ఫొటో తీయండి.. పోస్ట్‌ చేయండి

BBMP Launches 'Fix My Street' App to Resolve Civic Woes - Sakshi

నగర సమస్యలపై ఈజీగా ఫిర్యాదు

బీబీఎంపీ ఫిక్స్‌ మై స్ట్రీట్‌ యాప్‌

బనశంకరి: బెంగళూరు పాలికె పరిధిలో సమస్యలు ఉంటే.. ఆ ఫొటో తీసి పాలికె యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తేచాలు, పరిష్కారం బాధ్యత పాలికెదే. సోమవారం పాలికె కేంద్రకార్యాలయంలో మేయర్‌ సంపత్‌రాజ్, పాలికె కమిషనర్‌ మంజునాథ్‌ ప్రసాద్‌ ‘మా వీధులను సరిచేయండి’ అనే యాప్‌ను విడుదల చేశారు. మేయర్‌ మాట్లాడుతూ పాలికె పరిధిలోని రోడ్లు, చెత్త తదితర ఎలాంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించుకోవడానికి  ఈ యాప్‌ ఎంతో అనుకూలమవుతుందని చెప్పారు.

ఎలా పనిచేస్తుందంటే..
bbmpfixmystreet యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రోడ్డుపై గుంత, చెత్త, మురుగు సమస్య ఉన్నట్టయితే, ఒక ఫొటో తీసియాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. దానిపై అధికారులు స్పందిస్తారు. డ్యాష్‌బోర్డు ద్వారా సమస్యల పరిష్కారానికి అదికారుల నుంచి చర్యలు తీసుకుంటామని సంపత్‌రాజ్‌ తెలిపారు. ఇప్పటివరకు నగరంలో ఇబ్బందులపై ప్రజలు బీబీఎంపీ కంట్రోల్‌రూమ్‌కు ఫోన్‌ చేయాల్సివచ్చేది. అక్కడి నుంచి వార్డుకు, అధికారులకు సమాచారం అందించి అప్రమత్తం చేయడానికి సమయం పట్టేది. ప్రస్తుతం విడుదల చేసిన యాప్‌ ద్వారా నేరుగా తమ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని మేయర్‌ చెప్పారు.

ఏ సమస్యకు ఎంత సమయం?
చెత్త సమస్య ఉంటే ఒక్కరోజులోగా పరిష్కరించాలని అధికారులకు మేయర్‌ సూచించారు. వీధి దీపాల సమస్యను రెండురోజులు, రోడ్లు గుంతల సమస్యలను ఒక వారంలోగా పరిష్కరించాలని చెప్పారు. బెస్కాం, ఆరోగ్య శాఖ, బీడీఏ, ఉద్యానవనశాఖ తో పాటు వివిద శాఖలు యాప్‌ సమాచారాన్ని అందుకుంటాయి. ప్రతి అధికారి, కార్పొరేటర్లకు సమాచారం వెళ్తుందని మేయర్‌ తెలిపారు. సమస్య పరిష్కారం అయిన వెంటనే ఆ ఫోటోను అప్‌లోడ్‌ కోరారు.

నగరమంతటా ఎల్‌ఈడీ బల్బులు
అనంతరం పాలికె కమిషనర్‌ మంజునాథ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ... యాప్‌లో ప్రజల సమస్యల పరిష్కారానికి ఆలస్యమైతే అధికారులు అందుకు కారణాన్ని ఫిర్యాదిదారుకు తెలియజేయాలి.  ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నగరంలో పాత విద్యుత్‌దీపాలను తొలగించి ఎల్‌ఇడి బల్ప్‌లను ఏర్పాటు చేయడానికి నివేదికను సిద్ధం చేశామని, మూడునాలుగు నెలల్లోగా టెండర్లు ఆహ్వానించి 8 నెలల్లోగా నగరంలోని అన్ని వీదులకు విద్యుత్‌దీపాలను ఎల్‌ఇడీగా మారుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్‌ పద్మావతి నరసింహమూర్తి, పాలికె పాలనా విభాగం నేత రిజ్వాన్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top