ఆ రోజు.. పండుగే అందరికీ ! | chief minister jayalalitha birthday Many programs | Sakshi
Sakshi News home page

ఆ రోజు.. పండుగే అందరికీ !

Jan 22 2016 2:24 AM | Updated on Oct 9 2018 3:01 PM

అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను

 అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహించేందుకు పార్టీ సమాయత్తం అవుతోంది. జన్మదినోత్సవ ఏర్పాట్లపై గురువారం పార్టీ కార్యాలయంలో వివిధ అనుబంధ విభాగాలకు చెందిన నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏడు తీర్మానాలను
 
 ఆమోదించారు.
 చెన్నై, సాక్షి ప్రతినిధి:  అన్నాడీఎంకే శ్రేణులు అమ్మా అంటూ అత్యంత అభిమానంతో పిలుచుకునే జయలలిత జన్మదినం వచ్చే నెల 24వ తేదీన వస్తోంది. పార్టీలో నంబర్ 2 అనేది లేకుండా సర్వం తానై నడిపిస్తున్న జయలలిత తిరుగులేని శక్తిగా ఎదిగారు. పార్టీ గెలిచినా ఓడినా ఆమెదే భారం అన్నట్లుగా మారిపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ గెలుపును తన భుజస్కంధాలపై వేసుకుని అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకురాగల ఏకైక స్టార్ క్యాంపెయిన్‌గా నిలిచి ఉన్న జయ అంటే సహజంగానే జే జేలు పలుకుతుంటారు. అందునా ఇది ఎన్నికల ఏడాది కావడంతో అమ్మ జన్మదినాన్ని సైతం ప్రచారానికి వాడుకునేందుకు సిద్ధం అవుతారనడంలో సందేహం లేదు. రెండేళ్ల కాలంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఎదుర్కోవడం, జైలు జీవితం, మళ్లీ సీఎం పగ్గాలు వంటి సంఘటనలు జయ రాజకీయ జీవితాన్ని కుదిపేశాయి.
 
 మళ్లీ నెగ్గుకొస్తున్న తరుణంలో ఇటీవల సంభవించిన వర్షాలు, వరదలు, చెన్నై నగరం నీట మునగడం జయను ఎంతో కొంత అప్రతిష్టపాలు చేశాయి. అధికార ప్రభుత్వ అప్రతిష్టనే రాజకీయ అస్త్రంగా మలుచుకోవాలని డీఎంకే తదితర పార్టీలు కాచుకుని ఉన్నాయి. ఎన్నికల వేళ ఆయా అంశాలను ప్రస్తావించడం ద్వారా లబ్ధిపొందాలని భావిస్తున్నాయి. ఇటు వంటి క్లిష్టపరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు అన్నాడీఎంకే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు.జయ జన్మదినోత్సవంతో ప్రజల్లోకి: ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికల జరగడం ఖాయమై పోగా, ఫిబ్రవరి 24వ తేదీన జయ జన్మదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో తీర్మానించారు. పార్టీ యువతీ యువకుల యువజన విభాగాల నిర్వాహకులు, జిల్లా కార్యదర్శులు జయ జన్మదిన ఏర్పాట్లపై చర్చించుకుని ఏడు తీర్మానాలు చేశారు.
 
 ఏడు తీర్మానాలు:   ‘ప్రజల కోసమే అమ్మ...ప్రజల వల్లనే అమ్మ’ అనే నినాదంతో రాష్ట్రం కోసం పాటుపడుతున్న జయలలిత 68వ జన్మదినాన్ని ఘనంగా జరపాలని నిర్ణయించారు. ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. పేద బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, యువతీ యువకులకు 68 రకాల వస్తువులను పంపిణీ చేయనున్నారు. అన్నదాన కార్యక్రమాలను జరపనున్నారు. జయ జీవితంలోని ముఖ్యఘట్టాలపై యువతీ యువకులతో వ్యాసరచన, వక్తృత్వ, కబడ్డీ పోటీలను నిర్వహిస్తారు. నాలుగున్నరేళ్ల కాలంలో జయ ప్రభుత్వం సాధించిన విజయాలను సోషల్ నెట్‌వర్క్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే విజయబావుటా ఎగురవేసేలా పనిచేయాలని తీర్మానించారు. యువతీయువకుల విభాగ రాష్ట్ర కార్యదర్శి, పార్లమెంటు సభ్యులు పి.కుమార్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement