటా సీట్లు రెండు లక్షలకు పైగా ఉన్నాయి.
 
  దీంతో ఈ సీట్ల భర్తీకి ప్రతి ఏడాది వలే ఈ సారి కూడా దరఖాస్తులను ఆహ్వానించారు. కొన్నేళ్లుగా దరఖాస్తుల పర్వానికి స్పందన కరువు అవుతుండడంతో సీట్ల భర్తీ పూర్తి స్థాయిలో జరిగేది అనుమానంగా మారింది. ఈ ఏడాది 1.90 లక్షల దరఖాస్తులు విక్రయించగా, 1.54 లక్షల దరఖాస్తులు తిరిగి వచ్చాయి. ఈ దరఖాస్తులకు ర్యాండం నెంబర్లను ప్రకటించారు. ప్లస్‌టూ మార్కుల ఆధారంగా ర్యాంకుల జాబితా వెలువడింది. ర్యాండం నెంబర్ల ఆధారంగా విద్యార్థులను కౌన్సెలింగ్‌కు ఆహ్వానించే పనిలో అన్నావర్సిటీ ప్రత్యేక విభాగం వర్గాలు నిమగ్నం అయ్యాయి.
 
 సర్వం సిద్ధం: ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పర్వం ఆరంభం అవుతుండడంతో విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు    
  చేశారు. రాష్ట్రంలోని ఆయా ఇంజనీరింగ్ కళాశాలలు, వివరాలు, సీట్ల సంఖ్య, తదితర అంశాలను విద్యార్థులకు వివరించే రీతిలో అక్కడక్కడ ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు. అలాగే, పలు బ్యాంక్‌లకు సంబంధించిన విభాగాలు ఏర్పాటు అయ్యాయి. విద్యార్థుల సౌకర్యార్థం క్యాంటీన్, మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించారు. పోలీసు బూత్, అగ్నిమాపక వాహనాలను సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కౌన్సెలింగ్ వివరాలను ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందించేందుకు వీలుగా ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో తెలియజేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇక, సుదూర ప్రాంతాల నుంచి కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వ బస్సుల్లో రాయితీ ప్రకటించి ఉన్నారు. అలాగే, చెన్నై కోయంబేడు బస్టాండ్, తాంబరం పరిసరాల నుంచి అన్నా వర్సిటీ మీదుగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు.
 
 నేటి నుంచి కౌన్సెలింగ్:  ఆదివారం నుంచి కౌన్సెలింగ్ పర్వం ఆరంభం కానున్నది. తొలి రెండు రోజులు రిజర్వుడు కోటా సీట్ల భర్తీ సాగనుంది. తొలుత వికలాంగుల కోటా, తదనంతరం క్రీడా కోటా సీట్ల భర్తీ నిర్వహిస్తారు. అనంతరం మాజీ సైనికోద్యుగుల పిల్లలకు సీట్ల కేటాయింపు జరుగుతుంది. చివరగా జులై ఒకటో తేదీ నుంచి జనరల్ కోటా సీట్ల భర్తీ సాగుతుంది. ఈ ఏడాది సీట్ల సంఖ్య అధికంగా ఉండడం, దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉండడంతో అందరికీ సీట్లు దక్కడం ఖాయం. అయితే, ప్రధాన కళాశాలల్లో కీలక కోర్సుల సీట్లను కైవసం చేసుకోవడంలోనే విద్యార్థుల మధ్య పోటీ సాగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement