నగరంలోని 895 అనధికార కాలనీల క్రమబద్ధీకర ణకు ఉద్దేశించిన సవరణ ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేయడాన్ని
నగరంలోని 895 అనధికార కాలనీల క్రమబద్ధీకర ణకు ఉద్దేశించిన సవరణ ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేయడాన్ని ఎన్నికల ఎత్తుగడగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. ఢిల్లీ విధానసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇలా చేశారని ఆయన ట్వీటర్‌లో పేర్కొన్నారు. ‘ గతంలో షీలాదీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే ప్రొవిజనల్ పత్రాలను జారీచేసింది. అయితే ఆ తర్వాత ఆ కాలనీల విషయాన్ని గాలికొదిలేసింది. ఢిల్లీ విధానసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్ర మంత్రిమండలి ఈ సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఇదంతా ఎన్నికల ఎత్తుగడే తప్ప మరొకటి కాదు. ఢిల్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే బీజేపీ కూడా అనధికార కాలనీల విషయాన్ని గాలికొదిలేస్తుంది. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు. ప్రజలకు మా పార్టీపైనే విశ్వాసం ఉంది. ఎందుచేతనంటే మేము ఏది చెప్పామో అదే చేశాం.
కొత్త చట్టం చేస్తాం : మనీష్ సిసోడియా
ఇదే విషయమై ఆ పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే ఇందుకు సంబంధించి కొత్త చట్టం చేస్తామన్నారు. కేంద్రం ఉత్తర్వుల వల్ల ఈ కాలనీల్లో నివసిస్తున్న వారు తమ నివాసాలను రిజిస్టర్ చేసుకోలేరని, అంతేకాకుండా వాటిపై బ్యాంకుల వద్ద నుంచి ఎటువంటి రుసుమూ తీసుకోలేరని ఆరోపించారు. అంతేకాకుండా ఈ కాలనీల్లో రహదారులు, మురుగుకాల్వల నిర్మాణం జరగబోదన్నారు.