పేరు మార్చిన భజ్జీ.. యువీది సేమ్‌ రిప్లై

Yuvraj Posts Sarcastic Reply After Harbhajans Comment - Sakshi

న్యూఢిల్లీ:  గత కొన్నేళ్లుగా భారత క్రికెట్‌లో నాల్గో స్థానంపై విపరీతమైన చర్చ నడుస్తోంది. ఈ స్థానంపై సీనియర్లతో పాటు యువ క్రికెటర్లను పరీక్షిస్తున్నప్పటికీ ఇప్పటివరకూ టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పూర్తి స్పష్టత రాలేదు. ఇటీవల కొన్ని మ్యాచ్‌ల్లో రిషభ్‌ పంత్‌ను నాల్గో స్థానంలో పంపినా అది ఫలితాన్ని ఇవ్వలేదు. కాకపోతే ప్రస్తుత భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నాల్గో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ సరైన ఆటగాడనే వాదన వినిపిస్తోంది. ఇటీవల భారత జట్టులో పునరాగమనం చేసిన అయ్యర్‌ ఒక‍్కడే ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి.

అయితే టీమిండియా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఒక ఆటగాడ్ని సూచించాడు. ఆ స్థానానికి దేశవాళీ లీగ్‌ల్లో విశేషంగా రాణిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌ సరిపోతాడని తెలిపాడు.ఈ క్రమంలోనే ఒక ట్వీట్‌ చేశాడు భజ్జీ. ‘ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌ ఇంకా నాల్గో స్థానం కోసం అన్వేషణ సాగిస్తూనే ఉంది. దేశవాళీ లీగ్‌లో పరుగుల మోత మోగిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే  తెలియదు. నువ్వు ఇలానే శ్రమించు. కచ్చితంగా కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది’ అని ట్వీట్‌ చేశాడు. ఇందుకు విజయ హాజారే టోర్నీలో సూర్య కుమార్‌ యాదవ్‌ 31 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు చేసిన విషయాన్ని ఫోటో ద్వారా ప్రస్తావించాడు.

కాగా, దీనికి స్నేహితుడు, మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ కొంటెగా రిప్లై ఇచ్చాడు. ‘ భజ్జీ.. నీకు ఎన్నిసార్లు చెప్పాలి. మనకు నాల్గో స్థానం అవసరం లేదు. మన టాపార్డర్‌ బలంగా ఉంది కదా’ అని సెటైర్‌ వేశాడు. కాగా, గతంలో నాల్గో స్థానానికి సంజూ శాంసన్‌ సెట్‌ అవుతాడని భజ్జీ పేర్కొనగా, ఇప్పుడు సూర్య కుమార్‌ యాదవ్‌ అంటూ పేరు మార్చాడు. అయితే యువీ మాత్రం అప్పుడు ఇప్పుడు కూడా ‘ మనకు నాల్గో స్థానం’ అవసరం లేదు అనే రిప్లై ఇవ్వడం గమనార్హం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top