
బళ్లారి పాలికె కమిషనర్ దివ్యప్రభ, బళ్లారి జిల్లా కలెక్టర్ రామ్‌ప్రసాత్
ముదితల్ నేర్వగరాని విద్యగలదే అని పెద్దలు ఏనాడో సెలవిచ్చారు. భర్త ఐఏఎస్, తాను కూడా ఆ హోదాను అందుకుని ప్రజాసేవ చేయాలని తపించారామె. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సొంతంగా ప్రిపరేషన్ చేపట్టి లక్ష్యాన్ని సాధించారు. బళ్లారి నగర కమిషనర్ దివ్యప్రభ పట్టుదల ఇది.
సాక్షి, బళ్లారి: సమయం ఏదైనా, కష్టాలు ఎలాంటివైనా, కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటున్నారు యువ ఐఏఎస్ అధికారిణి దివ్యప్రభ. బళ్లారి నగర కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె మంగళవారం సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. 22 ఏళ్ల వయసులో 2014 సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 82వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఎంచుకున్నారు. ఢిల్లీ, హైదరాబాద్ తదితర మహా నగరాల్లో పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లకు వెళ్లి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారంటే పొరపాటే. గర్భవతిగా ఉండగానే, కష్టపడి చదివి తాను కలలుగన్న ఐఏఎస్ సర్వీస్‌ను అందుకున్నారు. ఈ ఐఏఎస్ దంపతుల స్వస్థలం తమిళనాడు అయినప్పటికీ కన్నడలో బాగా మాట్లాడడం విశేషం. దివ్యప్రభ విజయగాథ గురించి ఆమె మాటల్లోనే...
♦ నాకు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ చదవాలనే తపన ఉండేది. అగ్రికల్చర్ బీఎస్‌సీ అయిన తర్వాత సివిల్స్ పరీక్షలు రాసి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసుకు ఎంపికై కొంతకాలం అందులో పనిచేశాను. అయితే ఎలాగైనా ఐఏఎస్ కావాలని అనుకున్నా. అప్పటికే పెళ్లి కూడా అయింది. నా భర్త రామ్ ప్రసాత్ మనోహర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం బళ్లారి జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు.
♦ పెళ్లి అయిన తర్వాత మా వారు కూడా ఐఏఎస్ సాధించాలని ప్రోత్సహించారు. గర్భంతో ఉన్నప్పటికీ పట్టుదలతో సివిల్స్ పరీక్షలు ప్రిలిమినరి, మెయిన్స్‌లో పాసయ్యాను. ఇంటర్వ్యూ కూడా బాగా చేశాను. జాతీయస్థాయిలో 82వ ర్యాంకు రావడం ఎనలేని సంతోషం కల్గించింది.
♦ ప్రిపరేషన్ కోసం సొంతంగా పుస్తకాలు చదివా. సివిల్స్ చేయాలనుకునే విద్యార్థులు ఎవరైనా సరే వారు డిగ్రీలో చదివిన సబ్జెక్ట్‌ను సివిల్స్ పరీక్షల ఆప్షన్‌లో పొందుపరచాలి. నేను డిగ్రీలో అగ్రికల్చర్ బీఎస్‌సీ చేశా. సివిల్స్‌లోనూ నేను అగ్రికల్చర్ సంబంధిత సబ్జెక్ట్ ఎంచుకోవడం వల్ల సులభంగా పాస్ కావడానికి వీలైంది. ఇలా కాకుండా చాలా మంది విద్యార్థులు తెలియకుండా తమకు ఏదో తోచిన విధంగా ఆప్షనల్ సబ్జెక్ట్‌ను ఎంచుకోవడంతో వారి లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు.
♦ డెహ్రాడూన్‌లో ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసిన తర్వాత కార్వారలో ప్రొబేషన్ పూర్తి చేశా. అనంతరం రాయచూరు జిల్లా లింగసూగూరులో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేసిన తర్వాత బళ్లారిలో ప్రప్రథమంగా నగర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా.
♦ జిల్లా కలెక్టర్ అయిన నా భర్త నుంచి నగరాభివృద్ధికి ఆయన సహకారం, సలహాలు కూడా తీసుకుని అభివృద్ధికి కృషిచేస్తా.
చెత్త సేకరణకు స్మార్ట్ కార్డ్
బళ్లారిని స్వచ్ఛ బళ్లారిగా మారుస్తాం. బళ్లారి నగరంలోని ప్రతి ఇంటికి స్మార్ట్ కార్డు అందజేసి చెత్త సేకరణ చేపట్టేందుకు ప్రయత్నం చేస్తాం. స్మార్ట్ కార్డు వల్ల ప్రతి రోజు వారి వద్ద ఉన్న చెత్త కేజీల రూపంలో లెక్కకట్టి, ఆ బరువును బట్టి నగదు ఇస్తాం. దీనివల్ల ఎక్కడా రోడ్లలో చెత్త వేయకుండా జాగ్రత్తలు పాటిస్తారు. ఈ స్మార్డ్‌కార్డుల విధానాన్ని త్వరలో ఆచరిస్తా. పారిశుధ్యాన్ని మెరుగుపరచి స్వచ్ఛ బళ్లారిగా మార్చడమే లక్ష్యం.
♦ ప్రస్తుతం బళ్లారి నగరంలో వారం రోజులకొకసారి నీరు సరఫరా చేస్తున్నారు. మూడు రోజులకొకసారి నీరు సరఫరా చేసే విధంగా చూస్తాం.