మద్దతు వేట | AIADMK may align with BJP in Assembly poll, Left to be kept | Sakshi
Sakshi News home page

మద్దతు వేట

Sep 2 2014 11:56 PM | Updated on Mar 29 2019 9:24 PM

మద్దతు వేట - Sakshi

మద్దతు వేట

స్థానిక ఉప సమరం బీజేపీకి కలిసి వస్తోంది. తలా ఓ దారి అన్నట్టుగా ఉన్న మిత్రుల్ని మళ్లీ ఏకం చేసేందుకు ఈ ఎన్నికల్ని బీజేపీ అస్త్రంగా చేసుకుంది.

స్థానిక ఉప సమరం బీజేపీకి కలిసి వస్తోంది. తలా ఓ దారి అన్నట్టుగా ఉన్న మిత్రుల్ని మళ్లీ ఏకం చేసేందుకు ఈ ఎన్నికల్ని బీజేపీ అస్త్రంగా చేసుకుంది. మద్దతు నినాదంతో మిత్రులతో సంప్రదింపుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ బిజీ అయ్యారు.
 
 సాక్షి, చెన్నై :లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ నేతృత్వంలో మెగా కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, ఐజేకే, పుదియ నిధి తదితర పార్టీల నేతృత్వంలో ఆవిర్భవించిన ఈ మెగా కూటమి ఆ ఎన్నికల్లో తన సత్తాను చాటునేందుకు తీవ్రంగానే శ్రమించింది. బీజేపీ, పీఎంకేలు తలా ఓ ఎంపీ సీటును దక్కించుకోగా, మిగిలిన పక్షాల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఈ ఎన్నికల అనంతరం మిత్రులందరూ తలా ఓ దారి అన్నట్టుగా వ్యవహరించే పనిలో పడ్డారు. ఇందుకు కారణం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బీజేపీ విస్మరించడమే. రానురాను మిత్రులందరూ దూరం అవుతుండడంతోపాటుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచే పనిలో పడ్డారు.
 
 దీంతో ఆ మెగా కోటకు బీటలు వారినట్టే అన్న ప్రచారం ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లోను తమ కూటమి కొనసాగుతుందని లోక్‌సభ ప్రచార సమయంలో ప్రగల్భాలు పలికిన మిత్రులు తాజాగా విమర్శలు గుప్పించే పనిలో పడటం కమలనాథుల్ని కలవరంలో పడేసింది.మద్దతు వేట: బీజేపీతో పొత్తు ఉందా..? అని మిత్ర పక్షాల నేతల్ని మీడియా ప్రశ్నిస్తే..? వాళ్లనే అడగండంటూ సమాధానాలు బయలు దేరడంతో బీజేపీ కొత్త అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ మేల్కొన్నారు. పొత్తులు బెడిసి కొట్టకుండా, పదిలం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. స్థానిక ఉప సమరంలో అభ్యర్థుల్ని నిలబెట్టినా అన్నాడీఎంకే అధికార  బలం ముందు ఓటమి చవి చూడాల్సిందే. ఈ విషయాన్ని డీఎంకే, పీఎంకే, ఎండీఎంకే, ఎంఎంకే,  పుదియ తమిళగం తదితర పార్టీలు గ్రహించి, ఎన్నికలకు తాము దూరం అని ప్రకటించేశాయి.
 
 అయితే, బీజేపీ మాత్రం తాము రేసులో ఉన్నామని ప్రకటించగా, తమకు బలం ఉన్న ఒకటి రెండు చోట్ల అభ్యర్థుల్ని బరిలోకి దించేందుకు సీపీఎం రెడీ అయింది. అయితే, ఈ ఉప సమరాన్ని తనకు అనుకూలంగా మలచుకునే పనిలో బీజేపీ పడింది. గెలుపు ఓటముల్ని పక్కన పెట్టి మిత్రుల మద్దతు కూడగట్టుకోవడం, పొత్తు పదిలం లక్ష్యంగా అడుగులు వేసే పనిలో పడింది.
 మిత్రులతో సంప్రదింపులు : స్థానిక ఉప సమరాన్ని మిత్రులు పీఎంకే, ఎండీఎంకేలు బహిష్కరించటం, డీఎండీకే ఎలాంటి నిర్ణయం ప్రకటించని దృష్ట్యా, ముందుగా మద్దతు వేటకు బీజేపీ రెడీ అయింది. గత వారం డీఎండీకే అధినేత విజయకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో బీజేపీ నేతలు మంతనాల్లో మునిగిన విషయం తెలిసింది. దీంతో విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో, పీఎంకే నేత రాందాసులతో సంప్రదింపుల బాటలో తమిళి సై సౌందరరాజన్ నిమగ్నమయ్యారు.
 
 మంగళవారం ఎండీఎంకే నేత వైగోతో భేటీ అయ్యారు. ఇన్నాళ్లు బీజేపీని విమర్శిస్తూ వచ్చిన వైగో ఈ భేటీ అనంతరం కాస్త తగ్గినట్టు వ్యవహరించడం గమనార్హం. స్థానిక ఉప సమరంలో తమ మద్దతు బీజేపీ అభ్యర్థులకు ఉంటుందని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏ విధంగా పనిచేశామో ఈ ఎన్నికల్లోను సమష్టిగా పనిచేస్తామని ప్రకటించారు. వైగో మద్దతుకు హర్షం వ్యక్తం చేసిన తమిళి సై సౌందరరాజన్ తమ కూటమిలోని అన్ని పార్టీల మద్దతును కోరినట్లు తెలిపారు. విజయకాంత్ తన నిర్ణయాన్ని పార్టీ సమావేశానంతరం ప్రకటించనున్నట్టు హామీ ఇచ్చారని తెలిపారు. పీఎంకే నేత రాందాసును మద్దతు కోరామని, స్వయంగా ఆయనతో భేటీ కాబోతున్నట్టు పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే, ఉప సమరం మద్దతు వేట పేరుతో మిత్రుల్ని బుజ్జగించి పొత్తు పదిలం చేసుకోవడం లక్ష్యంగా తమిళి సై అడుగులు వేస్తుండటం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement