అమ్మఫార్మశీలు


 చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్రంలో మరో 16 అమ్మ ఫార్మశీలు వెలిశాయి. రూ.1.60 కోట్ల తో 16 జిల్లాల్లో సిద్ధం చేసిన ఫార్మశీలను ముఖ్యమంత్రి జయలలిత సచివాలయం నుంచే సోమవారం ప్రారంభించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన మందులను సహకార రంగం ద్వారా అందజేయాలని గత ఏడాది జయ సంకల్పించారు. మొత్తం వంద ఫార్మశీల ఏర్పాటుకు రూ.20 కోట్లు కేటాయించారు. గత ఏడాది జూన్‌లో  కాంచీపురం, కడలూరు, ఈరోడ్డు, మధురై, సేలం, శివగంగై, విరుదునగర్ తదితర జిల్లాల్లో 84 అమ్మ ఫార్మశీలు వెలిశాయి. గత ఏడాది జూన్ 26వ తేదీ నుంచి ఈనెల 16వ తేదీ వరకు ఈ 84 అమ్మఫార్మశీల ద్వారా రూ.12.03 కోట్ల మందుల అమ్మకాలు జరిగాయి.

 

 వీటికి కొనసాగింపుగా సోమవారం మరో 16 అమ్మ ఫార్మశీలను జయ ప్రారంభించారు. రూ.1.60 కోట్ల పెట్టుబడితో నిర్మించిన అమ్మ ఫార్మశీలు 16 జిల్లాల్లో సేవలు ప్రారంభించాయి. ఇదిలా ఉండగా, మహిళలే కుటుంబ పోషకులుగా ఉన్నచోట బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను మంజూరు చేయాలని అన్నాడీఎంకే ప్రభుత్వం సంక్పలించింది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 185 లక్షల కుటుంబాలు ఉండగా, వీరిలో 25.81 లక్షల కుటుంబాల్లో మహిళలే పోషకులుగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

 

 కుటుంబ పోషణకు సహకరిచేలా రుణాలను మంజూరు చేసేందుకు ప్రభుత్వం రూ.750 కోట్లను కేటాయించింది. రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు రుణాలిచ్చే ఈ పథకం ఐదేళ్లపాటూ కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. అలాగే పంచాయతీల్లోని 20 వేల కుటుంబాలకు పక్కాగృహాల నిర్మాణం కోసం ఆర్థిక సహాయం చేసేందుకు అమ్మ ప్రభుత్వం సిద్ధమైంది. 2023 నాటికి గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చాలని సంకల్పించినట్లు జయ ప్రకటించారు. మారుమూల పల్లెలకు కొత్తగా రోడ్లను నిర్మించి జాతీయ రహదారులకు అనుసంధానం చేయనున్నామని ఆమె తెలిపారు. ఇందుకు ముందుగా నగరాలు, పట్టణాల్లోని రహదారులను విస్తరించనున్నట్లు ఆమె తెలిపారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top