ఆధార్.. గుంపులో గోవిందా | Aadhar .. Govinda group | Sakshi
Sakshi News home page

ఆధార్.. గుంపులో గోవిందా

Sep 2 2013 2:57 AM | Updated on Sep 1 2017 10:21 PM

ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఎంతో కీలకమైన ఆధార్ కార్డులు పోస్టుమెన్ నిర్లక్ష్యం కారణంగా చేతికందకుండా పోయాయి.

దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఎంతో కీలకమైన ఆధార్ కార్డులు పోస్టుమెన్ నిర్లక్ష్యం కారణంగా చేతికందకుండా పోయాయి.ఈ ఘటన  దర్గాజోగళ్లిలో చోటు చేసుకుంది. వివరాలు... దర్గాజోగళ్లికి చెందిన నాలుగువేలమంది ఇటీవల కష్టనష్టాలకు ఓర్చి ఆధార్ కేంద్రంలో వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు వారందరికీ సంబంధించిన ఆధార్ కార్డులు  గ్రామంలోని పోస్టాఫీసుకు చేరాయి.

చిరునామాల ప్రకారం వాటిని ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాల్సిన పోస్ట్‌మెన్  నిర్లక్ష్యంగా వ్యవహరించి నాలుగు వేల ఆధార్ కార్డులను ఆదివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో అక్కడున్న కొందరికి అందజేసి చేతులు దులుపుకున్నాడు. కార్డులు వచ్చాయన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి చేరుకోగా తోపులాట, తొక్కిసలాట జరిగి తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో కొన్ని కార్డులు చినిగిపోయాయి.

మరో వైపు చిన్నారులు, ఆకతాయిలు కట్టలుకట్టలుగా కార్డులుచేతపట్టుకొని పోయారు.  కొందరరు రాజకీయ పార్టీల కార్యకర్తలు సైతం తమకు వ్యతిరేకంగా ఉన్నవారి కార్డులు తీసుకెళ్లారు. దీంతో వందలాది మందికికార్డులు అందకుండా పోయాయి. ప్రభుత్వ సౌలభ్యాలు పొందేందుకు తాము ఇన్నాళ్లూ ఆధార్ కార్డులు కోసం వేచి ఉన్నామని, పోస్టుమెన్ నిర్లక్ష్యం కారణంగా చేతికందకుండా పోయాయని విద్యార్థినులు వాపోయారు. ఈఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయాలని స్థానికులు భావించినప్పటికీ ఆదివారం సెలవు కావడంతో మిన్నకుండి పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement